కోటిన్నర పాత నోట్లు కొట్టేశారు..
హరియాణా: ఒక వైపు పెద్ద నోట్ల రద్దుతో ఖాతాదారుల అవసరాలు తీర్చడానికి అష్టకష్టాలుపడుతున్న బ్యాంకులను మరో తలనొప్పి వేధిస్తోంది. సందట్లో సడేమియాలా దొంగలు తమ చోరకళను ప్రదర్శిస్తున్నారు. హరియాణాలో దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. హిసార్ జిల్లాలో ఖార్ ఖోడాలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో చోరీకి పాల్పడ్డారు. ప్రజలు జమ చేసిన పాతనోట్లను సర్దుకు పోయారు. బుధవారం రాత్రి జరిగిన ఈఘటనలో దాదాపు రూ 1.22 కోట్లు పాతనోట్లను లూటీ చేశారు. గురువారం ఉదయం బ్యాంకు తెరిచిన తరువాత ఈవిషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, బ్యాంకు వెనకవైపు గోడకు కన్నం వేశారు. రద్దుచేసిన రూ .500, రూ.1,000 నోట్లను ఎత్తుకుపోయారు. అయితే వీటిలో కొత్త కరెన్సీ విలువ సుమారు రూ 30,000 ఉండొచ్చని చెప్పారు. మొఖాలకు ముసుగులు వేసుకొని, బ్యాంకు కన్నంవేసిన దొంగలు, అనంతరం సీసీటీవీలను ధ్వంసం చేశారని పోలీసు అధికారి రవీందర్ తెలిపారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం నిందితుల చేతులు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. దొంగతనం, క్రిమినల్ కుట్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు.
కాగా ఇటీవల (నవంబర్ 19) పంజాబ్ నేషనల్ బ్యాంకు ను టార్గెట్ చేసినదొంగల ముఠా రూ.81.46 లక్షలను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.