సాక్షి, న్యూఢిల్లీ: జాపాలి తీర్థంలోని అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రాచీన సాహిత్యం, శాసనాలు, చారిత్రక, ఖగోళ శాస్త్ర అంచనాలు వంటి ఆధారాలతో సహా హనుమంతుడి జన్మస్థలం తిరుమలకు ఉత్తరంగా ఉన్న జాపాలి తీర్థంలోని అంజనాద్రి పర్వతమేనని టీటీడీ నిర్ధారించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కిషన్‌రెడ్డి మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలో అత్యధిక సామర్థ్యం కలిగిన సోలార్ ఫొటోవాల్టిక్ మాడ్యూల్స్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.4,500 కోట్లు కేటాయిస్తూ ఏప్రిల్ 7న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
పీఎంఎఫ్‌ఎంఈ ద్వారా ఏపీకి నిధులు
మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 2020–21లో రూ.34.98 కోట్లు, 2021–22లో రూ.14.15 కోట్లు కేటాయించినట్టు కేంద్రం తెలిపింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు బీవీ సత్యవతి, చింతా అనూరాధ, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఏపీలో పెరిగిన ఉపాధి
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం తెలిపింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు పి.వి.మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, తలారిరంగయ్యలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ.. 2019–20లో 65.02 లక్షల మంది ఉపాధి పొందగా 2020–21లో 79.8 లక్షల మంది ఉపాధి పొందారని తెలిపారు.
శ్రేయస్ పథకంలో ఏపీ విద్యార్థులు
స్కాలర్‌షిప్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీం (శ్రేయస్)లో ఏపీలో 2018–19లో 58 మంది విద్యార్థులకు రూ.19.70 లక్షలు, 2019–20లో 95 మందికి రూ.45.98 లక్షలు, 2020–21లో 93 మందికి రూ.32.71 లక్షల ఉపకార వేతనాలను యూజీసీ ద్వారా ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎన్.రెడ్డెప్ప, తలారి రంయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ లోక్‌సభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
కరోనా ప్రభావిత రంగాలకు మద్దతు
కరోనా ప్రభావిత రంగాలకు మద్దతుగా ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో పలు అంశాలు పొందుపరిచినట్టు ఎంపీ అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌధరి లిఖితపూర్వకంగా తెలిపారు. ఆ రంగాలను ప్రోత్సహించేందుకు రూ.1.1 లక్షల కోట్ల లోన్ గ్యారెంటీ స్కీమ్ ప్రకటించామని, అదనంగా మరో రూ.1.5ల క్షల కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం ప్రకటించామని వివరించారు
‘నైపుణ్యాభివృద్ధి’ కమిటీ సభ్యుడిగా ఎంపీ గురుమూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడుగా వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
పోలవరానికి తక్షణమే నిధులివ్వండి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధులు తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్గాని భరత్‌రామ్, నందిగం సురేష్, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి డిమాండ్ చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సమస్యలు, పోలవరం ప్రాజెక్టుకు విషయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి.. వాటి పరిష్కారానికి అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిధుల కోసం పలుసార్లు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు విజ్ఞప్తులు చేశారన్నారు. సవరించిన అంచనాలపై అనుమతి త్వరగా ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర విధులు, నిధుల విషయంలో పార్టీ ఎంపీలంతా కలసికట్టుగా ముందుకెళ్తున్నామని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని, అన్ని అనుమతులు కేంద్రం ఎప్పటికప్పుడు ఇవ్వాలని అన్నారు. సవరించిన అంచనాలకు వెంటనే అనుమతి ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక కమిటీలు ఆమోదించినప్పటికీ సవరించిన అంచనాలకు ఆర్థిక ఆమోదం ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్ ఆర్ ప్యాకేజీ గుండెకాయ వంటిదన్నారు. వరదల కారణంగా కాఫర్ డ్యాం వద్ద 40 మీటర్ల పైగా నీరు నిల్వ ఉందని, స్పిల్ వే ద్వారా ఈ జలాలు డెల్టా ప్రాంతానికి పంపాల్సి ఉందన్నారు. నిర్వాసితులకు ఆర్ ఆర్ ప్యాకేజీ ద్వారా పరిహారం ఇవ్వడం అత్యవసరమని.. అందుకే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. విభజన చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లయ్యిందని, రీయింబర్స్‌మెంట్ విధానంతో ఈ ఏడేళ్లు చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా ముందుకెళ్తున్నామని, విభజన చట్టం ప్రకారం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment