బీసీలను చంద్రబాబు అణగదొక్కుతున్నారు | Chandrababu is undermining BCs | Sakshi
Sakshi News home page

బీసీలను చంద్రబాబు అణగదొక్కుతున్నారు

Published Mon, Apr 23 2018 2:25 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

Chandrababu is undermining BCs - Sakshi

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): సీఎం చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఆయన కులానికి చెందిన వారికి మాత్రమే న్యాయం జరుగుతోందని మండిపడ్డారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాలకు పరిమితి లేకుండా పోయిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో బాబు వ్యవహరించిన తీరు బీసీలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు.

 కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు రాసిన లేఖ 

హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఇద్దరు బీసీలు(అమర్‌నాథ్‌గౌడ్, అభినవకుమార్‌ చావల్లి)తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావును సిఫార్సు చేస్తే.. అమర్‌నాథ్‌గౌడ్, అభినవకుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఆరోపించారు.

హైకోర్టు జడ్జిగా అమర్‌నాథ్‌ గౌడ్‌ పనికిరారంటూ పలు ఆరోపణలు చేస్తూ పంపిన లేఖ  

సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ తప్పుడు నివేదిక అందజేసి మోకాలడ్డేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే ఇంటెలిజెన్స్‌ బ్యూరో విచారణ చేపట్టి ఆ నలుగురిపై చంద్రబాబు ఇచ్చిన నివేదికలో వాస్తవం లేదని తేల్చడంతో వారు జడ్జీలుగా నియమితులయ్యారని చెప్పారు. తన వద్ద సాక్ష్యాలున్నాయంటూ.. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు చంద్రబాబు రాసిన లేఖలను ఆయన మీడియాకు విడుదల చేశారు. బీసీలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారని.. కానీ ఆ విలువలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైకోర్టు జడ్జిలుగా అభినవ్‌కుమార్, గంగారావు పనికిరారంటూ ఆరోపణలు చేస్తూ చంద్రబాబు పంపిన లేఖ  

స్వర్ణాంధ్రప్రదేశ్‌ చంద్రబాబు జాతి కులానికేనా? అని ప్రశ్నించారు. బాబు కులానికి చెందిన వారికి తప్ప ఇతర వర్గాలకు ఎలాంటి ప్రాజెక్టులు గానీ.. పనులు గానీ దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీ మంత్రులున్నప్పటికీ వారికి ఎలాంటి అధికారాలు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజా రక్షకుడిగా ఉన్న వ్యక్తే భక్షకుడిగా మారారని దుయ్యబట్టారు. బాబుకు వత్తాసు పలికిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

 హైకోర్టు న్యాయమూర్తి డీవీ సోమయాజులుపై కేంద్ర న్యాయశాఖ మంత్రికి చంద్రబాబు పంపిన లేఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement