సాక్షి, విజయవాడ: వరుసబెట్టి పిటిషన్లు.. న్యాయస్థానాల్లో వరుస ఎదురు దెబ్బలు.. అయినా కొనసాగుతున్న పిటిషన్ల పర్వం. దారులన్నీ మూసుకుపోతున్న తరుణంలో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చంద్రబాబు అండ్ కో ఉంది. ఈ సమయంలో ఆయన తరపు లాయర్లు కూడా ఫ్రస్టేట్ అవుతున్నారు. సీఐడీ తరపు న్యాయవాదులతో తాజాగా దురుసుగా ప్రవర్తించారు.
ఇవాళ ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ వేశాయి. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ జడ్జికి వివరించగా.. అసలు పిటిషనుకు అర్హతే లేదని సీఐడీ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ సందర్భంలో.. సీఐడీ తరపు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానందపైకి చంద్రబాబు లాయర్లు దూసుకెళ్లారు.
వివేకా లీగల్ సబ్మిషన్లు చెబుతున్న సమయంలో లాయర్ లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో.. ఈ కేసులో ఎందుకిలా చేస్తున్నారంటూ లక్ష్మీ నారాయణను జడ్జి ప్రశ్నించారు. మరోవైపు లక్ష్మీ నారాయణ తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేశారు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద. అయితే ఇరువైపులా వాగ్వాదం జరిగింది. ఇరువైపులా అరుపులతో కాసేపు కోర్ట్ హాల్ దద్దరిల్లిపోయింది.
దీంతో.. న్యాయవాదులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ, నాగరాజు అనే లాయర్లు.. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్నారా? అంటూ ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. అయితే ‘లేరు’అని చంద్రబాబు తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. దీంతో.. న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టు హాల్లో అతిగా ప్రవర్తించిన వాళ్ల పేర్లు రాసుకోవాలంటూ జడ్జి ఆదేశించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ.. ఈ విధంగా ఉంటే విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment