
సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ ఈశ్వరయ్య
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. చట్టసభల్లోకి వెళితేనే సమన్యాయం జరుగుతుందని పేర్కొనారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓబీసీ జాతీయ జాయింట్ కమిటీ సమావేశంలో 27 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
జస్టిస్ ఈశ్వరయ్యను జాతీయ ఓబీసీ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం, సమానత్వం రావాలంటే పార్లమెంట్, అసెంబ్లీలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, క్రిమీలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటర్ల గణన శాస్త్రీయంగా జరగలేదని, పంచాయతీ రాజ్ ఎన్నికలవరకల్లా సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓబీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు యాక్షన్ కమిటీ కృషిచేస్తుందని పేర్కొన్నారు. యాక్షన్ కమిటీకి తోడుగా మండల స్థాయివరకూ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంట్, కోర్టుల్లో ప్రజాస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటును అమ్ముకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా బీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment