డంపింగ్ యార్డు మార్పునకు కృషి
పులివెందుల : మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు మార్పునకు కృషి చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన వెంకటాపురం ప్రజల తరఫున.. ప్రస్తుతం చెత్తను వేస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు పురపాలక ప్రాంత పరిధిలోని చెత్తను ఇక్కడ వేయడం వల్ల వర్షాకాలంలో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా పశువుల మేత కోసం వదిలిన ఖాళీ స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల మూగ జీవాలకు మేత కరువయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
అనంతరం నామాలగుండు ప్రాంతంలోని కొండ వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు సూచించారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి కలిసి నామాలగుండు రోడ్డులోని కొండ కటింగ్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎటువంటి సమస్య ఉండదని మున్సిపల్ కమిషనర్‌కు ఎంపీ సూచించారు. ఈ స్థలం డీకేటీదని తమకు రాతపూర్వకంగా ఇస్తే ఇక్కడ ఏర్పాటుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరిశీలిస్తామన్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళతా :యార్డు మార్పునకు కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని ఎంపీ చెప్పారు. ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు. కావున తక్షణమే వెంకటాపురం నుండి ఇక్కడికి మార్పు చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం మున్సిపల్ వర్సెస్ విద్యుత్ శాఖ అనే శీర్షికన సాక్షిలో ప్రచురించిన కథనానికి స్పందించిన ఆయన ట్రాన్స్‌కో సీఎండీతో ఫోన్‌లో చర్చించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌గా విడతల వారీగా బిల్లులు చెల్లిస్తామని సూచించారు. సామరస్యంగా ఇరు శాఖల అధికారులు సమన్వయంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కౌన్సిలర్ వరప్రసాద్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఈశ్వరయ్య, వెంకటాపురం గ్రామస్తుడు ఆంజనేయులునాయుడు, తదితరులు పాల్గొన్నారు.