న్యూఢిల్లీ: తుది విడత ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ విమర్శల జోరు పెంచింది. ఎన్నికల ప్రచారంలో మోడీ ఉపయోగించుకుంటున్న ‘ఓబీసీ’, ‘చాయివాలా’ కార్డులను లక్ష్యంగా చేసుకుని గురువారం విమర్శలు గుప్పించింది. మోడీ నకిలీ ఓబీసీ అని, తాను గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తరువాతే తన ‘మోధ్ ఘాంచీ’ కులాన్ని ఇతర వెనకబడిన తరగతుల కులాల జాబితాలో చేర్చారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గుజరాత్ మాజీ సీఎల్పీ నేత శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు. 2001 సెప్టెంబర్‌లో గుజరాత్ సీఎం అయిన మోడీ.. 2002 జనవరిలో మోధ్ ఘాంచీలను ఓబీసీల్లో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వును కూడా ఆయన చూపించారు.
నిజానికి మోధ్ ఘాంచీలు ఉన్నత కులానికి చెందిన సంపన్న వ్యాపార వర్గాలని, వారిని ఓబీసీల్లో చేర్చడం ద్వారా నిజమైన ఓబీసీలకు మోడీ అన్యాయం చేశారని గోహిల్ ఆరోపించారు. గతంలో ఏ కమిషన్ కూడా మోధ్ ఘాంచీలను ఓబీసీల్లో చేర్చడానికి సిఫారసు చేయలేదని, అలాగే మోధ్ ఘాంచీ కులస్తులు కూడా తమను ఓబీసీల్లో చేర్చమంటూ ఏనాడూ డిమాండ్ చేయలేదని ఆయన వివరించారు.