
జగదల్‌పూర్: దేశంలో పేదరికం ఒక్కటే కులమన్న ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తాను ఇతర వెనుకబడిన వర్గానికి (ఓబీసీ) చెందిన వాడినని ఎలా చెప్పుకుంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో శనివారం రాహుల్ ఎన్నికల సభలో ప్రసంగించారు. గిరిజనులను ‘ఆదివాసీ’లకు బదులుగా వనవాసీలని సంబోధిస్తూ బీజేపీ వారిని అవమానిస్తోందని అన్నారు. ‘బీజేపీ నాయకులు ఆదివాసీలను వనవాసీలు అనే పేరుతో పిలుస్తున్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఈ వనవాసీ పదాన్ని పరిచయం చేశాయి. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నాయకుడు గిరిజన యువకుడిపై మూత్రం పోశాడు. దీన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఇదీ బీజేపీ ఆలోచనాధోరణి. అడవుల్లో జంతువుల్లా మిమ్మల్ని వారు చూస్తారు’ అని రాహుల్ పేర్కొన్నారు. ఆదివాసీలే దేశానికి అసలు సిసలైన యజమానులు. అందుకే బీజేపీ ఈ పదాన్ని వాడదు. ఆదివాసీలని సం¿ోదిస్తే... మీ భూమి, నీళ్లు, అడవులను మీకు ఇచ్చేయాల్సి వస్తుందని బీజేపీ భయమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు.