న్యూఢిల్లీ : వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రెండు ప్రైవేట్ మెంబర్ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుల్లో మొదటిది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి సవరణ అంశం. ఆర్టికల్ 19లోని క్లాజ్ 3, 4లో ఉన్న భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వం అనే పదాన్ని తొలగించాలన్న ఈ బిల్లు ఉద్దేశం. ఈ పదం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద కల్పించిన ప్రాథమిక హక్కులు పరిమితం అవుతున్నాయని, అందుకే సవరణ ద్వారా ఆ పదాన్ని తొలగించాలన్నదే సదరు బిల్లు లక్ష్యం.
ఇక ఆయన ప్రవేశపెట్టిన రెండో బిల్లు క్రిమినల్ లా (సవరణ)కు సంబంధించినది. సమాజంలో వైవాహిక బంధం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తున్నాం. దీనిని కాపాడటానికి లింగ వివక్ష లేకుండా మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నందున క్రిమినల్ లా లోని 497 సెక్షన్‌ను సవరించాలన్నది ఈ బిల్లు ఉద్దేశమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
వారికి జీతభత్యాలు ఇవ్వరాదు
లోక్‌సభను రాజ్యసభతో పోల్చి చూడొద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. రాజ్యసభ సిట్టింగ్స్ అనేవి లోక్‌సభతో అనుసంధానం చేసి చూడటం సరికాదన్నారు. పార్లమెంట్ ఏడాదికి 120 రోజులు నడపాలన్నారు. చిన్న పార్టీలకు మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వడం లేదని, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరికీ మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా సాగకుండా అడ్డుకునే వారికి జీతభత్యాలు ఇవ్వకూడదు అన్నారు. అంతరాయం కలిగిన సభా సమయానికి నష్టపరిహారంగా అంతే సమయాన్ని పొడిగించాలని విలువైన సూచన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment