తిరుమలలో జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం
సాక్షి, తిరుపతి: కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల గిరులే హనుమంతుడి జన్మ స్థలమని చరిత్ర చెబుతోంది. అంజనీసుతుడు జన్మించిన పుణ్యస్థలంపై సాగుతున్న ప్రచారాలకు ఉగాది రోజున తిరుమల తిరుపతి దేవస్థానం తెరదించనుంది. తిరుమల గిరుల్లోని జాపాలి తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమని పండితులు, ఆగమ సలహాదారులు తేల్చగా.. టీటీడీ అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించనుంది. తిరుమల కొండల్లోని జాపాలి తీర్థంలోనే హనుమంతుడు జన్మించారని పండితులు చెబుతున్నారు. జాపాలి తీర్థ విశిష్టతను టీటీడీ నిర్లక్ష్యం చేసిందని గతంలో పలువురు చరిత్రకారులు విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి ముందుకొచ్చి పురాణేతిహాసాలను అధ్యయనం చేసి హనుమ జన్మస్థలం ఎక్కడో తెలియజేయాలని పండితులు, ఆగమ సలహాదారులకు సూచించారు.
అంజనాదేవి తపోఫలంగా..
‘హనుమ జన్మస్థలం అంజనాద్రి’ పేరిట డాక్టర్ ఏవీఎస్‌జీ హనుమథ్ ప్రసాద్ శ్రీ పరాశర సంహిత గ్రంథం రచించారు. అందులో పచ్చటి కొండల నుదుటిన సింధూరంగా విరాజిల్లుతున్న జాపాలి మహా తీర్థమే హనుమ జన్మస్థలమని ఆయన పేర్కొన్నారు. వేంకటాద్రి పర్వత ప్రాంతంలోనే హనుమంతుడు జన్మించాడని పురాణాలు, వేద గ్రంథాలు సైతం వెల్లడిస్తున్నాయి. వేంకటాచల మహాత్మ్యంలోని భావిశోత్తర పురాణంలో ఆంజనేయుడి జన్మస్థలాన్ని ప్రస్తావించినట్టు వేద పండితులు చెబుతున్నారు. తిరుమల కొండ కృతయుగంలో వృషభాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాచలం, కలియుగంలో వేంకటాచలంగా పిలువబడుతోందని పురాణాల్లో పేర్కొన్నట్టు పండితులు స్పష్టం చేస్తున్నారు. త్రేతాయుగంలో అంజనాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందో భావిశోత్తర పురాణంలో వివరించబడింది. అందులోని మొదటి అధ్యాయం 79వ శ్లోకంలో హనుమ జన్మస్థలం, జన్మ రహస్యం గురించి పేర్కొన్నారు.
అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చింది కాబట్టే వేంకటాద్రికి అంజనాద్రి అనే పేరొచ్చిందని పండితులు చెబుతున్నారు. సుపుత్రుడి కోసం మాతంగి మహర్షి సూచన మేరకు నారాయణ పర్వత ప్రాంతంలోని ఆకాశ గంగ తీర్థంలో అంజనాదేవి 12 ఏళ్లపాటు తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చిన వాయుదేవుడు ఒక ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆ ఫలం భుజించిన అంజనాదేవి ఆకాశ గంగ తీర్థం సమీపంలోని జపాలిలో హనుమంతునికి జన్మనిస్తుంది. చిరంజీవి హనుమ పుట్టిన స్థలం కాబట్టే వేంకటాచలానికి అంజనాద్రి అనే పేరు వచ్చిందని ద్వాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. జాపాలి తీర్థంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయం నిర్మించారు. 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల మహంతుల పాలనలోకి వెళ్లిన తర్వాత జాపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ జాపాలి తీర్థం మహంతుల పాలనలోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment