న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), ఐడీబీఐలు వినియోగ వస్తువులు, వాహన రుణాలపై వడ్డీరేట్లను 2.50% దాకా తగ్గించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరిన్ని రుణాలిస్తామన్న ప్రభుత్వ హామీతో ఈ బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధించాయని, త్వరలో ఎస్‌బీఐ కూడా ఇదే బాట పట్టనున్నదని నిపుణులంటున్నారు. పండుగ సీజన్‌లో రుణాలిచ్చి కొనుగోళ్ల ద్వారా ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించడానికి ప్రభుత్వం ఈ నిధులను అందిస్తోంది.
100% పీఎన్‌బీ రుణం : కారు కొనుగోళ్లకు 10.65% వడ్డీరేట్లకే రుణాలందిస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) పేర్కొంది. టూ-వీలర్ల రుణాలపై వడ్డీరేట్లను 12.25%కి, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లను 12.75 శాతానికి తగ్గించామని వివరించింది. మొత్తం మీద వడ్డీరేట్లను 1-2.50% మేర తగ్గించామని పేర్కొంది. కారు రుణాలపై ఎలాంటి డాక్యుమెంటేషన్ చార్జీలు వసూలు చేయబోమని, ఎక్స్‌షోరూమ్ ధరపై 100% రుణమందిస్తామని పేర్కొంది. ఈ ఆఫర్లు వచ్చే ఏడాది జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటాయని పీఎన్‌బీ పేర్కొంది. అయితే గృహ రుణాల రేట్లలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.
ఓబీసీ కూడా: వినియోగ వస్తువులు, వ్యక్తిగత, వాణిజ్య వాహన రుణాలపై వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నామని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) మంగళవారం తెలిపింది. ఈ వడ్డీరేట్ల తగ్గింపు రేపటి(గురువారం) నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. ఫోర్ వీలర్ల కొనుగోళ్లకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లను 12.25% నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వ్యక్తిగత, వినియోగ వస్తువుల రుణాలపై వడ్డీరేట్లను 12.75% నుంచి 12.50 శాతానికి తగ్గించామని వివరించింది. కార్లు, టూ-వీలర్ల రుణాలకు సంబంధించి మూడేళ్లలో చెల్లించే రుణాలపై 10.75%, మూడేళ్లకు మించిన రుణాలపై 11% వడ్డీ రేట్లకే రుణాలను ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది.
బేస్‌రేట్‌కే ఐడీబీఐ రుణం
కొత్తగా గృహ, వాహన రుణాలు తీసుకునే వారికి బేస్ రేట్‌కే(10.25 శాతం) రుణాలందిస్తామని ఐడీబీఐ పేర్కొంది. ఇది నేటి నుంచే వర్తిస్తుందని వివరించింది. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయబోమని వివరించింది.
గృహ రుణాల రేట్లు అంతే..: ఎస్‌బీఐ
కారు, కన్జూమర్ గూడ్స్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది కానీ గృహ రుణాలపై మాత్రం తగ్గించే అవకాశాలే లేవని ఎస్‌బీఐ ఎండీ(ఇంచార్జ్) ఎ. కృష్ణకుమార్ స్పష్టం చేశారు. గృహ రుణాల వడ్డీ రేట్లు ఇప్పటికే చాలా కనిష్ట స్థాయిలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. రిటైల్ రుణాల వడ్డీ రే ట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు వచ్చాయని, రాబోయే నెలల్లో వీటి అమలుపై దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులపైనే వడ్డీ రేట్ల తగ్గింపు ఉండగలదే తప్ప కొత్త వాటిని జాబితాలో చేర్చే యోచనేమీ లేదని కృష్ణకుమార్ చెప్పారు.
రుణాలపై వడ్డీ రేట్ల ఊరట..
Published Wed, Oct 9 2013 1:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement