పార్కింగ్‌ ప్లాన్‌ రెడీ | parking plan for puskaras | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌ ప్లాన్‌ రెడీ

Published Sat, Aug 6 2016 9:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

పార్కింగ్‌ ప్లాన్‌ రెడీ

పార్కింగ్‌ ప్లాన్‌ రెడీ

పుష్కరాలకు పార్కింగ్‌ జోన్లు సిద్ధం
సాక్షి, విజయవాడ :
 కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశామని, ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని డీఐజీ శ్రీకాంత్‌ తెలిపారు. విజయవాడతోపాటు నగరానికి నాలుగు వైపులా 30 కిలోమీటర్ల పరిధిలో పార్కింగ్‌ జోన్లు ఏర్పాటుచేశామని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్‌ ప్లాన్‌ గురించి డీఐజీ వివరించారు. పుష్కరాలకు విజయవాడ వచ్చే వాహనాల కోసం మొత్తం 121 పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటుచేశామని తెలిపారు. వీటిలో 51 పార్కింగ్‌ ప్రదేశాలను విజయవాడ నగరపాలక సంస్థ, 40 రెవెన్యూ యంత్రాగం, 9 ప్రాంతాలను నూజివీడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సిద్ధం చేసిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి విజయవాడ వచ్చే వాహనాలకు నగర ప్రవేశ మార్గాల్లోనే పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. 
45వేల వాహనాలు పార్కింగ్‌ చేయొచ్చు 
మొత్తం 121 పార్కింగ్‌ ప్రాంతాల్లో 45వేల వాహనాలను పార్కింగ్‌ చేయవచ్చని డీఐజీ తెలిపారు. పుష్కరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి, దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లుచేశామన్నారు. అవసరమైతే రద్దీకి అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతంలో అధిక రద్దీ ఉంటుందన్నారు. 
నో ట్రాఫిక్‌ జోన్‌ ఇదీ..
పుష్కర ఘాట్లు ఉన్న కుమ్మరిపాలెం సెంటర్‌ నుంచి కనకదుర్గ అమ్మవారి దేవస్థానం మీదుగా పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వరకు నో ట్రాఫిక్‌ జోన్‌గా ప్రకటించి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నామని డీఐజీ చెప్పారు. అత్యవసర సేవలు, దేవాలయ సిబ్బంది వాహనాలు మినహా మరేమీ అనుమతించబోమని తెలిపారు. స్థానికుల ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామన్నారు. అయితే వన్‌టౌన్‌ ప్రాంత ప్రజలు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరారు. పుష్కరాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో నగరంలో 25 లక్షల నుంచి 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనాలు వేశామని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లుచేశామని చెప్పారు. కృష్ణలంక రోడ్డును కూడా నో ట్రాఫిక్‌ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు.
 
నగరంలో 23 పార్కింగ్‌ ప్రాంతాలు
నగరంలో 23 పార్కింగ్‌ ప్రాంతాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటిలో 10  ద్విచక్ర వాహనాలకు, 13 కార్లకు కేటాయించామన్నారు. ఆటోల రాకపోకలపై ఆంక్షలు లేవన్నారు. అయితే ప్రత్యేక మార్గాల్లోనే ఆటోలు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని తెలిపారు. 
– ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వచ్చే వాహనాలను ఎర్రకట్ట మీదుగా నగరంలోకి అనుమతిస్తారు.
– నగరం నుంచి బయటకు వెళ్లే వాహనాలను సొరంగం మీదుగా పంపిస్తారు. ఈ రెండు మార్గాల్లో వన్‌ వే అమల్లో ఉంటుంది.
– గొల్లపూడి నుంచి వచ్చే ఆటోలు జోజినగర్‌ మీదుగా కేబీన్‌ కళాశాల వైపు చేరుకోవాల్సి ఉంటుంది. 
– అప్సర థియేటర్‌ నుంచి సాంబమూర్తి రోడ్డు, బీఆర్టీఎస్‌ రోడ్డు, పడవలరేవు సెంటర్‌ మీదుగా రామవరప్పాడు రింగ్‌కు చేరుకోవాలి.
– బెంజ్‌ సర్కిల్‌ నుంచి స్క్యూబిడ్జి సెంటర్‌ మీదుగా వారధి వరకు ఆటోలను అనుమతిస్తారు. 
– ఆటోలను కూడా సాధ్యమైనంత వరకు ఘాట్లకు సమీపంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement