న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో రెండు ప్రయివేట్ బిల్లులు ప్రవేశపెట్టారు. పరువు హత్యల నివారణ చట్టాన్ని తీసుకురావాలని, స్విస్ ఛాలెంజ్‌ను నియంత్రించాలంటూ ఆయన ప్రయివేట్ మెంబర్ బిల్లు పెట్టారు. పరువు హత్యల నిరోధం, భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండేలా చట్టం తేవాలంటూ విజయసాయిరెడ్డి ప్రయివేటు బిల్లు ప్రతిపాదించారు. ‘పరువు పేరుతో నేరాల నిరోధం–భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛలో జోక్యం నిరోధం బిల్లు–2017’ను విజయసాయిరెడ్డి ప్రయివేటు మెంబర్ బిల్లుగా ప్రతిపాదించారు.
ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి గల ఉద్దేశాలు, కారణాలను వివరిస్తూ.. యువత వివాహం చేసుకునేందుకు భాగస్వామిని ఎంచుకున్నప్పుడు కుటుంబం, కులం, మతం చూపుతూ పరువు పేరుతో వాటిని నిరాకరించడమే కాకుండా నేరాలకు పాల్పడటం ఇటీవల కాలంలో పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఈ నేరాలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. పరువు పేరుతో యువతీ యువకుల వివాహ భాగస్వామి ఎంపిక స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ తరహా నేరాలు ఆర్టికల్ 16(1)(బి)ని ఉల్లంఘిస్తున్నాయని వివరించారు.
ప్రస్తుతం ఉన్న చట్టాలు ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జంటలకు రక్షణ కల్పించలేకపోతున్నాయని తెలిపారు. ప్రస్తుత బిల్లు ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి జీవించే హక్కును కల్పించడంతోపాటు వేధింపులు, హింస, స్వేచ్ఛాయుత ఎంపికలో జోక్యాన్ని నిరోధిస్తుందని పేర్కొన్నారు.
స్విస్ ఛాలెంజ్ విధాన నియంత్రణ బిల్లు..
స్విస్ ఛాలెంజ్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టులలో అయాచిత ప్రతిపాదనలు ఆమోదించడాన్ని నియంత్రించేందుకు గాను రాజ్యసభలో విజయసాయిరెడ్డి బిల్లును ప్రతిపాదించారు. మౌలిక వసరుల ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రయివేటు రంగం పాత్ర ఇటీవల బాగా పెరిగిపోయిందని, కాంట్రాక్టులు ఇవ్వడంలో పారదర్శకతను ఇది సవాలు చేస్తోందని బిల్లు ప్రతిపాదనకు గల కారణాలు, ఉద్దేశాలు శీర్షికన వివరించారు.
స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రాజెక్టు ప్రతిపాదిత సంస్థకు ఎలాంటి అదనపు ప్రయోజనం ఒనగూరకుండా రాష్ట్రాలు తగిన అధ్యయనం ద్వారా పరామితులు విధించాలన్నది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశంగా వివరించారు. మౌలిక వసతుల ప్రాజెక్టులను కాంట్రాక్టుగా ఇచ్చినప్పుడు వాటిలో పారదర్శకతో ఉండేలా ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని నియంత్రించాలని పేర్కొన్నారు.