అక్రమ ఇసుక దందాపై దాడిశెట్టి పోరు | Illegal sand danda | Sakshi

అక్రమ ఇసుక దందాపై దాడిశెట్టి పోరు

Published Sun, Apr 19 2015 4:07 AM | Last Updated on Mon, Oct 29 2018 8:21 PM

Illegal sand danda

బొద్దవరం డంపింగ్‌యూర్డులో నిల్వల్ని గుర్తించిన ఎమ్మెల్యే రాజా
  స్థానికాధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు
  రైతులు, పార్టీ నాయకులతో ఏడున్నర గంటలకు పైగా యూర్డులోనే నిరీక్షణ
  చివరికి వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక, 11లారీలు, రెండు జేసీబీల సీజ్

 
 తుని :కోట్ల విలువ చేసే ఇసుక అక్రమంగా తరలిపోతుంటే అవినీతితో, అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో పట్టించుకోని అధికారులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తన పట్టుదలతో దిగివచ్చేలా చేశారు. అక్రమ ఇసుక నిల్వలను స్వయంగా గుర్తించిన ఆయన వాటిని స్వాధీనం చేసుకునే వరకూ పట్టువిడవ లేదు. ఏడున్నర గంటలపాటు అధికారుల కోసం నిరీక్షించి మరీ వేలాది క్యూబిక్ మీటర్ల అక్రమ ఇసుక నిల్వలను, తరలించడానికి ఉద్దేశించిన వాహనాలను పట్టించారు.
 
 ఇసుక అక్రమ దందాతో తాండవ ఒడ్డున  పంట భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని సంకల్పించిన ఎమ్మెల్యే రాజా  రైతులు, మండల వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కోటనందూరు మండలం బొద్దవరం వెళ్లారు. తాండవ నదిలో తవ్విన ఇసుకను నిల్వచేసిన డంపింగ్ యార్డుకు వెళ్లి, 11 లారీలు, రెండు జేసీబీలతోపాటు వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను గుర్తించారు. దీనిపై స్థానిక రెవెన్యూ, మండల పరిషత్ అధికారులకు సమచారమిచ్చారు. గంటలు గడుస్తున్నా స్థానిక అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ అరుణ్‌కుమార్, పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి ఇసుక నిల్వలు, వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
 అధికారులు వచ్చే వరకు కదిలేది లేదన్న ఎమ్మెల్యే రాత్రి తొమ్మిది గంటల వరకూ అక్కడే ఉండిపోయూరు. కాగా అధికార పార్టీ పెద్దలు చీకటిపడ్డాక ఇసుక అక్రమార్కులను ఉసిగొల్పి ఎమ్మెల్యేను, గ్రామస్తులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, తహశీల్దారు పి.వరహాలయ్య, ఎంపీడీఓ మధుసూదన్‌లు వచ్చి ఇసుక తరలింపుకు ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. అయితే లిఖితపూర్వకంగా చెబితేనే అక్కడ నుంచి కదులుతానని ఎమ్మెల్యే రాజా తేల్చిచెప్పడంతో చివరికి సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు.  ఇదంతా జరిగే సరికి రాత్రి 10 గంటలైంది.
 
 రైతుల శ్రేయస్సుకు రాజీలేని పోరు: ఎమ్మెల్యే రాజా
 తాండవ నదిలో ఇసుకను గృహనిర్మాణదారుల కోసమంటూ పంచాయతీ జారీ చేసే పర్మిట్లను అడ్డుపెట్టుకుని  రోజుకు రూ.కోటి పైగా విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఎమ్మెల్యే రాజా విలేకరులకు చెప్పారు. కోటనందూరు నుంచి తుని మండలం వరకూ ఉన్న తాండవలో సుమారు పదిచోట్ల అధికారపార్టీ అండదండలతో ఇసుక మాఫియూ చెలరేగిపోతోందన్నారు. ఆరునెలలుగా ఇది జరుగుతున్నా ఒక్క అధికారీ పట్టించుకోలేదని ఆరోపించారు. విచ్చలవిడి తవ్వకాలతో నదీగమనం మారి సాగు భూములు నదిలో కలిసిపోతున్నాయని, బోరుబావుల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఇసుకమాఫియాను అరికట్టేంత వరకూ రాజీ లేని పోరాటం చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ గొర్లి రామచ ంద్రరావు, మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పెదపాటి అమ్మాజీ, పార్టీ నాయకులు దాడి బాబులు, వేముల రాజబాబు, చింతకాయల చినబాబ్జి, లగుడు శ్రీను, లంకప్రసాద్, ఎల్లపు సూర్యనారాయణ, సుర్ల అప్పలనాయుడు, కూరపాటి రమణ, బర్రి అప్పారావు, రేలంగి రమణాగౌడ్, మోతుకూరి వెంకటేష్, పలువురు రైతులు ఉన్నారు.
 
 ప్రోటోకాల్‌ను విస్మరించిన అధికారులు

 ఎమ్మెల్యే రాజా, రైతులు కలసి అనధికార ఇసుక నిల్వలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు సకాలంలో స్పందించలేదు.   చివరికి డిప్యూటీ తహశీల్దార్ ఆర్.వెంకటేశ్వరరావు వచ్చి లారీలు, జేసీబీలు,ఇసుక నిల్వల వివరాలను నమోదు చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నిం చగా రెండు నిమిషాలు మాట్లాడాక స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి బందోబస్తు ఇవ్వవలసిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ఎమ్మెల్యే బొద్దవరం వచ్చిన అరగంటకు వచ్చిన కోటనందూరు ఎస్సై గోపాలకృష్ణ పది నిమిషాల్లోనే ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రాగా వెళ్లిపోయారు. అనంతరం తహశీల్దార్, ఎంపీడీఓ కూడా ఇలాగే వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement