రైల్వే ‘పుష్కర’ సమీక్ష
రైల్వే ‘పుష్కర’ సమీక్ష
Published Fri, Aug 12 2016 9:06 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
మునుముందు రద్దీకి తగినట్లు సన్నాహాలు
ఉన్నతాధికారుల పరిశీలన
విజయవాడ (రైల్వే స్టేషన్) :
పుష్కర యాత్రికులకు రైల్వే మెరుగైన సౌకర్యాలను కల్పించింది. రానున్న రోజుల్లో పెరిగే రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ పరిసరాలయిన రైల్వేస్టేడియం, తారాపేట టెర్మినల్, బి.ఆర్.టి.ఎస్ రోడ్లలలో పుష్కరనగర్‌లను ఏర్పాటు చేసింది. మరోవైపు శాటిలైట్ స్టేషన్‌లలో ప్రత్యేక రైళ్లు నిలిపివేసి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో తరలించడంతో విజయవాడ స్టేషన్‌లో రద్దీ తగ్గింది. అదనపు బుకింగ్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, ఎలక్ట్రానిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయడం వల్ల సత్వరం టికెట్లు పొందుతుండంతో బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది. స్టేషన్‌లో పుష్కర రద్దీని దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏ.కె.గుప్తా శుక్రవారం పరిశీలించారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని డి.ఆర్.ఎం అశోక్‌కుమార్, ఏ.డీ.ఆర్.ఎం కె.వేణుగోపాలరావులకు సూచించారు. వివిధ రైళ్ల రాక,పోకలను తెలిపే వివరాలతో కూడిన చార్టులను యాత్రికుల బస చేసే పుష్కర నగర్‌లలో ఏర్పాటు చేశారు.
తూర్పు ద్వారం వద్ద నిషేధాజ్ఞలు
స్టేషన్‌లోని తూర్పుముఖద్వారం నుంచి కేవలం రిజర్వుడు ప్రయాణికులను మాత్రమే అనుమతించడంతో శుక్రవారం పలువురు యాత్రికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అన్‌రిజర్వుడు ప్రయాణికులను తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్, తారాపేట టెర్మినల్ నుంచి మాత్రమే అనుమతిస్తున్నారు. కొందరు ఆర్పీఎఫ్ సిబ్బందితో గొడవకు దిగారు.
Advertisement