ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016, 17లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో దేశ విదేశాలకు చెందిన వివిధ సంస్థలతో 996 ఒప్పందాలు(ఎంవోయూ) చేసుకుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
2016లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో మొత్తం రూ.4,78,788 కోట్ల పెట్టుబడులతో 331 ఎంవోయూలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందని, వీటిలో రూ.2,83,943 కోట్ల పెట్టుబడుల అంచనాతో కుదుర్చుకున్న 99 ఎంవోయూలకు సంబంధించి ఆయా సంస్థలు ఇప్పటి వరకు డీపీఆర్‌లు సమర్పించలేదని పేర్కొన్నారు. అలాగే, రూ.31,000కోట్ల పెట్టుబడుల అంచనాలతో కుదుర్చుకున్న 6 ఎంవోయూలపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో వాటిని వదులుకోవాల్సి వచ్చిందన్నారు. 2017 భాగస్వామ్య సదస్సులో మొత్తం రూ.10,54,431కోట్ల పెట్టుబడుల అంచనాలతో వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం 665 ఎంవోయూలను కుదుర్చుకుందన్నారు. అయితే, వీటిలో 6,33,892కోట్ల పెట్టుబడులతో కుదుర్చుకున్న 335 ఎంవోయూలకు సంబంధించి ఆయా సంస్థలు ఇంకా డీపీఆర్‌లు సమర్పించలేదన్నారు. రూ.1,75,000 కోట్లు రూపాయలు పెట్టుబడులు అంచనాతో కుదుర్చుకున్న 12 ఎంవోయూల విషయంలో ఆయా సంస్థలతో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వాటిని రద్దయినట్లు చెప్పారు.