సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలులో సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ) రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు చెబుతూ, కర్నూలులో సీఎఫ్‌టీఆర్‌ఐ రిసోర్స్ సెంటర్ నెలకొల్పే ఆలోచన లేదని సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ తమకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.
అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ తదితర దేశాలతో పోల్చుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మన దేశం వెనుకబడిపోవడానికి కారణాలు ఏమిటన్న మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఉత్పత్తి, ప్రాసెసింగ్‌కు మధ్య తగినంత అనుసంధానం లేకపోవడం, ఉత్పత్తి అభివృద్ధి, నవీకరణ లోపించడం, సప్లై చైన్‌లో సంస్థాగతమైన లోపాలు, మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. అలాగే అమెరికన్ డాలర్ మారకం విలువలో వస్తున్న మార్పులు, ఎగుమతి చేసే వస్తువుల ధరల్లో మార్పులు, ఎగుమతుల పరిమాణంలో హెచ్చు తగ్గులు ఆయా సమయంలో విదేశీ మారక ద్రవ్య విలువల్లో సంభవించే మార్పులు ఎగుమతుల విలువపై ప్రభావం చూపుతున్నట్లు మంత్రి చెప్పారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపడుతున్న చర్యల కారణంగా 2016-17లో ఆహోరోత్పత్తుల ఎగుమతుల విలువ 30.87 బిలియన్ డాలర్లు ఉండగా 2017-18 నాటికి అది 35.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు మంత్రి తెలిపారు.
రెండేళ్ళలో విశాఖలో ఎలక్ట్రో మాగ్నటిక్ లేబొరేటరీ
విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న ఎలక్ట్రోమాగ్నటిక్ ఎన్విరాన్‌మెంటల్ ఎఫెక్ట్స్ (ఈ3) లేబరేటరీ పూర్తి కావడానికి గడువును మరో రెండేళ్ళపాటు పొడిగించినట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి ఎస్.ఎస్. అహ్లూవాలియా తెలిపారు. రాజ్య సభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, రక్షణ విభాగం, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇంటర్ఫియరెన్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ కంపాటబులిటీ, ఎలక్ట్రోమాగ్నటిక్ పల్స్ వంటి కీలక రంగాలలో కన్సల్టెన్సీ సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment