సాక్షి, గుంటూరు : ‘‘నేరం జరిగిందని తెలిసిన పది నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి. వేగంగా స్పందిస్తే సంఘటన తీవ్రత తగ్గించవచ్చు. ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటాం.’’ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి తరచూ పోలీసు ఉన్నతాధికారులు తమ కింది స్థాయి అధికారులకు జారీ చేసే హెచ్చరిక ఇది.
ఆజ్ఞలు, ఆదేశాలు ఎన్ని చేసినా ఘటనా స్థలానికి చేరుకోవడానికి అవసరమైన వాహనాలను మాత్రం అందించకపోవడం వల్ల జిల్లాలో నేరాల నియంత్రణ కష్టమవుతోందని సాక్షాత్తూ పోలీస్ అధికారులే అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులకు భయపడి తమ కష్టాలను మాత్రం బయటకు చెప్పుకోలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్‌లకు వాహన సౌకర్యం లేక సబ్‌ఇన్‌స్పెక్టర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సైబర్ నేరాలను సైతం చిటికెలో పరిష్కరిస్తున్న పోలీస్ శాఖను జిల్లాలో వాహనాల కొరత వెంటాడుతుందంటే ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల విజయవాడలో పోలీసులకు నూతన వాహనాలు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుంటూరు రూరల్ జిల్లాకు 10 వాహనాలు మాత్రమే కేటాయించారు. ఇప్పటికీ జిల్లాలో కనీసం జీపు కూడా లేని పోలీస్‌స్టేషన్లు ఉన్నాయంటే ననమ్మశక్యంకాని పరిస్థితి నెలకొంది.
32 పోలీస్ స్టేషన్లకు వాహనాలే లేవు....
జిల్లాలో ఏదైనా ఓ ప్రాంతంలో నేరం జరిగినట్లు తెలిసిన వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి ఎస్‌ఐ సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలంటే వాహనం తప్పనిసరి. అయితే జిల్లాలో సగానికి పైగా పోలీస్‌స్టేషన్‌లకు వాహన సౌకర్యమే లేదు. రూరల్ జిల్లాలో మొత్తం 66 పోలీస్ స్టేషన్‌లలో 34 స్టేషన్‌లకు మాత్రమే వాహనాలు ఉన్నాయి. లోటు బడ్జెట్ పేరిట వాహన సౌకర్యం కూడా కల్పించకపోవడం వల్ల నేరాల నియంత్రణ కష్టంగా మారిందని పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కోసారి అద్దె వాహనాల్లో వెళ్లేసరికి నష్టం జరిగిపోతుందంటున్నారు. ఒక్కో మండల కేంద్రంలో రాత్రి పూట ఆటోలు కూడా అందుబాటులో ఉండని పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో అర్ధరాత్రి ఏదైనా సంఘటన జరిగితే అక్కడి ఎస్‌ఐ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ బాధలు పడలేని కొందరు ఎస్‌ఐలు జీపులను అద్దెకు తీసుకుని నెలవారీ కిరాయిలు కడుతున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాలు అధికంగా ఉండి, నేరాలు ఎక్కువగా జరిగే పల్నాడు ప్రాంతంలో సైతం పోలీస్‌స్టేషన్‌లకు వాహనాలు లేవంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం కాకుండా ముందుగానే మేల్కొని పోలీస్‌స్టేషన్‌లకు వాహనాలు కేటాయించి నేరాల అదుపునకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
వాహనాలు కేటాయించేలా చర్యలు చేపడతాం ..
గుంటూరు రూరల్ జిల్లాతోపాటు రేంజి పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు వాహనాలు కేటాయించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతా. ఒక్కసారిగా ఇవ్వలేకపోయినా విడతల వారీగా అయినా వాహనాలు అందిస్తాం. రేంజి పరిధిలో ఎన్ని పోలీస్‌స్టేషన్‌లకు వాహనాలు లేవో పరిశీలించి ప్రతిపాదనలను డీజీపీకి పంపుతాం.
- ఐజీ సంజయ్
పరుగో..పరుగు..
Published Sun, Feb 22 2015 3:13 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement