krishana pusakaralu
-
రైల్వే ‘పుష్కర’ సమీక్ష
మునుముందు రద్దీకి తగినట్లు సన్నాహాలు ఉన్నతాధికారుల పరిశీలన విజయవాడ (రైల్వే స్టేషన్) : పుష్కర యాత్రికులకు రైల్వే మెరుగైన సౌకర్యాలను కల్పించింది. రానున్న రోజుల్లో పెరిగే రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ పరిసరాలయిన రైల్వేస్టేడియం, తారాపేట టెర్మినల్, బి.ఆర్.టి.ఎస్ రోడ్లలలో పుష్కరనగర్లను ఏర్పాటు చేసింది. మరోవైపు శాటిలైట్ స్టేషన్లలో ప్రత్యేక రైళ్లు నిలిపివేసి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో తరలించడంతో విజయవాడ స్టేషన్లో రద్దీ తగ్గింది. అదనపు బుకింగ్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, ఎలక్ట్రానిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయడం వల్ల సత్వరం టికెట్లు పొందుతుండంతో బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది. స్టేషన్లో పుష్కర రద్దీని దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏ.కె.గుప్తా శుక్రవారం పరిశీలించారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని డి.ఆర్.ఎం అశోక్‌కుమార్, ఏ.డీ.ఆర్.ఎం కె.వేణుగోపాలరావులకు సూచించారు. వివిధ రైళ్ల రాక,పోకలను తెలిపే వివరాలతో కూడిన చార్టులను యాత్రికుల బస చేసే పుష్కర నగర్లలో ఏర్పాటు చేశారు. తూర్పు ద్వారం వద్ద నిషేధాజ్ఞలు స్టేషన్‌లోని తూర్పుముఖద్వారం నుంచి కేవలం రిజర్వుడు ప్రయాణికులను మాత్రమే అనుమతించడంతో శుక్రవారం పలువురు యాత్రికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అన్‌రిజర్వుడు ప్రయాణికులను తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్, తారాపేట టెర్మినల్ నుంచి మాత్రమే అనుమతిస్తున్నారు. కొందరు ఆర్పీఎఫ్ సిబ్బందితో గొడవకు దిగారు. -
అవనిగడ్డ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
కోడూరు : వివిధ సుదూరు ప్రాంతాల నుంచి పవిత్ర కృష్ణాసాగరసంగమంకు వచ్చే భక్తులు అవనిగడ్డ నుంచి విధిగా ట్రాఫిక్ అంక్షాలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. గురువారం సంగమం వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న అవనిగడ్డ సీఐ మూర్తి విలేకర్లతో ట్రాఫిక్ అంక్షాల గురించి తెలిపారు. అవనిగడ్డ నుంచి వి.కొత్తపాలెం–కోడూరు–దింటిమెరక–పాలకాయతిప్ప మీదగా సంగమానికి చేరుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులు మాత్రం కోడూరు–ఉల్లిపాలెం మీదగా హంసలదీవి రావాలన్నారు. హంసలదీవిలో అన్ని ఆర్టీసీ బస్సులను నిలిపివేయడం జరుగుతుందని, అక్కడ నుంచి పాలకాయతిప్ప సముద్రతీరం వరకు భక్తులను మినిబస్సుల ద్వారా పంపనున్నట్లు సీఐ తెలిపారు. ప్రయివేటు వాహనాలు మొత్తం దింటిమెరక మీదగా అనుమతిస్తామని, అవి నేరుగా పాలకాయతిప్ప వెళ్లవచ్చని చెప్పారు. డాల్ఫిన్భవనం నుంచి ప్రతి భక్తులు సంగమం వరకు నడిచి వెళ్లాలని, ఏవిధమైన వాహనాలను సంగమంకు అనుమతించడం లేదని తెలిపారు. తిరుగు ప్రయాణం ఉల్లిపాలెం మీదగా కోడూరు–వి.కొత్తపాలెం గుండా అవనిగడ్డ చేరుకోవాలని సీఐ సూచించారు. పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లో మాత్రమే భక్తులు తమ వాహనాలను నిలపాలన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలిచ్చారు. -
పార్కింగ్ ప్లాన్ రెడీ
పుష్కరాలకు పార్కింగ్ జోన్లు సిద్ధం సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. విజయవాడతోపాటు నగరానికి నాలుగు వైపులా 30 కిలోమీటర్ల పరిధిలో పార్కింగ్ జోన్లు ఏర్పాటుచేశామని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ ప్లాన్ గురించి డీఐజీ వివరించారు. పుష్కరాలకు విజయవాడ వచ్చే వాహనాల కోసం మొత్తం 121 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటుచేశామని తెలిపారు. వీటిలో 51 పార్కింగ్ ప్రదేశాలను విజయవాడ నగరపాలక సంస్థ, 40 రెవెన్యూ యంత్రాగం, 9 ప్రాంతాలను నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం సిద్ధం చేసిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి విజయవాడ వచ్చే వాహనాలకు నగర ప్రవేశ మార్గాల్లోనే పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. 45వేల వాహనాలు పార్కింగ్ చేయొచ్చు మొత్తం 121 పార్కింగ్ ప్రాంతాల్లో 45వేల వాహనాలను పార్కింగ్ చేయవచ్చని డీఐజీ తెలిపారు. పుష్కరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి, దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లుచేశామన్నారు. అవసరమైతే రద్దీకి అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలో అధిక రద్దీ ఉంటుందన్నారు. నో ట్రాఫిక్ జోన్ ఇదీ.. పుష్కర ఘాట్లు ఉన్న కుమ్మరిపాలెం సెంటర్ నుంచి కనకదుర్గ అమ్మవారి దేవస్థానం మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు నో ట్రాఫిక్ జోన్‌గా ప్రకటించి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నామని డీఐజీ చెప్పారు. అత్యవసర సేవలు, దేవాలయ సిబ్బంది వాహనాలు మినహా మరేమీ అనుమతించబోమని తెలిపారు. స్థానికుల ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామన్నారు. అయితే వన్‌టౌన్ ప్రాంత ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. పుష్కరాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో నగరంలో 25 లక్షల నుంచి 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనాలు వేశామని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లుచేశామని చెప్పారు. కృష్ణలంక రోడ్డును కూడా నో ట్రాఫిక్ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు. నగరంలో 23 పార్కింగ్ ప్రాంతాలు నగరంలో 23 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటిలో 10 ద్విచక్ర వాహనాలకు, 13 కార్లకు కేటాయించామన్నారు. ఆటోల రాకపోకలపై ఆంక్షలు లేవన్నారు. అయితే ప్రత్యేక మార్గాల్లోనే ఆటోలు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని తెలిపారు. – ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వచ్చే వాహనాలను ఎర్రకట్ట మీదుగా నగరంలోకి అనుమతిస్తారు. – నగరం నుంచి బయటకు వెళ్లే వాహనాలను సొరంగం మీదుగా పంపిస్తారు. ఈ రెండు మార్గాల్లో వన్ వే అమల్లో ఉంటుంది. – గొల్లపూడి నుంచి వచ్చే ఆటోలు జోజినగర్ మీదుగా కేబీన్ కళాశాల వైపు చేరుకోవాల్సి ఉంటుంది. – అప్సర థియేటర్ నుంచి సాంబమూర్తి రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, పడవలరేవు సెంటర్ మీదుగా రామవరప్పాడు రింగ్‌కు చేరుకోవాలి. – బెంజ్ సర్కిల్ నుంచి స్క్యూబిడ్జి సెంటర్ మీదుగా వారధి వరకు ఆటోలను అనుమతిస్తారు. – ఆటోలను కూడా సాధ్యమైనంత వరకు ఘాట్లకు సమీపంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు. -
పుష్కరాలకు బంగారు నాణేల విడుదల
విజయవాడ(లబ్బీపేట) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని తనిష్క్ షోరూం ప్రత్యేక నాణేలను విడుదల చేసింది. మహాత్మాగాంధీ రోడ్డులోని తనిష్క్లో ఆ షోరూమ్ అధినేత్రి జోగులాంబ ఈ నాణేలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నాణెంలో ఒక వైపు కృష్ణాపుష్కరాల చిహ్నం.. మరోవైపు కృష్ణవేణి చిత్రాలను ముద్రించారు. వీటిని 22 క్యారెట్ల బంగారంతో 2 గ్రాములు, 4 గ్రాముల బరువుతో విడుదల చేశారు. పుష్కరాలను పురస్కరించుకుని శనివారం బంగారు ఆభరణాల కొనుగోలు చేసిన వారికి మజూరీపై 10 శాతం రాయితీ ఇసాత్మని జోగులాంబ తెలిపారు. శ్రావణమాసం రాకను పురస్కరించుకుని శుక్రవారం షోరూమ్‌లో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.