‘ఆరెంజ్ డే’
ఒకరిది చిక్కడపల్లి.. ఇంకొకరిది కూకట్‌పల్లి.. మరొకరిది నాంపల్లి.. వీరంతా హైదరాబాదీలే అయినా ఒకరి అడ్రస్ ఇంకొకరికి తెలియదు. చేసే ఉద్యోగాలు వేరు.. మనస్తత్వాలూ వేరు.. అయినా వీరందరూ ఏడాదికోసారి కలుస్తారు. సరదాగా కాసేపు మస్తీ మజా చేస్తారు. ఏ రిలేషన్ లేని వీరందరినీ కలిపింది వారి బైకులే. అవును మనసుపడి కొనుక్కున్న కేటీఎం స్పోర్ట్స్ బైకులే వీరి మధ్య అనుబంధాన్ని పెంచాయి. నిత్యం సిటీరోడ్లపై చక్కర్లు కొడుతున్న ఈ బైకువీరులు ఆరెంజ్ డేను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి కూకట్‌పల్లి మెట్రో క్యాష్ అండ్ క్యారీ పార్కింగ్ ప్లేస్ వేదికైంది.
స్పోర్ట్స్ బైక్ అనగానే యువతకు పట్టపగ్గాలు ఉండవు. యూత్‌లో ఉన్న ఈ క్రేజ్ చూసే బడా కంపెనీలు రోజుకో కొత్త మోడల్ బైకులను రోడ్డుమీదికి తెస్తున్నాయి. అత్యధిక సీసీ సామర్థ్యంతో వస్తున్న స్పోర్ట్స్ బైక్‌లు యువతకు ఆనందాన్ని పంచడంతో పాటు.. కాస్త అటుఇటు అయితే ప్రమాదాల్లోనూ పడేస్తున్నాయి. బైక్ నడిపే తీరు సరిగా తెలియక కొందరు, మితిమీరిన వేగంతో ఇంకొందరు ప్రమాదాల స్పీడ్ బ్రేకర్స్ దాటలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయా బైక్‌ల కంపెనీలు ‘కస్టమర్ల సంక్షేమమే.. సంస్థకు మహాభాగ్యం’ అంటూ రైడింగ్‌పై
అవగాహన కల్పిస్తున్నాయి. కేటీఎం కంపెనీ శనివారం నిర్వహించిన ‘ఆరెంజ్ డే’ ఈవెంట్ అటువంటిదే.
రైడింగ్ గైడ్‌లైన్స్..
నగరవ్యాప్తంగా ఆర్‌సీ 200, 200 డ్యూక్ బైక్ కలిగిన వందలాది మంది వాహన చోదకులు ఒకేచోట చేరి బైక్ రైసింగ్ విన్యాసాలు చేయడం చూపరులను ఆకట్టుకుంది. కొత్తగా బైక్ కొన్న వారికి ట్రాక్‌పై బైక్ ఎలా నడపాలి, ఏ లిమిట్‌లో ముందుకెళ్లాలి, మైలేజ్ వచ్చేందుకు ఎంత స్పీడ్‌లో వెళ్లాలి, రేసింగ్ పోటీల్లో బైక్‌ను నడిపించాల్సిన తీరు.. తదితర చిట్కాలను ఎక్స్‌పర్ట్స్ ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. గాలిలో దూసుకె ళ్తూ వెంటనే బ్రేక్ వేసి బైక్‌ను ఆపిన తీరు వహ్వా అనిపించింది.
అనుబంధాల వేదిక..
‘కేటీఎం ఆర్సీ 200 బైక్ ఎంతో ఇష్టపడి తీసుకున్నాను. తొలినాళ్లలో బైక్ నడపడం కాస్త కష్టమయ్యేది. ఇక్కడ ఎక్స్‌పర్ట్స్ సలహాలు విన్నాక రైడింగ్ ఈజీ అయ్యింది’ అంటూ బైకర్ రమేశ్ తన అనుభవాలు పంచుకున్నారు. మరో రైడర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఆరెంజ్ డే వల్ల మంచి స్నేహితులు దొరికారు. రైడింగ్ టిప్స్ పంచుకోవడమే కాదు.. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకునే స్థాయికి మా స్నేహం పెరిగింది’ అని సంతోషంగా తెలిపారు. ‘మా కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఆరెంజ్ డే ఈవెంట్ ప్లాన్ చేశాం. ఇక్కడికి వచ్చిన రైడర్లంతా కుటుంబసభ్యుల్లా కలిసిపోవడం ఆనందాన్నిస్తోంద’ని కేటీఎం ప్రతినిధి కార్తీక్ అన్నారు.
మూడేళ్ల బంధం
లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆఫ్రికాలలోనూ ఆరేంజ్ డేలు సక్సెస్ కావడంతోనూ ఆసియాలోనూ ఈ ట్రెండ్‌ను పరిచయం చేసింది కేటీఎం. ఇండియాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ ‘ఆరెంజ్ డే’ నిర్వహిస్తోంది. ఇందులో బైక్ రేసింగ్‌లో కిటుకుల్ని ఎక్స్‌పర్ట్స్ చేత నేర్పుతోంది. 2013లో హైదరాబాద్‌లో తొలిసారి ఆరెంజ్ డే పరిచయమైంది. ఏటా ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి తొలివారంలో కానీ దీన్ని నిర్వహిస్తోంది. తాజాగా కూకట్‌పల్లిలో జరిగిన ఈ ఈవెంట్‌లో బైకర్లతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొని ఎంజాయ్ చేశారు.