భవన నిర్మాణ కార్మికులకు స్మార్టు కార్డులు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ పథకంలో రాష్ట్రీయ పాస్ట్ బీమా, ఆమ్ ఆద్మీ బీమా యోజన, వృద్ధాప్య పింఛన్ తదితర మూడు అంశాలను పొందుపరుస్తామన్నారు.శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిలను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ మోడల్ ఐటీఐగా తీర్చిదిద్దేందుకు మల్లేపల్లిలోని ఐటీఐకి రూ.10 కోట్లు కేటాయించినట్టు చెప్పా రు. శ్రామికుల నైపుణ్యాన్ని పెంచేందుకు హైదరాబాద్‌కు దగ్గరలో వృత్తి విద్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి నాయిని మాట్లాడుతూ కార్మికుల డబ్బులు దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో రూ.600 కోట్లు రావాల్సి ఉందన్నారు. రూ.420 కోట్లను ఏపీ సీఎం చంద్రబాబు అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నట్టు చెప్పారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కామల్ల ఐలయ్య, అధ్యక్షులు కాలేబు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాములు, కోశాధికారి లక్ష్మయ్య, కార్యదర్శి అల్వాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.