మృత్యు పిల్లర్‌  | Tragedy at Gopanpalli with two childrens deaths | Sakshi
Sakshi News home page

మృత్యు పిల్లర్‌ 

Published Sun, Oct 28 2018 3:32 AM | Last Updated on Sun, Oct 28 2018 3:32 AM

Tragedy at Gopanpalli with two childrens deaths - Sakshi

గోపన్‌పల్లిలో పిల్లర్‌ కూలడంతో మృతి చెందిన చిన్నారి

హైదరాబాద్‌: నగరానికి వలస పోయి చేతనైన పనిచేసుకుంటూ తమ పిల్లలకు కడుపు నింపుకుందామనుకున్న ఆ దంపతుల ఆశ తీరకుండానే ఆవిరైపోయింది. బతుకుదెరువు కోసం భవన నిర్మాణ కూలీలుగా ఇద్దరు చిన్నారులతో వలస వచ్చిన ఆ భార్యాభర్తలు నగరంలో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న భవనానికి పునాది లేకుండా సిమెంట్‌ ఇటుకలతో నిర్మించిన ఓ పిల్లర్‌ వారి పిల్లల పాలిట మృత్యు శకటమైంది. తమ అభాగ్య జీవితాల్లో భాగ్య రేఖలు నింపుతారని కొండంత ఆశతో ఉన్న ఆ దంపతులకు ఆ పిల్లర్‌ తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రవీందర్‌ చెప్పిన కథనం మేరకు..ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన దస్తగిరి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు వలసవచ్చి గోపన్‌పల్లిలోని బెల్ల్ల విస్తవిల్లాస్‌ ఆర్చ్‌లో ఉంటూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు.

శుక్రవారం బెర్ల విస్తవిల్లాస్‌ ఆర్చ్‌లోని భవనంలో కూలీ పనులు చేస్తుండగా వారి కూతుళ్లు అమ్ములు(6), ప్రవళిక(3) ఇద్దరు కలిసి భవనం ముందు ఆడుకుంటున్నారు. ఆ చిన్నారులు ఆడుకుంటుండగా మధ్యాహ్నం పిల్లర్‌ కుప్పకూలిపోయింది. అందులోని సిమెంట్‌ ఇటుకలు ఆ చిన్నారులపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో వారిని నల్లగండ్లలోని సిటిజన్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత అక్కడ నుండి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మాణదారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషయం తెలుసుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్‌ కొమిరిశెట్టి సాయిబాబా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. సంఘటన గురించి పోలీసులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

నాణ్యత లేకుండా నిర్మించడమే కారణం 
గోపన్‌పల్లిలోని బెర్ల విస్తవిల్లార్‌ ఆర్చ్‌ పేరుతో ఓ సంస్థ ఇండిపెండెంట్‌ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణాల్లో భాగంగా భవన డిజైన్‌ కోసమని సిమెంట్‌ ఇటుకలతో పునాది లేకుండానే ఓ పిల్లర్‌ను నిర్మించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement