కారు కొంటున్నారా.. పార్కింగ్ ప్లేస్ ఏది?
కారు కొంటున్నారా.. పార్కింగ్ ప్లేస్ ఏది?
Published Fri, Dec 23 2016 9:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
మీరు కారు కొనాలనుకుంటున్నారా.. అయితే దాన్ని పార్క్ చేయడానికి మీ ఇంట్లో తగినంత స్థలం ఉందన్న ఆధారం చూపిస్తే తప్ప మీకు కారు అమ్మబోరు. ఈ నిబంధన త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై తాను చాలా పట్టింపుతో ఉన్నానని, దీనిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రితో మాట్లాడానని, రాష్ట్రాలకు కూడా చెబుతున్నానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి అలాంటి ప్రతిపాదన వస్తే దాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అధికారులు కూడా అంటున్నారు.
పార్కింగ్ కోసం తగినంత స్థలం లేకపోయినా కార్లు, ఇతర వాహనాలు కొనేసి, వాటిని ఇళ్ల ముందు రోడ్ల మీద ఉంచేయడం పెద్ద నగరాల్లో చాలా తీవ్రమైన సమస్యగా మారింది. దానివల్ల రోడ్లు ఇరుగ్గా తయారవడంతో ఇక ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సిందేనని కేంద్రం గట్టి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ విషాన్ని రవాణా శాఖ చూస్తుండగా, పార్కింగ్ విషయాన్ని మునిసిపల్ శాఖ చూస్తోంది. దానివల్ల ఈ రెండు శాఖల మధ్య సమన్వయం సాధించి ఆ తర్వాతే ఈ నిబంధన అమలు చేయాలనుకుంటున్నారు. పైగా, దాంతోపాటు.. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచిన తర్వాతే దీన్ని కచ్చితంగా అమలుచేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇటు ప్రజారవాణా లేక, అటు సొంత వాహనాలు కొనలేక ప్రజలు ఇబ్బందులకు గురవుతారు.
పార్కింగ్ చార్జీలు పెండచం, ఇరుకైన ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలు వాడితే చార్జీలు విధించడం, కార్ల రుణాల మీద వడ్డీరేట్లు పెంచడం లాంటి చర్యల ద్వారా ఎక్కువ మంది ప్రజలు సొంత కార్లు కొనకుండా చూడొచ్చని కొంతమంది రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. సింగపూర్ లాంటి దేశాల్లో సొంత వాహనాలు అన్నవే దాదాపుగా ఉండవు. కేవలం ప్రజా రవాణాను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మరీ అంత కాకపోయినా.. కొంతవరకు నియంత్రణ విధించకపోతే వ్యక్తిగత వాహనాల సంఖ్య బాగా పెరిగి ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా లాంటి నగరాల్లో అక్రమంగా రోడ్ల మీదే వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల రోడ్లు చాలా ఇరుకైపోయాయి. హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సొంత పార్కింగ్ ప్రదేశం ఉందని సర్టిఫికెట్ తీసుకొచ్చిన వారికి మాత్రమే షిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్లు అమ్మాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 2015లోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Advertisement