traffic instructions
-
పటిష్ట బందోబస్తు.. ట్రాఫిక్ మళ్లింపు
గుంటూరు: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి వీవీఐపీలు, వీఐపీలు, రాజకీయ పార్టీల నేతలు భారీసంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వాహనాల పార్కింగ్ స్థలాలు, జాతీయ రహదారిపై వచ్చే వాహనాల దారి మళ్లింపు తదితర అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా గుంటూరు ఎస్పీ సీహెచ్ విజయరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రాఫిక్ మళ్లింపు వివరాలు తెలిపారు. అదనపు బలగాల మోహరింపు జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ఎ.నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద కూడా అదనపు బలగాలను మోహరించడంతోపాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు గుంటూరు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలన్నింటినీ దారి మళ్లించడం, పార్కింగ్ స్థలాలకు తరలించే విధంగా ప్రణాళిక రూపొందించారు. కనకదుర్గమ్మ వారధి, ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వీవీఐపీలు, వీఐపీల భద్రతలో భాగంగా చర్యలు చేపట్టారు. నిఘా వర్గాల సూచనల మేరకు బందోబస్తును పటిష్టంగా నిర్వహించడంతోపాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. నేటి అర్ధరాత్రి నుంచే.. బుధవారం అర్ధరాత్రి నుంచి చెన్నై నుంచి విజయవాడ వెపునకు వెళ్లే భారీ వాహనాలను వారధి సమీపంలోని బైపాస్ లేబై లలో నిలిపివేయనున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో నిలిపేలా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామ పరిధిలోని శ్రీనాథ్ ఇన్ఫ్రా వద్ద భారీ వాహనాలను నిలిపేలా చర్యలు చేపట్టారు. చెన్నై వైపు నుంచి జాతీయ రహదారిపై విజయవాడకు వచ్చే వాహనాలు నిలుపుకునేందుకు ఇష్టపడని వాహనాలకు అనుమతి ఇచ్చి గుంటూరు రూరల్ మండలం బుడంపాడు వైపుగా తెనాలి, రేపల్లె వైపు నుంచి కృష్ణా జిల్లాలోకి తరలించేలా ప్రణాళిక రూపొందించారు. చుట్టుగుంట మీదుగా హైదరాబాద్‌కు.. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనచోదకులు గుంటూరులోని చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల వైపుగా హైదరాబాద్ వెళ్లేలా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ఒక వేళ అలా వెళ్లడం ఇష్టం లేని వారు ట్రాఫిక్ ఆంక్షలు ముగిసేవరకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వేచి ఉండేందుకు అనుమతిస్తారు. నార్త్, సౌత్ ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడంతోపాటు, సాయుధ దళ సిబ్బంది, ఏరియా డామినేషన్ టీమ్‌లు, బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్లు, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం పార్కింగ్ స్థలాల్లో, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలలో ప్రయాణికులకు, వాహనచోదకులకు ఎలాంటి ట్రాఫిక్ అవాంతరాలు కలుగకుండా ఉండేలా చేయడంతోపాటు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సౌకర్యాన్ని అందించేలా సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. హైవేపై గస్తీ వాహనాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పకటిప్పుడు సమాచారాన్ని కంట్రోల్ రూంకు చేరవేసేలా సిద్ధంచేశామని ఎస్పీ వివరించారు. -
ఇలా రండి.. అలా వెళ్లండి..!
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. మరో పది రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, భవానీలు ఈ సందర్భంగా నగరానికి తరలి వస్తారు. జగ్గజ్జననిని దర్శించుకునేందుకు లక్షలాదిగా బారులు తీరుతారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేయగా.. నగర పోలీసు కమిషనర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో : ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవ్వరూ ట్రాఫిక్ ఇక్కట్లను ఎదుర్కొనకుండా విజయవాడ్ పోలీసులు ప్రత్యేక ‘ట్రాఫిక్ యాప్’ను రూపొందించారు. ఈ యాప్‌ను ఉపయోగించుకుని భక్తులు సమీప పార్కింగ్ కేంద్రాలకు చేరుకోవచ్చు. అలాగే ఉత్సవాల నేపథ్యంలో నగరంలోకి గడ్డిలారీలు, ఊకలారీలకు అనుమతులు నిషేధించనున్నారు. వినాయక గుడి, కుమ్మరిపాలెం వరకుమాత్రమే భక్తుల వాహనాలను అనుమతిస్తారు. ఇక అక్కడి నుంచి 750 మీటర్ల ఘాట్ రోడ్డులో దుర్గగుడికి భక్తులు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. వృద్ధులకు మాత్రం లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది. అలాగే వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి వరకు అనుమతి ఉన్న వాహనాలు తప్ప ఏ విధమైన వాహనాల రాకపోకలకు అనుమతి ఉండబోదు. ఇక వీఐపీలందరికీ పున్నమి గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాట్లు చేశారు. మొదటి మూడు రోజులు ఇలా.. దుర్గమ్మ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈసారి వినూత్న రీతిలో ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఈ ఏడాది డైనమిక్ వెహికల్ ట్రాఫిక్ పద్ధతిన ఏర్పాట్లు చేయనున్నారు. బ్రహ్మోత్సవాలు మొదలైన మొదటి మూడు రోజులు హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు, అలాగే హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను కాళేశ్వరరావు మార్కెట్ మీదుగానే వెళ్లవచ్చు. అంటే పీఎన్బీఎస్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు, ఇతర వాహనాలన్నీ కాళేశ్వరరావు మార్కెట్, చిట్టినగర్, టన్నెల్, గొల్లపూడి మీదుగా వెళ్లవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి, సితార జంక్షన్, సీవీఆర్ ఫ్లై ఓవర్, పాల ఫ్యాక్టరీ, వెస్ట్ గేట్, కాళేశ్వరరావు మార్కెట్ బస్టాండ్ మీదుగా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు మళ్లిస్తారు. రద్దీ రోజుల్లో ఇలా.. సెలవు రోజులతోపాటు మూల నక్షత్రం, విజయదశమి రోజుల్లో మాత్రం మార్పులు ఉండబోతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో డైనమిక్ వెహికల్ ట్రాఫిక్ పద్ధతిలో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. హైదరాబాద్ నుంచి నగరానికి వచ్చే ఆర్టీసీ బస్సులను గొల్లపూడి, సితార జంక్షన్, కబేళా, సీవీఆర్ ఫ్లై ఓవర్, వైవీరావు ఎస్టేట్, ఆంధ్రప్రభ కాలనీ, ఏఎస్ నగర్ ఫ్లై ఓవర్ మీదుగా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లోకి మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు కూడా ఇదే మార్గాల గుండా వెళ్తాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు.. హైదరాబాద్ వైపు నుంచి చెన్నై, మచిలీపట్నం, ఏలూరు వైపు వెళ్లే ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను గొల్లపూడి నుంచి బైపాస్‌రోడ్డు మీదుగా సితార జంక్షన్, కబేళా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, ఎర్రకట్ట, సీతన్న పేట, బీఆర్టీఎస్ రోడ్డు, పడవలరేవు మీదుగా రామవరప్పాడు రింగ్‌కు వచ్చి 16వ నంబరు జాతీయ రహదారిలో కలుస్తాయి. హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు.. చెన్నై, ఏలూరు, మచిలీపట్నంల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, చిన్న కార్లు 16వ నంబరు జాతీయ రహదారిపై బందరులాకుల వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి పోలీసు కంట్రోలు మీదుగా అండర్‌బ్రిడ్జి, గద్దబొమ్మ, కాళేశ్వరరావు మార్కెట్, చిట్టినగర్, సొరంగం, సితార సెంటర్ మీదుగా గొల్లపూడి వైపు మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చే రవాణా వాహనాలు.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వైపునకు వెళ్లే భారీ వాహనాలను(లాంగ్ ఛాసిస్, కంటైనర్లు) ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం, నూజివీడు మీదుగా హనుమాన్ జంక్షన్ వద్ద 16వ నంబరు జాతీయరహదారికి మళ్లిస్తారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే భారీ వాహనాలను నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, దాచేపల్లి, చిలకలూరిపేట మీదుగా 16వ నంబరు జాతీయ రహదారికి మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి మైలవరం, చంద్రాల, నూజివీడు, హనుమాన్ జంక్షన్, గన్నవరం మీదుగా మళ్లిస్తారు. హైదరాబాద్ వైపు వెళ్లే రవాణా వాహనాలు.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే భారీ వాహనాలు వారిధి నుంచి గన్నవరం, హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం మీదుగా ఇబ్రహీంపట్నం వద్ద 65వ నంబరు జాతీయ రహదారికి మళ్లిస్తారు. గుంటూరు నుంచి వెళ్లే భారీ వాహనాలను చిలకలూరిపేట, దాచేపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా 65వ నంబరు జాతీయ రహదారికి మళ్లిస్తారు. పార్కింగ్ ప్రదేశాలు.. పున్నమి గెస్ట్‌హౌస్ పార్కింగ్ ప్రదేశం.. కుమ్మరిపాలెం వద్ద టీటీడీ చెందిన ఖాళీ స్థలం.. రాజీవ్‌గాంధీ పార్కు, పూలమార్కెట్, కాళేశ్వరరావు మార్కెట్లోని పెయిడ్ పార్కింగ్, గాంధీజీ మహిళా కళాశాల, తారాపేట రైల్వే స్టేషన్ ఆవరణ, పంజాసెంటర్లోని కృష్ణవేణి హోల్‌సేల్ మార్కెట్, ఓల్డ్ పోలీసు క్వార్టర్స్ ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోవచ్చు. -
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ పోలీసులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్ బండ్ చౌరస్తా కేంద్రంగా శనివారం రాత్రి 8 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. ఆహుతులకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. ♦ కర్బాలామైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైలింగ్ క్లబ్ నుంచి కవాడీగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్, ధోబీఘాట్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా పంపుతారు. ♦ ఎన్టీఆర్ ఘాట్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అంబేడ్కర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీరు తెలుగుతల్లి చౌరస్తా నుంచి రైట్ టర్న్ తీసుకుని ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్ మీదుగా వెళ్లాలి. ♦ సైఫాబాద్ పాత పోలీసుస్టేషన్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు అంబేడ్కర్ స్టాట్యూ వైపు వెళ్లకుండా ఇక్బాల్ మీనార్ నుంచి రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్ మీదుగా వెళ్లాలి. ♦ సాధూరామ్ కంటి ఆసుపత్రి నుంచి సెక్రటేరియేట్ వైపు వెళ్లే ట్రాఫిక్ లిబర్టీ నుంచి కుడి వైపు తిరిగి మొఘల్ దర్బార్ హోటల్, జీహెచ్ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లాలి. -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ జయంతి నేపథ్య ంలో శనివారం జరుగనున్న భారీ ఊరేగింపునకు నగర పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు విభాగంలో ఉన్న సిబ్బందితో పాటు సాయుధ బలగాలనూ బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. 14 వేల మందిని బందోబస్తుకు కేటాయించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ గురు–శుక్రవారాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేయడంతో పాటు బందో బస్తు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాన ఊరేగింపు జరిగే మార్గాలతో పాటు ప్రారంభం, ముగింపు జరిగే దేవాలయాలను కమిషనర్ సం దర్శించారు. గౌలిగూడ రామ్‌మందిర్ వద్ద ప్రారంభమయ్యే ప్రధాన ఊరేగింపు నగరంలో ని మూడు జోన్ల పరిధిలో 27 కిమీ మేర సాగుతూ తాడ్‌బండ్ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ముగుస్తుంది. మరోపక్క తూర్పు మండలంలోని ఐఎస్ సదన్ నుంచి మరో ఊరేగింపు మూడు కిలోమీటర్లు సాగి గౌలిగూడ రామ్ మందిర్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. మొత్తమ్మీద 15 ప్రాంతాల నుంచి వచ్చే ఊరేగింపులు ప్రధాన ఊరేగింపులో కలవనున్నాయి. సైబరాబాద్‌తో పాటు నగరంలోని తూర్పు, మధ్య, ఉత్తర మండలాల్లో మొత్తం 27 కిమీ మేర జరిగే ఊరేగింపును కమ్యూనిటీ, ట్రాఫిక్ సీసీ కెమెరాల ద్వారా బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) నుంచి పర్యవేక్షించనున్నారు. అదనంగా 570 తాత్కాలిక, మూవింగ్, వెహికిల్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉండే పోలీసులకు మరో 300 హ్యాండీ క్యామ్స్ అందిస్తున్నారు. ఆద్యంతం ప్రతి ఘట్టాన్నీ చిత్రీకించేలా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించిన పోలీసులు... శుక్రవారం రాత్రి నుంచే బారికేడ్లు ఏర్పా టు చేస్తున్నారు. బందోబస్తునూ రెండు రకాలు గా విభజించారు. శోభాయాత్ర వెంట ఉండేందు కు కొందరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యవేక్షించడానికి మరికొంత మందిని కేటాయిస్తున్నా రు. ప్రతి జోన్‌ను ఆయా డీసీపీలు బాధ్యత వహిస్తారు. వీరికితోడు ప్రాంతాల వారీగా సీనియర్ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఊరేగింపు ముందు, ముగింపులో అదనపు, సంయుక్త పోలీసు కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఊరేగింపులో దాదాపు 2 లక్షల మంది పాల్గొంటారని అధికారుల అంచనా. అసాంఘిక శక్తులపై డేగకన్ను... ఊరేగింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కొత్వాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శాంతిభద్రత విభాగంలో పాటు టాస్క్‌ఫోర్స్ అధికారులూ అప్రమత్తమయ్యారు. స్థానిక పోలీసులు మైత్రీ, పీస్ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేస్తున్నారు. మరోపక్క టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసుల రౌడీషీటర్లతో పాటు అనుమానిత వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి కొందరిని బైండోవర్ సైతం చేస్తున్నారు. ఊరేగింపు బందోబస్తు విధుల్లో ఉండే ప్రతి పోలీసు తమ చుట్టూ ఉన్న 25 మీటర్ల మేర కన్నేసి ఉంచుతారు. అక్కడ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ... స్మార్ట్ ఫోన్లలో ఉన్న ‘హైదరాబాద్ కాప్’ యాప్ ద్వారా వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తుంటారు. ఎవరికైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే వారి ఫోటోలతో పాటు వివరాలనూ పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ట్రాఫిక్ ఆంక్షలు... హనుమజ్జయంతి నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గౌలిగూడ రా>మ్మందిర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా, డీఎం అండ్ హెచ్ఎస్ సర్కిల్, రామ్ కోఠి చౌరస్తా, కాచిగూడ జంక్షన్, వైఎంసీఏ నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గాంధీనగర్, కవాడీగూడ, బైబిల్ హౌస్, ఎంజీ రోడ్, బాలమ్రాయ్ మీదుగా తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు సాగనున్న ఈ మార్గంలో ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థితిగతుల నేపథ్యంలో వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కమిషనర్ సూచించారు. మరోపక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీరాబాద్ చౌరస్తా వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. అవసరమైన పక్షంలో ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లిస్తారు. ♦ బందోబస్తు విధుల్లో ఐదుగురు అదనపు సీపీలు, ఒక సంయుక్త సీపీ, 13 మంది డీసీపీలు, 19 మంది అదనపు డీసీపీలు, 65 మంది ఏసీపీలు, 235 మంది ఇన్స్పెక్టర్లు, 670 మంది సబ్–ఇన్స్పెక్టర్లతో కలిపి మొత్తం 14 వేల మంది పాల్గొంటారు. ♦ చార్మినార్ ప్రాంతానికి అదనపు సీపీ (క్రైమ్) షికా గోయల్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తారు. సిద్ది అంబర్‌బజార్ మసీదు వద్ద క్యాంపు చేసే అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ మధ్య మండలాన్ని పర్యవేక్షించనున్నారు. అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్ పోలీసు కమిషనర్‌కు సహకరిస్తూ నగర వ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారు. ఊరేగింపు ప్రారంభంలో అదనపు సీపీ (సీఏఆర్) ఎం.శివప్రసాద్, ముగింపులో అదనపు సీపీ (పరిపాలన) టి.మురళీకృష్ణ ఉండనున్నారు. ♦ టాస్క్‌ఫోర్స్ టీమ్స్ ఊరేగింపు ఆద్యంతం బందోబస్తు నిర్వహించనున్నాయి. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సుల్తాన్‌బజార్ డివిజన్‌కు నేతృత్వం వహించనున్నారు. ♦ పోకిరీలకు చెక్ చెప్పడానికి షీ–టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 వరకు నగరంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. ♦ కమ్యూనికేషన్ పరికరాలు, బైనాక్యులర్లతో ఎల్తైన భవనాలపై రూఫ్ టాప్ వాచ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. -
అవనిగడ్డ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
కోడూరు : వివిధ సుదూరు ప్రాంతాల నుంచి పవిత్ర కృష్ణాసాగరసంగమంకు వచ్చే భక్తులు అవనిగడ్డ నుంచి విధిగా ట్రాఫిక్ అంక్షాలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. గురువారం సంగమం వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న అవనిగడ్డ సీఐ మూర్తి విలేకర్లతో ట్రాఫిక్ అంక్షాల గురించి తెలిపారు. అవనిగడ్డ నుంచి వి.కొత్తపాలెం–కోడూరు–దింటిమెరక–పాలకాయతిప్ప మీదగా సంగమానికి చేరుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులు మాత్రం కోడూరు–ఉల్లిపాలెం మీదగా హంసలదీవి రావాలన్నారు. హంసలదీవిలో అన్ని ఆర్టీసీ బస్సులను నిలిపివేయడం జరుగుతుందని, అక్కడ నుంచి పాలకాయతిప్ప సముద్రతీరం వరకు భక్తులను మినిబస్సుల ద్వారా పంపనున్నట్లు సీఐ తెలిపారు. ప్రయివేటు వాహనాలు మొత్తం దింటిమెరక మీదగా అనుమతిస్తామని, అవి నేరుగా పాలకాయతిప్ప వెళ్లవచ్చని చెప్పారు. డాల్ఫిన్భవనం నుంచి ప్రతి భక్తులు సంగమం వరకు నడిచి వెళ్లాలని, ఏవిధమైన వాహనాలను సంగమంకు అనుమతించడం లేదని తెలిపారు. తిరుగు ప్రయాణం ఉల్లిపాలెం మీదగా కోడూరు–వి.కొత్తపాలెం గుండా అవనిగడ్డ చేరుకోవాలని సీఐ సూచించారు. పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లో మాత్రమే భక్తులు తమ వాహనాలను నిలపాలన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలిచ్చారు.