
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో రూ.113 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.393 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఓబీసీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత క్యూ4లో రూ.202 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. రుణ నాణ్యత మెరుగుపడటం, మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు తక్కువగా ఉండటం, ట్రెజరీ ఆదాయం పెరగడం.. తదితర కారణాల వల్ల గత క్యూ1లో నికర లాభం సాధించామని ఓబీసీ ఎమ్‌డీ, సీఈఓ ముకేశ్ జైన్ తెలిపారు. వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ లాభాలు సాధించామని పేర్కొన్నారు. గత క్యూ1లో రూ.4,730 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.5,635 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
సాధారణంగా జూన్ క్వార్టర్‌లో వ్యాపారం మందకొడిగా ఉంటుందని, అయినప్పటికీ, రూ. లక్ష కోట్ల మేర వ్యాపారం సాధించామని ముకేశ్ జైన్ తెలిపారు. ట్రెజరీ ఆదాయం రూ.76 కోట్ల నుంచి రూ.179 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. వడ్డీ ఆదాయం రూ.4,269 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ,.4,919 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇతర ఆదాయం రూ.461 కోట్ల నుంచి 55 శాతం వృద్ధితో రూ.715 కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 2.82 శాతం నుంచి 2.41 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
రూ.3,000 కోట్ల సమీకరణ
స్థూల మొండి బకాయిలు 17.89 శాతం నుంచి 12.56 శాతానికి, నికర మొండి బకాయిలు 10.63 శాతం నుంచి 5.91 శాతానికి తగ్గాయని జైన్ వివరించారు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,222 కోట్ల నుంచి రూ.865 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడితే, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ మార్గంలో రూ.3,000 కోట్లు సమీకరించనున్నామని తెలిపారు.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఓబీసీ షేర్ 2 శాతం నష్టంతో రూ.80.35 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment