parking place
-
రహదారి బాగుందా.. పగుళ్లు ఏర్పడ్డాయా?
వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట మండల పరిధిలోని జాతీయ రహదారి 44ను గురువారం సాయంత్రం నేషనల్ హైవే అథారిటీ చీఫ్ ఇంజనీర్ రోషన్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. రహదారి బాగుందా.. ఎక్కడైనా పగుళ్లు, గుంతలు ఏర్పడ్డాయా, రహదారిపై వంతెనలు సర్వీస్ రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. రోడ్డుపై అక్కడక్కడ మట్టి పేరుకుపోవడాన్ని గమనించారు. మాసాయిపేట శివారులో ఓ దాబా నిర్వాహకులు సర్వీస్ రోడ్డును ఆక్రమించి పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పరిస్థితిపై నేషనల్ హైవే అథారిటీ అధికారులకు నివేదిక సమర్పిస్తానని చెప్పారు. -
అరగంట టైం వేస్ట్ అవుతోంది.. చెట్లు నరికేయండి
తిరువనంతపురం : ప్రపంచవ్యాప్తంగా అడవుల పరిరక్షణ గురించి చర్చిస్తుంటే కొచ్చి జనాలు మాత్రం చెట్లు నరికేయండి బాబు.. పక్షులతో వేగ లేకపోతున్నాం అని వేడుకుంటున్నారు. ఎందుకో మీరు చదవండి. కొచ్చిలోని అలువా రైల్వే స్టేషన్లో సాధరణంగా వినిపించే ఫిర్యాదు చెట్లను నరికేయండి అని. ఎందుకంటే.. ఉద్యోగమో, మరేదో కారణాల రీత్యా ఇతర ప్రదేశాలకు వెళ్లేవారు రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్‌లో తమ వాహనాలను పార్క్ చేసి వెళ్తున్నారు. తిరిగి వచ్చి చూసే సరికి వాహనాల నిండా పక్షి రెట్టలుండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో అవి కాస్త పక్షులకు నివాసంగా మారాయి. ఫలితంగా అక్కడ వాహనాలు నిలిపి వెళ్తున్న వాహనదారులు ఇలా పక్షి రెట్టలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజు ఉదయం 20-30 నిమిషాల సమయాన్ని వాహనాలను శుభ్రం చేయడానికే కేటాయించాల్సి వస్తోందని వాపోతున్నారు. చెట్లను కొట్టేసి తమను ఈ సమస్య నుంచి బయటపడేయాల్సిందిగా రైల్వే అధికారులను వేడుకుంటున్నప్పటికి.. ఫలితం లేదని వాపోతున్నారు. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. ‘చెట్లను కొట్టేయడం అంత సులభం కాదు. అందుకు అనుమతులు రావడం కష్టమే కాక చెట్లను నరికితే.. పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బ తింటుంది’ అని తెలిపారు. -
ఇకపై పార్కింగ్ సమస్య ఉండదు!
హూస్టన్: ఆఫీస్, షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు కారు లేదా బైక్‌ను పార్క్ చేయడానికి ఎక్కడ ఖాళీగా ఉందా.. అని వెతకాడనికే సమయం వృథాకావటం చూస్తుంటాం. అమెరికాలోని అలబామా వర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి మెట్టుపల్లి సాయినిఖిల్రెడ్డి ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సంక్లిష్టమైన, ఖర్చుతో కూడిన పార్కింగ్ యాప్స్ కంటే భిన్నంగా స్పేస్ డిటెక్టింగ్ పద్ధతిలో దీనిని అభివృద్ధి చేశారు. బిగ్‌డేటా ఎనలిటిక్స్, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ సాయంతో డేటాను విశ్లేషించి డ్రైవర్లు నేరుగా పార్కింగ్‌లో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుందో చెబుతుంది. ఈ ఆవిష్కరణకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్ హౌస్ పోటీ (2018)ల్లో రెండో బహుమతి వచ్చింది. -
భారీ అగ్ని ప్రమాదం.. ఐదు బస్సులు దగ్ధం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బహదూర్‌పురా పీఎస్ పరిధిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. తాడ్‌బన్‌లోని ఒమర్ ట్రావెల్స్ పార్కింగ్‌లో ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఐదు బస్సులు సహా పలు వాహనాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తేచేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెస్టారెంట్స్, హోటల్స్ మూసివేయండి!
రోడ్డు పక్కకు ఏమైనా షాపులు, రెస్టారెంట్లు, హోటల్స్ కట్టాలంటే.. ముందస్తుగా దానికి అనువైన పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. లేకపోతే రోడ్లపై వెళ్లే వాహనాదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పవు. కానీ కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ మాత్రం అసలు పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేయవు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మద్రాసు హైకోర్టు, సరిపడ పార్కింగ్ ప్రాంత లేని రెస్టారెంట్లు, హోటల్స్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం సుందర్‌లతో కూడా బెంచ్ ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చింది. పార్కింగ్ స్థలం లేని రెస్టారెంట్లకు, హోటల్స్‌కు లైసెన్సులు రద్దు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన బెంచ్ సభ్యులు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంపై తదుపరి విచారణ మార్చి 24న చేపడతామని చెప్పారు. విచారణ తేదీలకు మూడు రోజుల ముందు వరకు ఈ విషయంపై జాయింట్ ప్రొగ్రెస్ రిపోర్టును తమకు అందజేయాలని అథారిటీలను ఆదేశించారు. '' ఒకవేళ సరిపడ పార్కింగ్ స్థలం లేకుండా రెస్టారెంట్లు, హోటల్స్ నడుస్తుంటే వాటిని వెంటనే అథారిటీలు మూసివేయాలి'' అని బెంచ్ సభ్యులు పేర్కొన్నారు. -
కారు కొంటున్నారా.. పార్కింగ్ ప్లేస్ ఏది?
మీరు కారు కొనాలనుకుంటున్నారా.. అయితే దాన్ని పార్క్ చేయడానికి మీ ఇంట్లో తగినంత స్థలం ఉందన్న ఆధారం చూపిస్తే తప్ప మీకు కారు అమ్మబోరు. ఈ నిబంధన త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై తాను చాలా పట్టింపుతో ఉన్నానని, దీనిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రితో మాట్లాడానని, రాష్ట్రాలకు కూడా చెబుతున్నానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి అలాంటి ప్రతిపాదన వస్తే దాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అధికారులు కూడా అంటున్నారు. పార్కింగ్ కోసం తగినంత స్థలం లేకపోయినా కార్లు, ఇతర వాహనాలు కొనేసి, వాటిని ఇళ్ల ముందు రోడ్ల మీద ఉంచేయడం పెద్ద నగరాల్లో చాలా తీవ్రమైన సమస్యగా మారింది. దానివల్ల రోడ్లు ఇరుగ్గా తయారవడంతో ఇక ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సిందేనని కేంద్రం గట్టి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ విషాన్ని రవాణా శాఖ చూస్తుండగా, పార్కింగ్ విషయాన్ని మునిసిపల్ శాఖ చూస్తోంది. దానివల్ల ఈ రెండు శాఖల మధ్య సమన్వయం సాధించి ఆ తర్వాతే ఈ నిబంధన అమలు చేయాలనుకుంటున్నారు. పైగా, దాంతోపాటు.. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచిన తర్వాతే దీన్ని కచ్చితంగా అమలుచేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇటు ప్రజారవాణా లేక, అటు సొంత వాహనాలు కొనలేక ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. పార్కింగ్ చార్జీలు పెండచం, ఇరుకైన ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలు వాడితే చార్జీలు విధించడం, కార్ల రుణాల మీద వడ్డీరేట్లు పెంచడం లాంటి చర్యల ద్వారా ఎక్కువ మంది ప్రజలు సొంత కార్లు కొనకుండా చూడొచ్చని కొంతమంది రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. సింగపూర్ లాంటి దేశాల్లో సొంత వాహనాలు అన్నవే దాదాపుగా ఉండవు. కేవలం ప్రజా రవాణాను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మరీ అంత కాకపోయినా.. కొంతవరకు నియంత్రణ విధించకపోతే వ్యక్తిగత వాహనాల సంఖ్య బాగా పెరిగి ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా లాంటి నగరాల్లో అక్రమంగా రోడ్ల మీదే వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల రోడ్లు చాలా ఇరుకైపోయాయి. హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సొంత పార్కింగ్ ప్రదేశం ఉందని సర్టిఫికెట్ తీసుకొచ్చిన వారికి మాత్రమే షిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్లు అమ్మాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 2015లోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
మంత్రి మాట బేఖాతర్..
► పెడచెవిన పెడుతున్న మున్సిపల్ అధికారులు ► ఆసుపత్రుల వద్ద అదే తంతు.. ► అంతా మా ఇష్టం అన్నట్లుగా పార్కింగ్ వ్యవహరం ఆదిలాబాద్ కల్చరల్: పట్టణంలో జనాభా పెరుగుతోంది..రాకపోకలకు ఇబ్బందులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. పట్టణంలో రోడ్లన్ని ఇరుకుగా మారా యి ఆసుత్రుల వద్ద పార్కింగ్ స్థలం లేకుంటే వారికి నోటీసులు ఇవ్వండి..రోడ్లపై వాహనాలు నిలిపి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి.. పార్కింగ్ ప్లేస్ లేని వారికి నోటీసులు ఇచ్చి.. ఫైర్వారికి సైతం చెప్పి వారి లెసైన్‌సను క్యాన్సల్ చేద్దాం’’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ఇటీవల మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ..ఏ ఆసుపత్రి వద్ద మున్సిపల్ నిబంధనలు కాదు కదా.. ఆయా ఆసుపత్రులు మున్సిపల్ రోడ్డుపై, మురికికాలువపై నిర్మించుకున్న నిర్మాణాలను సైతం తొలగించలేదు. మంత్రిగారూ చెప్పిన వినిపించుకోని స్థారుులో మన మున్సిపల్ అధికారులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిజమెనండోయ్ వారు ఏమి చేసిన ఒక వర్గం లేకుంటే మరో వర్గానికి వెళ్లోచ్చు అనే తీరును సృష్ఠిస్తున్నారు అధికారులు. మున్సిపల్ అధికారుల పనితీరు కారణంగా మున్సిపాలిటి మరింత వెనుకబాటుకు గురవుతోంది. డీఎంఏ ఇచ్చిన ఆదేశాలను సైతం భేఖతరు చేస్తూ నామమాత్రంగా కొన్ని ఆక్రమణలు తొలగించి అధికారులు నిశబ్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర మంత్రి జోగు రామన్న చెప్పిన మాటను ఆమలు చేయకపోవడం పై సర్వత్ర టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పట్టణంలోని ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న వైద్యులు ఆసుపత్రులు నిర్మించుకున్నారు. పార్కింగ్ స్థలాలు లేకుండా మురికికాల్వలను మూసివేసి నిర్మాణాలు చేశారు. రోగులతో వాహనాలు వచ్చి వ్యాధిగ్రస్తులు తీసుకువెల్లేంత వరకు రోడ్డుపైనే పార్కింగ్లు చేస్తున్నారు. రోడ్లుపై దర్జాగా పార్కింగ్లు చేసిన , మురికి కాల్వలపై నిర్మాణాలు చేసిన ఆ ఆసుపత్రులను మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం పార్కింగ్ ఏరియా లేకుండ ఆసుపత్రులు నిర్మించరాదు. కానీ మన మున్సిపాలిటిలో ని ర్మాణాలు జరిగారుు. కాగా కొందరు గ్రౌండ్‌ప్లోర్ నిర్మించుకుని వాహనాల పార్కింగ్‌కు బదులు దుకాణాలు, మెడికల్ , ల్యాబ్‌ల నిర్వాహణ చేపట్టారు. పట్టణంలోని వివేకానంద చౌక్ నుంచి మొదలుకొని, నేతాజీ చౌక్, శివాజీచౌక్, సినిమా రోడ్డు, ఇలా చాలా చోట్ల ప్రజలు ఆసుపత్రుల వద్ద పార్కింగ్తో అవస్థలు పడుతున్నారు. నోటీసులు లేవు.. పట్టింపులు లేవు.. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు రోడ్ల పై పార్కింగ్ వ్యవస్థను కొనసాగిస్తున్న మున్సిపల్ అధికారులు నోటీలిచ్చిన దాఖలాలు లేవు. రాష్టట్ర మంత్రి జోగురామన్న నోటీసులు అందించమని చెప్పిన ఇప్పటి వరకు అధికారులు ఆ దిశగా అడుగులు వేయనట్లు సమాచారం. దీంతో ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్నచందంగా ఆసుపత్రిల వద్ద పార్కింగ్ వ్యవస్థ మారింది. ఈ ప్రాంతాలలో పలువురు ప్రమాదాలకు గురైన సందర్బాలు కూడా ఉన్నారుు. ఉన్నతాధికారులకు లేఖరాసి పార్కింగ్ ప్రాంతాలు లేని వారికి నిబంధనల మేరకు లెసైన్‌సలు రద్దు చేసేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
రేపటిలోగా స్థలాన్ని ఖాళీ చేస్తాం
ఐమాక్స్ పక్కన పార్కింగ్ స్థలంపై హైకోర్టుకు నివేదించిన డాక్టర్ కార్స్ అప్పీల్ ఉపసంహరణకు ధర్మాసనం అనుమతి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) నుంచి ప్రసాద్స్ ఐమాక్స్ పక్కన లీజుకు తీసుకున్న స్థలాన్ని శనివారంలోపు ఖాళీ చేస్తామని డాక్టర్ కార్స్ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. సింగిల్ జడ్జి తీర్పుపై తాము దాఖలు చేసిన అప్పీల్‌ను సైతం ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అప్పీల్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయం, ప్రదర్శన నిమిత్తం డాక్టర్ కార్స్ యాజమాన్యం 2012లో హెచ్ఎండీఏ నుంచి ప్రసాద్ ఐమాక్స్ పక్కనున్న స్థలాన్ని లీజుకు తీసుకుంది. అద్దె బకాయిలు చెల్లించలేదంటూ ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని హెచ్ఎండీఏ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై డాక్టర్ కార్స్ హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ తరువాత స్టే ఎత్తివేయాలని కోరుతూ హెచ్ఎండీఏ అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా సింగిల్‌జడ్జి స్టేని ఎత్తివేస్తూ తీర్పునిచ్చారు. దీనిపై డాక్టర్ కార్స్ యాజమాన్యం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా బుధవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. లీజు గడువు ముగిసిన నేపథ్యంలో ఎప్పటిలోపు స్థలాన్ని ఖాళీ చేస్తారో చెప్పాలంటూ కోర్టు విచారణను గురువారానికి వారుుదా వేసింది. అప్పీల్ గురువారం విచారణకు రాగా శనివారంలోపు స్థలాన్ని ఖాళీ చేస్తామని డాక్టర్ కార్స్ యాజమాన్యం కోర్టుకు నివేదించింది. -
పార్కింగ్ విషయంలో గొడవ..వ్యక్తికి కత్తిపోట్లు
బెంగళూరు(బనశంకరి): పార్కింగ్ విషయంపై ఆటో డ్రైవరు, ఇద్దరు ద్విచక్రవాహనదారుల మధ్య చోటు చేసుకున్న గొడవ..చివరకు కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన సుబ్రమణ్యనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బసవరాజ్, చేతన్ అనే వ్యక్తులు బైకులో రాజాజీనగర మొదటిస్టేజ్లోని ఐసీసీ బ్యాంకు సమీపంలో అనన్య ఆసుపత్రి వద్ద పార్కింగ్ చేయడానికి యత్నిస్తూ అదే స్థలంలో పార్కింగ్ చేయడానికి వచ్చిన ఆటోను ఓవర్టేక్ చేశారు. దీంతో ఆటోడ్రైవర్‌కు, వారికి మధ్య గొడవ జరిగింది. ఓ దశలో ఆటోడ్రైవర్ విచక్షణ కోల్పోయి బసవరాజ్‌ను చాకుతో పొడిచి ఉడాయించాడు. చేతన్ ఇచ్చిన ఫిర్యాదు మేకు సుబ్రహ్మణ్య నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని బసవరాజ్‌ను ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
పార్కింగ్ ప్లాన్ రెడీ
పుష్కరాలకు పార్కింగ్ జోన్లు సిద్ధం సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని, ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. విజయవాడతోపాటు నగరానికి నాలుగు వైపులా 30 కిలోమీటర్ల పరిధిలో పార్కింగ్ జోన్లు ఏర్పాటుచేశామని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ ప్లాన్ గురించి డీఐజీ వివరించారు. పుష్కరాలకు విజయవాడ వచ్చే వాహనాల కోసం మొత్తం 121 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటుచేశామని తెలిపారు. వీటిలో 51 పార్కింగ్ ప్రదేశాలను విజయవాడ నగరపాలక సంస్థ, 40 రెవెన్యూ యంత్రాగం, 9 ప్రాంతాలను నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం సిద్ధం చేసిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి విజయవాడ వచ్చే వాహనాలకు నగర ప్రవేశ మార్గాల్లోనే పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. 45వేల వాహనాలు పార్కింగ్ చేయొచ్చు మొత్తం 121 పార్కింగ్ ప్రాంతాల్లో 45వేల వాహనాలను పార్కింగ్ చేయవచ్చని డీఐజీ తెలిపారు. పుష్కరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి, దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లుచేశామన్నారు. అవసరమైతే రద్దీకి అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలో అధిక రద్దీ ఉంటుందన్నారు. నో ట్రాఫిక్ జోన్ ఇదీ.. పుష్కర ఘాట్లు ఉన్న కుమ్మరిపాలెం సెంటర్ నుంచి కనకదుర్గ అమ్మవారి దేవస్థానం మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు నో ట్రాఫిక్ జోన్‌గా ప్రకటించి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నామని డీఐజీ చెప్పారు. అత్యవసర సేవలు, దేవాలయ సిబ్బంది వాహనాలు మినహా మరేమీ అనుమతించబోమని తెలిపారు. స్థానికుల ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామన్నారు. అయితే వన్‌టౌన్ ప్రాంత ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. పుష్కరాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో నగరంలో 25 లక్షల నుంచి 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనాలు వేశామని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లుచేశామని చెప్పారు. కృష్ణలంక రోడ్డును కూడా నో ట్రాఫిక్ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు. నగరంలో 23 పార్కింగ్ ప్రాంతాలు నగరంలో 23 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటిలో 10 ద్విచక్ర వాహనాలకు, 13 కార్లకు కేటాయించామన్నారు. ఆటోల రాకపోకలపై ఆంక్షలు లేవన్నారు. అయితే ప్రత్యేక మార్గాల్లోనే ఆటోలు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని తెలిపారు. – ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వచ్చే వాహనాలను ఎర్రకట్ట మీదుగా నగరంలోకి అనుమతిస్తారు. – నగరం నుంచి బయటకు వెళ్లే వాహనాలను సొరంగం మీదుగా పంపిస్తారు. ఈ రెండు మార్గాల్లో వన్ వే అమల్లో ఉంటుంది. – గొల్లపూడి నుంచి వచ్చే ఆటోలు జోజినగర్ మీదుగా కేబీన్ కళాశాల వైపు చేరుకోవాల్సి ఉంటుంది. – అప్సర థియేటర్ నుంచి సాంబమూర్తి రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, పడవలరేవు సెంటర్ మీదుగా రామవరప్పాడు రింగ్‌కు చేరుకోవాలి. – బెంజ్ సర్కిల్ నుంచి స్క్యూబిడ్జి సెంటర్ మీదుగా వారధి వరకు ఆటోలను అనుమతిస్తారు. – ఆటోలను కూడా సాధ్యమైనంత వరకు ఘాట్లకు సమీపంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు. -
‘ఆరెంజ్ డే’
ఒకరిది చిక్కడపల్లి.. ఇంకొకరిది కూకట్పల్లి.. మరొకరిది నాంపల్లి.. వీరంతా హైదరాబాదీలే అయినా ఒకరి అడ్రస్ ఇంకొకరికి తెలియదు. చేసే ఉద్యోగాలు వేరు.. మనస్తత్వాలూ వేరు.. అయినా వీరందరూ ఏడాదికోసారి కలుస్తారు. సరదాగా కాసేపు మస్తీ మజా చేస్తారు. ఏ రిలేషన్ లేని వీరందరినీ కలిపింది వారి బైకులే. అవును మనసుపడి కొనుక్కున్న కేటీఎం స్పోర్ట్స్ బైకులే వీరి మధ్య అనుబంధాన్ని పెంచాయి. నిత్యం సిటీరోడ్లపై చక్కర్లు కొడుతున్న ఈ బైకువీరులు ఆరెంజ్ డేను ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి కూకట్పల్లి మెట్రో క్యాష్ అండ్ క్యారీ పార్కింగ్ ప్లేస్ వేదికైంది. స్పోర్ట్స్ బైక్ అనగానే యువతకు పట్టపగ్గాలు ఉండవు. యూత్‌లో ఉన్న ఈ క్రేజ్ చూసే బడా కంపెనీలు రోజుకో కొత్త మోడల్ బైకులను రోడ్డుమీదికి తెస్తున్నాయి. అత్యధిక సీసీ సామర్థ్యంతో వస్తున్న స్పోర్ట్స్ బైక్‌లు యువతకు ఆనందాన్ని పంచడంతో పాటు.. కాస్త అటుఇటు అయితే ప్రమాదాల్లోనూ పడేస్తున్నాయి. బైక్ నడిపే తీరు సరిగా తెలియక కొందరు, మితిమీరిన వేగంతో ఇంకొందరు ప్రమాదాల స్పీడ్ బ్రేకర్స్ దాటలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయా బైక్‌ల కంపెనీలు ‘కస్టమర్ల సంక్షేమమే.. సంస్థకు మహాభాగ్యం’ అంటూ రైడింగ్‌పై అవగాహన కల్పిస్తున్నాయి. కేటీఎం కంపెనీ శనివారం నిర్వహించిన ‘ఆరెంజ్ డే’ ఈవెంట్ అటువంటిదే. రైడింగ్ గైడ్‌లైన్స్.. నగరవ్యాప్తంగా ఆర్సీ 200, 200 డ్యూక్ బైక్ కలిగిన వందలాది మంది వాహన చోదకులు ఒకేచోట చేరి బైక్ రైసింగ్ విన్యాసాలు చేయడం చూపరులను ఆకట్టుకుంది. కొత్తగా బైక్ కొన్న వారికి ట్రాక్‌పై బైక్ ఎలా నడపాలి, ఏ లిమిట్లో ముందుకెళ్లాలి, మైలేజ్ వచ్చేందుకు ఎంత స్పీడ్‌లో వెళ్లాలి, రేసింగ్ పోటీల్లో బైక్‌ను నడిపించాల్సిన తీరు.. తదితర చిట్కాలను ఎక్స్పర్ట్స్ ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. గాలిలో దూసుకె ళ్తూ వెంటనే బ్రేక్ వేసి బైక్‌ను ఆపిన తీరు వహ్వా అనిపించింది. అనుబంధాల వేదిక.. ‘కేటీఎం ఆర్సీ 200 బైక్ ఎంతో ఇష్టపడి తీసుకున్నాను. తొలినాళ్లలో బైక్ నడపడం కాస్త కష్టమయ్యేది. ఇక్కడ ఎక్స్పర్ట్స్ సలహాలు విన్నాక రైడింగ్ ఈజీ అయ్యింది’ అంటూ బైకర్ రమేశ్ తన అనుభవాలు పంచుకున్నారు. మరో రైడర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఆరెంజ్ డే వల్ల మంచి స్నేహితులు దొరికారు. రైడింగ్ టిప్స్ పంచుకోవడమే కాదు.. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకునే స్థాయికి మా స్నేహం పెరిగింది’ అని సంతోషంగా తెలిపారు. ‘మా కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఆరెంజ్ డే ఈవెంట్ ప్లాన్ చేశాం. ఇక్కడికి వచ్చిన రైడర్లంతా కుటుంబసభ్యుల్లా కలిసిపోవడం ఆనందాన్నిస్తోంద’ని కేటీఎం ప్రతినిధి కార్తీక్ అన్నారు. మూడేళ్ల బంధం లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆఫ్రికాలలోనూ ఆరేంజ్ డేలు సక్సెస్ కావడంతోనూ ఆసియాలోనూ ఈ ట్రెండ్‌ను పరిచయం చేసింది కేటీఎం. ఇండియాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ ‘ఆరెంజ్ డే’ నిర్వహిస్తోంది. ఇందులో బైక్ రేసింగ్‌లో కిటుకుల్ని ఎక్స్పర్ట్స్ చేత నేర్పుతోంది. 2013లో హైదరాబాద్‌లో తొలిసారి ఆరెంజ్ డే పరిచయమైంది. ఏటా ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి తొలివారంలో కానీ దీన్ని నిర్వహిస్తోంది. తాజాగా కూకట్‌పల్లిలో జరిగిన ఈ ఈవెంట్లో బైకర్లతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొని ఎంజాయ్ చేశారు. -
పరుగో..పరుగు..
సాక్షి, గుంటూరు : ‘‘నేరం జరిగిందని తెలిసిన పది నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి. వేగంగా స్పందిస్తే సంఘటన తీవ్రత తగ్గించవచ్చు. ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటాం.’’ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి తరచూ పోలీసు ఉన్నతాధికారులు తమ కింది స్థాయి అధికారులకు జారీ చేసే హెచ్చరిక ఇది. ఆజ్ఞలు, ఆదేశాలు ఎన్ని చేసినా ఘటనా స్థలానికి చేరుకోవడానికి అవసరమైన వాహనాలను మాత్రం అందించకపోవడం వల్ల జిల్లాలో నేరాల నియంత్రణ కష్టమవుతోందని సాక్షాత్తూ పోలీస్ అధికారులే అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులకు భయపడి తమ కష్టాలను మాత్రం బయటకు చెప్పుకోలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్లకు వాహన సౌకర్యం లేక సబ్ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సైబర్ నేరాలను సైతం చిటికెలో పరిష్కరిస్తున్న పోలీస్ శాఖను జిల్లాలో వాహనాల కొరత వెంటాడుతుందంటే ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల విజయవాడలో పోలీసులకు నూతన వాహనాలు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుంటూరు రూరల్ జిల్లాకు 10 వాహనాలు మాత్రమే కేటాయించారు. ఇప్పటికీ జిల్లాలో కనీసం జీపు కూడా లేని పోలీస్స్టేషన్లు ఉన్నాయంటే ననమ్మశక్యంకాని పరిస్థితి నెలకొంది. 32 పోలీస్ స్టేషన్లకు వాహనాలే లేవు.... జిల్లాలో ఏదైనా ఓ ప్రాంతంలో నేరం జరిగినట్లు తెలిసిన వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి ఎస్ఐ సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలంటే వాహనం తప్పనిసరి. అయితే జిల్లాలో సగానికి పైగా పోలీస్స్టేషన్లకు వాహన సౌకర్యమే లేదు. రూరల్ జిల్లాలో మొత్తం 66 పోలీస్ స్టేషన్లలో 34 స్టేషన్లకు మాత్రమే వాహనాలు ఉన్నాయి. లోటు బడ్జెట్ పేరిట వాహన సౌకర్యం కూడా కల్పించకపోవడం వల్ల నేరాల నియంత్రణ కష్టంగా మారిందని పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కోసారి అద్దె వాహనాల్లో వెళ్లేసరికి నష్టం జరిగిపోతుందంటున్నారు. ఒక్కో మండల కేంద్రంలో రాత్రి పూట ఆటోలు కూడా అందుబాటులో ఉండని పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో అర్ధరాత్రి ఏదైనా సంఘటన జరిగితే అక్కడి ఎస్ఐ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ బాధలు పడలేని కొందరు ఎస్ఐలు జీపులను అద్దెకు తీసుకుని నెలవారీ కిరాయిలు కడుతున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాలు అధికంగా ఉండి, నేరాలు ఎక్కువగా జరిగే పల్నాడు ప్రాంతంలో సైతం పోలీస్స్టేషన్లకు వాహనాలు లేవంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం కాకుండా ముందుగానే మేల్కొని పోలీస్స్టేషన్లకు వాహనాలు కేటాయించి నేరాల అదుపునకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వాహనాలు కేటాయించేలా చర్యలు చేపడతాం .. గుంటూరు రూరల్ జిల్లాతోపాటు రేంజి పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లకు వాహనాలు కేటాయించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతా. ఒక్కసారిగా ఇవ్వలేకపోయినా విడతల వారీగా అయినా వాహనాలు అందిస్తాం. రేంజి పరిధిలో ఎన్ని పోలీస్స్టేషన్లకు వాహనాలు లేవో పరిశీలించి ప్రతిపాదనలను డీజీపీకి పంపుతాం. - ఐజీ సంజయ్