avani gadda
-
దివిసీమలో పేలుడు కలకలం..
సాక్షి, కృష్ణా : అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో గురువారం రాత్రి జరిగిన భారీ పేలుడు తీవ్ర కలకళాన్ని రేకెత్తించింది. వేకనూరు గ్రామానికి చెందిన తుంగల దిలీప్ ఇంటి సమీపంలోని గోడల చావిడి నుంచి రాత్రి 8.45 సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించగా ఈ శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల మేర వినిపించింది. దీంతో పాటు చుట్టు పక్కల కొన్ని మీటర్ల దూరం వరకు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. అసలే ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం కావటంతో ఏమి జరిగిందో అర్ధం కాక సమీప ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ రమేష్ రెడ్డి, సీఐ బీబీ రవికుమార్, ఎస్సై సందీప్‌లు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. (పరిటాల శ్రీరామ్‌కు కండీషనల్ బెయిల్) పశువుల చావిడిలో యూరియా గోతాల వద్ద పేలుడు సంభవించిందని,అవి వ్యవసాయం నిమిత్తం సోడియం, నైట్రేడ్, ఆమోనియంలను నిలువ ఉంచడం జరిగింది అని పోలీసులు తెలిపారు. ఒత్తిడికి గురి అయ్యి పేలినట్లు బాంబ్ స్క్వాడ్ టీం తెలిపినట్లుసీ ఐ భీమేశ్వర రవికుమార్ తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించినట్లు తదుపరి దర్యాప్తు చేయనున్నట్లు సి.ఐ తెలిపారు. (‘ఏబీఎన్’పై వెంటనే చర్యలు తీసుకోండి) -
కృష్ణా నదిలోకి దూకిన యువతి
సాక్షి, కృష్ణా: మచిలీపట్నం సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పై నుంచి డిగ్రీ చదవుతున్న ఓ యువతి కృష్ణానదిలోకి దూకింది. అయితే ఘటనా స్థలానికి దగ్గరలోనే అవనిగడ్డ పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు ఆమెను కాపాడారు. అవనిగడ్డ పోలీసులు మాణిక్యాలరావు, కానిస్టేబుల్ గోపిరాజు నదిలోకి దూకి ఆమెకు రక్షించడంతో.. ప్రాణాలతో బయటపడింది. వెంటనే స్థానికుల సహాయంతో యువతిని అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. యువతిని కాపాడిన అవనిగడ్డ ఏఎస్ఐ మాణిక్యాలరావును డీజీపీ గౌతమ్‌సవాంగ్, పలువురు ఉన్నతాధికారులు అభినందించారు. -
దివిసీమలో గాలివాన బీభత్సం
సాక్షి, అవనిగడ్డ(కృష్ణా) : దివిసీమలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారు జామున ఉదయం 3గంటల నుంచి 5గంటల వరకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బందలాయి చెరువు ఎస్సీ కాలనీలో మూడు చోట్ల భారీ చెట్లు పడిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. తోకల మోహన్‌కుమార్, దేసు శ్రీనివాసరావుకు చెందిన రెండు బడ్డీలపై భారీ వేపచెట్టు పడటంతో బడ్డీలు ధ్వంసమయ్యాయి. పలు సామాన్లు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు రహదారికి అడ్డుగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నీటమునిగిన కార్యాలయాలు, పాఠశాలలు.. అవనిగడ్డలో 85 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 70 నుంచి 80 కి.మీ వేగంతో వీచిన ఈదురు గాలులు వీచాయి. అవనిగడ్డలో తహసీల్దార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ, ఆర్అండ్బీ అతిథిగృహం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిశువిద్యామందిరం స్కూల్ ఆవరణంతా వర్షం నీటితో నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వణికించిన ఈదురుగాలులు కోడూరు(అవనిగడ్డ): దివిసీమ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి వేళ ఈదురుగాలులతో కూడిన వర్షం వణికించింది. గాలుల ప్రభావానికి మండలంలోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నెలకొరిగాయి. కృష్ణాపురం, నరసింహపురం, వి.కొత్తపాలెం, బైపాస్ రోడ్డు, పిట్టల్లంక, రామకృష్ణాపురం, మందపాకల గ్రామాల్లో చెట్లు రోడ్డుకు అడ్డుగా కూలాయి. మండల కేంద్రంలోని అంబటి బ్రహ్మణ్య కాలనీ, మెరకగౌడపాలెం ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరగా నివాసులు ఇబ్బందులు పడ్డారు. అనేకచోట్ల విద్యుత్‌వైర్లపై చెట్ల పడడంతో సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విద్యుత్‌తీగలు తెగిపోవడంతో విద్యుత్‌శాఖ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది. అవనిగడ్డ మండల పరిధిలో మొత్తం 28 చోట్ల చెట్లు పడి, గాలికి కరెంట్ వైర్లు తెగిపోయాయి. మండల పరిధిలోని పులిగడ్డ పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ ఉన్న విద్యుత్ స్తంభం పడిపోయింది. అప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ డీఈ ఉదయభాస్కర్ ఆదేశాల మేరకు ఏఈ ఎఎన్ఎం రాజు ఉదయం 5 గంటల నుంచే సిబ్బంది మరమ్మతులు చేపట్టి విద్యుత్‌ను పునరుద్దరించారు. -
బుసకనూ బొక్కేస్తున్నారు
సాక్షి, అవనిగడ్డ(కృష్ణా) : మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా బుసక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి అక్రమంగా రవాణా సాగుతున్నా అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్లను స్పీడుగా తోలడం వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ఈ ప్రాంత ప్రజలు భయాందోనలకు గురవుతున్నారు. భారీగా తవ్వకాలు మండల పరిధిలోని వేకనూరులో సొసైటీ భూములు, కృష్ణానది ఒడ్డు నుంచి బుసక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఇష్టారాజ్యంగా ఈ ప్రాంతంలో పొక్లెయిన్లు పెట్టి బుసకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. నాలుగు రోజుల్లో అవనిగడ్డ మండలంలో రూ.10 లక్షల విలువైన మట్టి, బుసకను అక్రమంగా తరలించారని ఎడ్లంక, పల్లెపాలెం వాసులు చెబుతున్నారు. ట్రాక్టర్లపై పట్టాలు కప్పకుండా తరలిస్తుండటంతో దుమ్మురేగి స్థానికులు, ట్రాక్టర్ల వెనుకవచ్చే వారి కళ్లల్లో పడుతోంది. దుమ్ముతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. బుసక ట్రాక్టర్ల వల్ల అవనిగడ్డ నుంచి ఎడ్లంక వెళ్లలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కొందరు డ్రైవర్లు దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. పట్టించుకోని అధికారులు నాలుగు రోజుల నుంచి జరుగుతున్న అక్రమ బుసక రవాణాపై అధికారులు, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఎడ్లంక, పల్లెపాలెం ప్రజలు విమర్శిస్తున్నారు. ట్రాక్టర్ ట్రక్కులపై ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా స్థానిక పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల మీదుగానే యథేచ్ఛగా తరలివెళుతున్నా అధికారుల్లో స్పందన లేదని చెప్పారు. రెండు గ్రామాల నుంచి.. మండల పరిధిలోని రామచంద్రపురం, దక్షిణ చిరువోలులంక గ్రామాల నుంచి జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ బుసక, మట్టి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీనిపై అవనిగడ్డ తహసీల్దార్ ఎన్. నరసింహమూర్తిని వివరణ కోరగా మండలంలో ఎక్కడా బుసక, మట్టి, ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని, వీఆర్వోలను పంపించి అలాంటివి జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏడాదిలో పదివేల ట్రక్కులకు పైగా తరలింపు నాలుగు రోజుల నుంచి వేకనూరు లంకల్లో యథేచ్ఛగా బుసక, మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. రోజుకు 20 ట్రాక్టర్లకు పైగా బుసకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లు నడపడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయి. ట్రక్కులపై ఎలాంటి పరజా లేకుండా వెళ్లడంతో కళ్ల నిండా దుమ్ము పడుతోంది. ఏడాదిలో ఎడ్లంక, వేకనూరు నుంచి పదివేలకు పైగా ట్రాక్టర్ ట్రక్కుల ఇసుకను తరలించారు. – దోవా గోవర్దన్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నాలుగు రోజుల నుంచి మా ఊరి మీదుగా పెద్దఎత్తున బుసక అక్రమ రవాణా సాగుతోంది. ట్రాక్టర్లు చాలా స్పీడుగా వెళుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు. ఈ రోడ్డుపై వెళుతుంటే కళ్లనిండా బుసక, దుమ్ము పడుతోంది. రోడ్డుపై ప్రయాణించలేకపోతున్నాం. – కొల్లు గోపాలకృష్ణ, పాతఎడ్లంక -
అవనిగడ్డ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
కోడూరు : వివిధ సుదూరు ప్రాంతాల నుంచి పవిత్ర కృష్ణాసాగరసంగమంకు వచ్చే భక్తులు అవనిగడ్డ నుంచి విధిగా ట్రాఫిక్ అంక్షాలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. గురువారం సంగమం వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న అవనిగడ్డ సీఐ మూర్తి విలేకర్లతో ట్రాఫిక్ అంక్షాల గురించి తెలిపారు. అవనిగడ్డ నుంచి వి.కొత్తపాలెం–కోడూరు–దింటిమెరక–పాలకాయతిప్ప మీదగా సంగమానికి చేరుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులు మాత్రం కోడూరు–ఉల్లిపాలెం మీదగా హంసలదీవి రావాలన్నారు. హంసలదీవిలో అన్ని ఆర్టీసీ బస్సులను నిలిపివేయడం జరుగుతుందని, అక్కడ నుంచి పాలకాయతిప్ప సముద్రతీరం వరకు భక్తులను మినిబస్సుల ద్వారా పంపనున్నట్లు సీఐ తెలిపారు. ప్రయివేటు వాహనాలు మొత్తం దింటిమెరక మీదగా అనుమతిస్తామని, అవి నేరుగా పాలకాయతిప్ప వెళ్లవచ్చని చెప్పారు. డాల్ఫిన్భవనం నుంచి ప్రతి భక్తులు సంగమం వరకు నడిచి వెళ్లాలని, ఏవిధమైన వాహనాలను సంగమంకు అనుమతించడం లేదని తెలిపారు. తిరుగు ప్రయాణం ఉల్లిపాలెం మీదగా కోడూరు–వి.కొత్తపాలెం గుండా అవనిగడ్డ చేరుకోవాలని సీఐ సూచించారు. పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లో మాత్రమే భక్తులు తమ వాహనాలను నిలపాలన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలిచ్చారు. -
చెరిగిపోతున్న చరిత్ర
అవనిగడ్డ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో స్థానిక లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ఇష్టారాజ్యంగా చేస్తున్న రంగుల తొలగింపు కార్యక్రమం వల్ల ఎంతో విలువైన చారిత్రక ఆధారాలు చెదిరిపోతున్నాయి. రూ.17లక్షలతో ఆలయం చుట్టూ గ్రానైట్స్ ఏర్పాటు, గతంలో వేసిన రంగులు, ప్లాస్టింగ్ నిర్మాణాల తొలగింపు, సహజ రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. ఆలయం చుట్టూ గ్రానైట్ పనులను ఐదు రోజుల కిందటే ప్రారంభించారు. ఆలయం లోపల ఉన్న స్తంభాలపై పలు రకాల శిల్పాలు చెక్కగా, వాటిపై ప్లాస్టింగ్ చేయించి రంగులు వేయడంతో మరుగున పడిపోయాయి. వీటిని తొలగించి పూర్వ వైభవం తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు. ఎంతో సున్నితమైన ఈ పనులను జాగ్రత్తగా చేయకపోతే చాలా చిత్రాలు, ఆధారాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెయ్యేళ్ల చరిత్రకు ముప్పు? ఈ ఆలయాన్ని వెయ్యేళ్ల క్రితం చోళులు నిర్మించారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శిల్పకళా సౌందర్యంతో కూడిన 32 స్తంభాలతో ర«థం ఆకృతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం లోపల స్తంభాలపై గోవర్థనోద్ధరణ, కాళింది మర్ధనం, వేణుగోపాల, షోడషభుజ, నటరాజ శిల్పాలతో పాటు ఎన్నో పౌరాణిక శిల్పాలు చెక్కారు. దక్షిణవైపున స్తంభాలపై శ్రీరామ పట్టాభిషేకం ఉంది. ఇవి ఏ కాలం నాటివో చెప్పలేకపోతున్నప్పటికీ.. తదనంతర కాలంలో జరిగిన అభివృద్ధి పనుల దృష్ట్యా కొన్ని స్తంభాలకు రకరకాల డిజైన్లతో ప్లాస్టింగ్ పనులు చేయించారు. దీనివల్ల పూర్వపు శిల్పకళా సౌందర్యం మరుగున పడింది. స్తంభాలపై చెక్కిన గుర్రం, మనిషి తల, చిన్నచిన్న గొలుసుల డిజైన్లు, ఆభరణాలు ఇక్కడికి వచ్చే భక్తులను ఎంతో అబ్బురపరిచేవి. అంతేకాదు చారిత్రక ఆనవాళ్లు తెలియజేసే పలు రకాల శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయం మూల భాగాల్లో చేసిన రాతి గొలుసులు ఆనాటి శిల్పకళకు అద్దం పడుతుండగా, నేటి జిమ్మాస్టిక్ని పోలిన స్త్రీల నాట్యభంగిమలు, శ్లాబుపై చెక్కిన నాగేంద్రుడి చిత్రాలతో పాటు ఎన్నో సున్నితమైన శిల్పాలు ఉన్నాయి. ప్రస్తుతం పాత పెయింటింగ్, ప్టాస్టింగ్ తొలగింపు కార్యక్రమం చేపట్టగా జాగ్రత్తగా పనులు చేయకపోతే చాలా చారిత్రక ఆధారాలు చెరిగిపోయే ప్రమాదముంది. ఇటీవల మూడు రోజుల పాటు ఆలయం లోపల రెండు స్తంభాలపై చేసిన ప్లాస్టింగ్ని తొలగించే సమయంలో స్తంభాలపై చెక్కిన అద్భుత శిల్పకళా చిత్రాలు విరిగిపోయాయి. పనులు జాగ్రత్తగా చేయకపోతే చారిత్రక ఆధారాలు కనుమరుగయ్యే ప్రమాదముంది.