‘హౌస్ రిమాండ్‌లో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?’ | AP Skill Development Scam Case: ACB Court Reject Chandrababu Naidu House Arrest Petition - Sakshi
Sakshi News home page

జైల్లోనే ఎక్కువ భద్రత.. హౌస్ రిమాండ్‌లో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?: ఏసీబీ జడ్జి

Published Tue, Sep 12 2023 5:10 PM | Last Updated on Tue, Sep 12 2023 6:10 PM

ACB Court Reject Chandrababu House Arrest Petition - Sakshi

సాక్షి, విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయిన ప్రధాన ముద్దాయి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో ఊరట దక్కలేదు. ఆయన తరపున దాఖలైన హౌజ్‌ రిమాండ్‌ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు మంగళవారం సాయంత్రం కొట్టేసింది. ఏపీ సీఐడీ వాదనతో ఏకీభవించిన కోర్టు.. జైల్లోనే ఆయనకు భద్రత ఉంటుందని స్పష్టంగా పేర్కొంటూ హౌజ్‌ రిమాండ్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు  తీర్పునిచ్చింది. 

ఏసీబీ  కోర్టు న్యాయమూర్తి తీర్పు సందర్భంగా.. 
ఇంట్లో వుండే భద్రత కంటే.. జైల్లో వుండే భద్రత ఎక్కువ. ఒకసారి కోర్టు రిమాండ్‌ విధించింది అంటే.. అది వ్యవస్థ బాధ్యత. హౌస్ రిమాండ్‌ కావాలని అడుగుతున్నారు. కానీ, అక్కడ  ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?. జైల్లో భద్రత కల్పిస్తున్న వాటిపై అన్ని అంశాలు స్పష్టంగా సీఐడీ చెప్పింది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తులకు ఎన్‌ఎస్‌జీ  సెక్యూరిటీ ఇవ్వాలనే అంశాన్ని కోర్టులో చూపకపోవడంతో డిస్మిస్ చేస్తున్నాం.  హౌస్ కస్టడీలో ఉంచేందుకు చట్టపరమైన  నియమ నిబంధనలను ఏసీబీ కోర్టు ఎదుట చూపలేదు. ఈ కారణాలతో హౌస్ అరెస్టుకు సంబంధించిన పిటిషన్ కొట్టివేస్తున్నాం.

స్కిల్‌ స్కాంలో ఏ1 చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ను.. హౌజ్‌ రిమాండ్‌గా పరిగణించాలని, ఈ మేరకు ఇంట్లోనే ఉండేందుకు ‘హౌజ్‌ అరెస్ట్‌’ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విజ్ఞప్తిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్‌ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. 

చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ప్రధానంగా పేర్కొన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్‌ లూద్రా.. చంద్రబాబుకు ఉన్న ఎన్‌ఎస్‌జీ భద్రత, వీవీఐపీ, 73 ఏళ్ల వయస్సు, ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని హౌస్ అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో 2018 భీమా కోరేగావ్ హింస కేసులో నిందితుడు.. మానవ హక్కుల సంఘం కార్యకర్త గౌతమ్‌ నవలఖాకు సుప్రీం కోర్టు ‘హౌజ్‌ అరెస్ట్‌’ వీలు కల్పించిన కేసును ప్రస్తావించారు కూడా. 

అయితే సీఐడీ.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుకు ముప్పు లేదని.. ఆయన పూర్తి భద్రతలో ఉన్నారని.. జైలులో ‌ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, వ్యక్తిగత సహాయకుడిని కల్పించామని, చంద్రబాబు బయట ఉంటే సాక్షులని ప్రభావితం చేసే అవకాశముందని.. గృహ నిర్బంధం‌ పిటిషన్‌కి విచారణ అర్హత లేదని.. పిటిషన్ తిరస్కరించాలని సీఐడీ తరఫున గట్టి వాదనలు వినిపించారు సుధాకర్ రెడ్డి. 

ఇరు వర్గాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి.. సీఐడీ వాదనలతోనే ఏకీభవించారు. చంద్రబాబు హౌజ్‌ కస్టడీ పిటిసన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. 


ప్రైవేట్‌ హౌజ్‌లో అంత భద్రత ఎక్కడ?: ఏఏజీ 
‘‘సీఆర్పీసీలో రెండు కస్టడీలు మాత్రమే ఉన్నాయి. అవి జ్యూడీషియల్‌, పోలీస్‌ కస్టడీలు. హౌజ్‌ అరెస్ట్‌ అనేది లేనే లేదు. చట్టం ముందు అందరూ సమానమే. చంద్రబాబుకి పూర్తి భద్రత ఉంది. రాజమండ్రి జైలులో హైసెక్యూరిటీ ఉంది. ప్రైవేట్‌ హౌజ్‌లో అంత భద్రత ఎక్కడ ఉంటుంది. పైగా చంద్రబాబు కోసం ఇంటి నుంచే ఆహారం పంపించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.  చంద్రబాబు విన్నపాలను పరిగణనలోకి తీసుకున్నాం. బాబు అనుమతి లేనిదే వారి బ్లాక్‌కూ ఎవరూ వెళ్లరు. బాబు ఆరోగ్య పర్యవేక్షణకు వైద్యులు అందుబాబులో ఉంటారు.’’

ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేదనడం తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోతే తప్పు చేయలేదని కాదు. చంద్రబాబు పాత్ర దర్యాప్తులో బయటపడింది. దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకే చంద్రబాబు పేరు.

:::తీర్పు అనంతరం ఏజీజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement