
కోర్బా/సంబల్‌పూర్: ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడటం ఆ గొప్ప వంశానికి అలవాటేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘మోదీలంతా దొంగలెందుకయ్యారు?’అన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పరోక్షంగా ఆయన ఈ మాటలన్నారు. ప్రధాని మంగళవారం ఒడిశాలోని భాటాపర, సంబల్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
మాట్లాడదగిన భాషేనా అది?
మోదీ పేరున్న ప్రతి వారినీ దొంగే అని పిలవడంపై ప్రధాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సాహు కులస్తులను గుజరాత్ మోదీ అని, రాజస్థాన్‌లో రాథోడ్‌లని పిలుస్తుంటారు. మోదీ పేరున్న ఎవరైనా వారి దృష్టిలో దొంగే. మాట్లాడదగిన భాషేనా ఇది? చౌకీదార్‌ను అవమానించేందుకు, జనంతో చప్పట్లు కొట్టించుకునేందుకు ఏకంగా ఓ కులంపై దొంగ అనే ముద్ర వేస్తున్నారు. రేపు బీసీలను, గిరిజనులను దూషిస్తారు. అట్టడుగు వర్గాల వారిని బానిసలుగా చూస్తూ కించపరచడం ఈ రాచ కుటుంబానికి అలవాటే’అని మండిపడ్డారు. అవహేళన చేయడమనే అలవాటున్న ఇలాంటి వారిని తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఒక్క ఓటు ద్వారానే అవన్నీ సాధ్యం
ప్రజలిచ్చిన ఒక్క ఓటు శక్తితోనే ప్రభుత్వం పాక్‌పై వైమానిక దాడి, సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టడంతోపాటు, అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని క్షిపణితో కూల్చి వేయడం వంటి సాహసోపేత చర్యలకు పూనుకుందని ప్రధాని మోదీ అన్నారు. శత్రుదేశం ఉపగ్రహాన్ని కేవలం మూడు నిమిషాల్లోనే కూల్చివేయగల సత్తా ఇప్పుడు భారత్‌కు ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో సైనిక బలగాల ప్రస్తావన తీసుకు రావద్దంటూ అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ గతవారం నిర్దేశం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై నిప్పులు
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఎమ్మెల్యేను మావోయిస్టులు పొట్టనబెట్టుకోవడంపై ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోయాయని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మావోయిస్టులు ఏకమయ్యారని ఆరోపించారు. అదేవిధంగా పేదలకు ఆరోగ్య సేవలు అందకుండా చేసేందుకు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం అమలును నిలిపివేసిందని తెలిపారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజలను విస్మరించటంలో కాంగ్రెస్ పార్టీ పీహెచ్‌డీ చేసిందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఒడిశాలోని పట్నాయక్ ప్రభుత్వం పీఎం–కిసాన్ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు.