అవనిగడ్డ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
కోడూరు :
వివిధ సుదూరు ప్రాంతాల నుంచి పవిత్ర కృష్ణాసాగరసంగమంకు వచ్చే భక్తులు అవనిగడ్డ నుంచి విధిగా ట్రాఫిక్ అంక్షాలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. గురువారం సంగమం వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న అవనిగడ్డ సీఐ మూర్తి విలేకర్లతో ట్రాఫిక్ అంక్షాల గురించి తెలిపారు. అవనిగడ్డ నుంచి వి.కొత్తపాలెం–కోడూరు–దింటిమెరక–పాలకాయతిప్ప మీదగా సంగమానికి చేరుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులు మాత్రం కోడూరు–ఉల్లిపాలెం మీదగా హంసలదీవి రావాలన్నారు. హంసలదీవిలో అన్ని ఆర్టీసీ బస్సులను నిలిపివేయడం జరుగుతుందని, అక్కడ నుంచి పాలకాయతిప్ప సముద్రతీరం వరకు భక్తులను మినిబస్సుల ద్వారా పంపనున్నట్లు సీఐ తెలిపారు. ప్రయివేటు వాహనాలు మొత్తం దింటిమెరక మీదగా అనుమతిస్తామని, అవి నేరుగా పాలకాయతిప్ప వెళ్లవచ్చని చెప్పారు. డాల్ఫిన్‌భవనం నుంచి ప్రతి భక్తులు సంగమం వరకు నడిచి వెళ్లాలని, ఏవిధమైన వాహనాలను సంగమంకు అనుమతించడం లేదని తెలిపారు. తిరుగు ప్రయాణం ఉల్లిపాలెం మీదగా కోడూరు–వి.కొత్తపాలెం గుండా అవనిగడ్డ చేరుకోవాలని సీఐ సూచించారు. పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లో మాత్రమే భక్తులు తమ వాహనాలను నిలపాలన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలిచ్చారు.