
సాక్షి, హైదరాబాద్: టీటీడీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మరోమారు డిమాండ్ చేశారు. టీటీడీలో చోటు చేసుకున్న సంఘటనలపై విచారణ జరిపితే అన్ని విషయాలూ వెలుగు చూస్తాయన్నారు. దర్యాప్తులో సీఎం చంద్రబాబు నిర్దోషి అని తేలితే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తాను గతంలో చెప్పినట్లుగా 13 గంటల్లోగా చంద్రబాబు ఇంట్లో సోదాలు జరిపితే నేలమాళిగల్లో దోచుకున్న ఆయన సొమ్ములన్నీ బయటపడేవని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి బుధవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీటీడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులూ అందలేదని, ఒకవేళ అందితే చట్టపరంగానే ఎదుర్కొంటానని ప్రకటించారు. ఏపీ ఎండోమెంట్ చాఫ్టర్ కిందకు వచ్చే టీటీడీకి తనకు నోటీసులు ఇచ్చే అధికారం లేదన్నారు.
14 అంశాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి
పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నంలో అవకతవకలతోపాటు రాజధాని ప్రాంతం ప్రకటనకు ముందే బినామీలతో భూముల కొనుగోళ్లు, తాత్కాలిక సచివాలయంలో అవినీతి, అమరావతిలో భూకుంభకోణాలు. చంద్రబాబు కుటుంబం విదేశీ పర్యటనలు, కాల్‌మనీ, ఓటుకు కోట్లు, ఐఎంజీ భారత్ స్కాం, అగ్రిగోల్డ్ స్కాం, బాబు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు, లోకేశ్ సంపాదన, తిరుమలలో అరాచకాలు, సింగపూర్ కంపెనీలకు రాజధాని భూములు అప్పగింత, నీరు చెట్టు కార్యక్రమంలో అవినీతి తదితర 14 అంశాలపై సీబీఐతో విచారణకు ఆదేశించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
విఠలాచార్య తరహాలో బాబు తీరు
మోత్కుపల్లి నర్సింహులును కలవాలంటే తనకు చంద్రబాబు అనుమతి అవసరం లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవానికి తనకు మోత్కుపల్లిని కలవాలనే ఆలోచన లేకపోయినా టీటీడీ నేతలకు బుద్ధి చెప్పేందుకే ఆయన్ను కలవాలని భావిస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును చైనాలోని త్రీగోర్జెస్‌తో పోలుస్తూ చంద్రబాబు విఠలాచార్య తరహాలో ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోగానే చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.