సాక్షి, హైదరాబాద్: ఓబీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఓబీసీ మోర్చా సోషల్ మీడియా జాతీయ సభ్యులు పెరిక సురేష్ పేర్కొన్నారు. ప్రతాప్‌గఢ్ ఎంపీ సంగమ్ లాల్ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఓబీసీల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు.
దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని, వెనుక బడిన వర్గాలకు వెన్ను దన్నుగా నిలిచి తోడ్పాటు అందిస్తామని హామీ నిచ్చినట్లు సురేష్ తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యతిరేక విధానాలతో ఓబీసీలు విసిగిపోయి బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారని అన్నారు.
ప్రస్తుతం బీజేపీలో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నారని, అయితే జనాభాకు అనుగుణంగా ఓబీసీలకు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు వెల్లడించారు. పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అందరి కృషితో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఓబీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధాని హామీనిచ్చారని సురేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్..
Comments
Please login to add a commentAdd a comment