japali teertham
-
‘అంజనాద్రి’ ప్రకటనపై ప్రతిపాదన లేదు
సాక్షి, న్యూఢిల్లీ: జాపాలి తీర్థంలోని అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రాచీన సాహిత్యం, శాసనాలు, చారిత్రక, ఖగోళ శాస్త్ర అంచనాలు వంటి ఆధారాలతో సహా హనుమంతుడి జన్మస్థలం తిరుమలకు ఉత్తరంగా ఉన్న జాపాలి తీర్థంలోని అంజనాద్రి పర్వతమేనని టీటీడీ నిర్ధారించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కిషన్‌రెడ్డి మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలో అత్యధిక సామర్థ్యం కలిగిన సోలార్ ఫొటోవాల్టిక్ మాడ్యూల్స్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.4,500 కోట్లు కేటాయిస్తూ ఏప్రిల్ 7న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పీఎంఎఫ్ఎంఈ ద్వారా ఏపీకి నిధులు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 2020–21లో రూ.34.98 కోట్లు, 2021–22లో రూ.14.15 కోట్లు కేటాయించినట్టు కేంద్రం తెలిపింది. వైఎస్సార్సీపీ ఎంపీలు బీవీ సత్యవతి, చింతా అనూరాధ, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో పెరిగిన ఉపాధి ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం తెలిపింది. వైఎస్సార్సీపీ సభ్యులు పి.వి.మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, తలారిరంగయ్యలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ.. 2019–20లో 65.02 లక్షల మంది ఉపాధి పొందగా 2020–21లో 79.8 లక్షల మంది ఉపాధి పొందారని తెలిపారు. శ్రేయస్ పథకంలో ఏపీ విద్యార్థులు స్కాలర్షిప్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీం (శ్రేయస్)లో ఏపీలో 2018–19లో 58 మంది విద్యార్థులకు రూ.19.70 లక్షలు, 2019–20లో 95 మందికి రూ.45.98 లక్షలు, 2020–21లో 93 మందికి రూ.32.71 లక్షల ఉపకార వేతనాలను యూజీసీ ద్వారా ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్.రెడ్డెప్ప, తలారి రంయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ లోక్‌సభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కరోనా ప్రభావిత రంగాలకు మద్దతు కరోనా ప్రభావిత రంగాలకు మద్దతుగా ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో పలు అంశాలు పొందుపరిచినట్టు ఎంపీ అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌధరి లిఖితపూర్వకంగా తెలిపారు. ఆ రంగాలను ప్రోత్సహించేందుకు రూ.1.1 లక్షల కోట్ల లోన్ గ్యారెంటీ స్కీమ్ ప్రకటించామని, అదనంగా మరో రూ.1.5ల క్షల కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం ప్రకటించామని వివరించారు ‘నైపుణ్యాభివృద్ధి’ కమిటీ సభ్యుడిగా ఎంపీ గురుమూర్తి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడుగా వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పోలవరానికి తక్షణమే నిధులివ్వండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధులు తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్గాని భరత్‌రామ్, నందిగం సురేష్, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి డిమాండ్ చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సమస్యలు, పోలవరం ప్రాజెక్టుకు విషయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి.. వాటి పరిష్కారానికి అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి నిధుల కోసం పలుసార్లు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు విజ్ఞప్తులు చేశారన్నారు. సవరించిన అంచనాలపై అనుమతి త్వరగా ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర విధులు, నిధుల విషయంలో పార్టీ ఎంపీలంతా కలసికట్టుగా ముందుకెళ్తున్నామని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని, అన్ని అనుమతులు కేంద్రం ఎప్పటికప్పుడు ఇవ్వాలని అన్నారు. సవరించిన అంచనాలకు వెంటనే అనుమతి ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక కమిటీలు ఆమోదించినప్పటికీ సవరించిన అంచనాలకు ఆర్థిక ఆమోదం ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్ ఆర్ ప్యాకేజీ గుండెకాయ వంటిదన్నారు. వరదల కారణంగా కాఫర్ డ్యాం వద్ద 40 మీటర్ల పైగా నీరు నిల్వ ఉందని, స్పిల్ వే ద్వారా ఈ జలాలు డెల్టా ప్రాంతానికి పంపాల్సి ఉందన్నారు. నిర్వాసితులకు ఆర్ ఆర్ ప్యాకేజీ ద్వారా పరిహారం ఇవ్వడం అత్యవసరమని.. అందుకే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. విభజన చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లయ్యిందని, రీయింబర్స్మెంట్ విధానంతో ఈ ఏడేళ్లు చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా ముందుకెళ్తున్నామని, విభజన చట్టం ప్రకారం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే
సాక్షి, తిరుపతి, తిరుమల: కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలే రామభక్తుడైన ఆంజనేయుడి జన్మస్థలం అని టీటీడీ ఆధారాలతో సహా నిరూపించింది. తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది. ఈ మహత్తర, పురాణ, చారిత్రక ఆవిష్కరణను బుధవారం శ్రీరామనవమి రోజు టీటీడీ ప్రకటించటం విశేషం. 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు జాపాలిలో నిర్మించిన శ్రీఆంజనేయుని ఆలయమే హనుమ జన్మస్థలం అని ఆధారాలతో టీటీడీ వెలుగులోకి తెచ్చింది. జాపాలి మహర్షి జపం ఆచరించి శ్రీనివాసుడిని ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. శాస్త్రబద్ధంగా నిరూపణ: తమిళనాడు గవర్నర్ పురోహిత్ భక్త హనుమ జన్మస్థలాన్ని నిర్ధారిస్తూ పండితుల కమిటీ రూపొందించిన నివేదికను నవమి రోజు తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ హాజరయ్యారు. హనుమ జన్మస్థలాన్ని టీటీడీ శాస్త్రబద్ధంగా నిరూపించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలు సేకరించడం ఎంత కష్టమో తమిళనాడులోని 20 విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా తనకు బాగా తెలుసన్నారు. నాలుగు నెలలపాటు అవిశ్రాంతంగా శ్రమించిన పండితుల కమిటీని ఆయన అభినందించారు. త్వరలో పుస్తక రూపంలో నివేదిక: ఈవో జవహర్‌రెడ్డి భగవత్ సంకల్పంతోనే శ్రీరామనవమి నాడు హనుమంతుడి జన్మస్థానాన్ని తిరుమలగా నిరూపించామని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. పండితులతో కూడిన కమిటీ పౌరాణిక, వాజ్ఞయ, శాసన, భౌగోళిక ఆధారాలను సేకరించి ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. ఆధారాలతో కూడిన నివేదికను టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, త్వరలో పుస్తక రూపంలోకి తెస్తామని ప్రకటించారు. కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని కూడా హనుమంతుడి జన్మస్థలంగా చెబుతున్నారని, దీన్ని శాస్త్రీయంగా పరిశీలించామని, అక్కడ కిష్కింద అనే రాజ్యం ఉండవచ్చని, హనుమంతుడు అంజనాద్రి నుంచి అక్కడికి వెళ్లి సుగ్రీవుడికి సాయం చేసినట్లుగా భావించవచ్చన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణాలో హనుమంతుడు జన్మించినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. కమిటీ సభ్యులకు అభినందనలు.. కమిటీ సభ్యులైన ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధరశర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తుశాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్, టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మలను ఈవో అభినందించారు. పండితుల కమిటీ నాలుగు నెలల పాటు విస్తృతంగా పరిశోధించి బలమైన ఆధారాలు సేకరించిందని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇవీ ఆధారాలు.. శ్రీమద్రామాయణంలోని సుందరకాండ, అనేక పురాణాలు, వేంకటాచల మహాత్యం, ఎన్నో కావ్యాల్లో హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వర్ణించి ఉందని ఆచార్య మురళీధరశర్మ చెప్పారు. కంబ రామాయణం, వేదాంత దేశికులు, తాళ్లపాక అన్నమాచార్యులు తమ రచనల్లో వేంకటాద్రిగా, అంజనాద్రిగా అభివర్ణించారని తెలిపారు. బ్రిటీష్ అధికారి స్టాటన్ క్రీ.శ.1800లో తిరుమల ఆలయం గురించి సంకలనం చేసిన అంశాలతో సవాల్–ఏ–జవాబ్ పుస్తకాన్ని రాశారని, అందులో అంజనాద్రి అనే పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టినచోటు కావడం వల్లే అంజనాద్రి అనే పేరు వచ్చిందని ప్రస్తావించారని తెలిపారు. బాలాంజనేయుడు సూర్యదేవుడిని పట్టుకోవడానికి వేంకటాద్రి నుంచి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మళ్లీ చూడడం, వానరవీరులు వైకుంఠగుహలో ప్రవేశించడం.. లాంటి అనేక విషయాలు వేంకటాచల మహాత్యం ద్వారా తెలుస్తున్నాయన్నారు. ఈ గ్రంథం ప్రమాణమే అని చెప్పడానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో ఉన్నాయన్నారు. మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదీ నాటిది కాగా రెండో శాసనం 1545 మార్చి 6వ తేదీకి చెందినదని వివరించారు. శ్రీరంగంలో ఉన్న ఒక శిలాశాసనం కూడా దీన్ని తెలియజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆంజనేయుడు మనవాడే
సాక్షి, తిరుపతి: కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల గిరులే హనుమంతుడి జన్మ స్థలమని చరిత్ర చెబుతోంది. అంజనీసుతుడు జన్మించిన పుణ్యస్థలంపై సాగుతున్న ప్రచారాలకు ఉగాది రోజున తిరుమల తిరుపతి దేవస్థానం తెరదించనుంది. తిరుమల గిరుల్లోని జాపాలి తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమని పండితులు, ఆగమ సలహాదారులు తేల్చగా.. టీటీడీ అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించనుంది. తిరుమల కొండల్లోని జాపాలి తీర్థంలోనే హనుమంతుడు జన్మించారని పండితులు చెబుతున్నారు. జాపాలి తీర్థ విశిష్టతను టీటీడీ నిర్లక్ష్యం చేసిందని గతంలో పలువురు చరిత్రకారులు విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి ముందుకొచ్చి పురాణేతిహాసాలను అధ్యయనం చేసి హనుమ జన్మస్థలం ఎక్కడో తెలియజేయాలని పండితులు, ఆగమ సలహాదారులకు సూచించారు. అంజనాదేవి తపోఫలంగా.. ‘హనుమ జన్మస్థలం అంజనాద్రి’ పేరిట డాక్టర్ ఏవీఎస్జీ హనుమథ్ ప్రసాద్ శ్రీ పరాశర సంహిత గ్రంథం రచించారు. అందులో పచ్చటి కొండల నుదుటిన సింధూరంగా విరాజిల్లుతున్న జాపాలి మహా తీర్థమే హనుమ జన్మస్థలమని ఆయన పేర్కొన్నారు. వేంకటాద్రి పర్వత ప్రాంతంలోనే హనుమంతుడు జన్మించాడని పురాణాలు, వేద గ్రంథాలు సైతం వెల్లడిస్తున్నాయి. వేంకటాచల మహాత్మ్యంలోని భావిశోత్తర పురాణంలో ఆంజనేయుడి జన్మస్థలాన్ని ప్రస్తావించినట్టు వేద పండితులు చెబుతున్నారు. తిరుమల కొండ కృతయుగంలో వృషభాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాచలం, కలియుగంలో వేంకటాచలంగా పిలువబడుతోందని పురాణాల్లో పేర్కొన్నట్టు పండితులు స్పష్టం చేస్తున్నారు. త్రేతాయుగంలో అంజనాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందో భావిశోత్తర పురాణంలో వివరించబడింది. అందులోని మొదటి అధ్యాయం 79వ శ్లోకంలో హనుమ జన్మస్థలం, జన్మ రహస్యం గురించి పేర్కొన్నారు. అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చింది కాబట్టే వేంకటాద్రికి అంజనాద్రి అనే పేరొచ్చిందని పండితులు చెబుతున్నారు. సుపుత్రుడి కోసం మాతంగి మహర్షి సూచన మేరకు నారాయణ పర్వత ప్రాంతంలోని ఆకాశ గంగ తీర్థంలో అంజనాదేవి 12 ఏళ్లపాటు తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చిన వాయుదేవుడు ఒక ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆ ఫలం భుజించిన అంజనాదేవి ఆకాశ గంగ తీర్థం సమీపంలోని జపాలిలో హనుమంతునికి జన్మనిస్తుంది. చిరంజీవి హనుమ పుట్టిన స్థలం కాబట్టే వేంకటాచలానికి అంజనాద్రి అనే పేరు వచ్చిందని ద్వాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. జాపాలి తీర్థంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయం నిర్మించారు. 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల మహంతుల పాలనలోకి వెళ్లిన తర్వాత జాపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ జాపాలి తీర్థం మహంతుల పాలనలోనే ఉంది. -
తిరుమల జపాలి తీర్థంలో పాకిస్థాన్ జెండా?
తిరుమల: పాపనాశనం వెళ్లే మార్గంలో ఉన్న జపాలి తీర్థంలో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్ జెండాను వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. నెలవంక, నక్షత్రం గుర్తుతో తెలుపు రంగులో ఉన్న జెండాను సోమవారం ఉదయం జపాలి తీర్థం వద్ద భక్తులు గమనించారు. ఆ విషయాన్ని భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు జపాలి తీర్థం వద్దకు వెళ్లి ఆ జెండాను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉరుసు ఉత్సవాల్లో దర్గాలవద్ద కట్టే జెండానా?.. లేక పాకిస్థాన్ జెండానా?.. అని విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు.