భోపాల్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే యుద్ధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఒక వైపు మహాత్మాగాంధీ, మరోవైపు ఆయనని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే మధ్య ఎన్నికల పోరు జరగనుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఓబీసీల సంఖ్య తెలుసుకోవడానికి కులగణన చేపడతామని చెప్పారు. ఈ డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లోని షాజపూర్‌లో జన ఆక్రోశ్ ర్యాలీలో రాహుల్ గాంధీ శనివారం పాల్గొన్నారు. ‘‘ఈ సారి ఎన్నికల పోరు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతుంది.
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ, ఆరెస్సెస్, ఒక వైపు మహాత్మాగాంధీ మరోవైపు గాడ్సేలు నిలిచి పోరాడతారు. ప్రేమ, సోదరభావం ద్వేషానికి మధ్య ఈ పోరాటం ఉంటుంది’’ అని రాహుల్ చెప్పారు. బీజేపీ ప్రజలకి ఏం ఇస్తే వారు అదే తిరిగి ఇస్తారని, ఇన్నాళ్లూ బీజేపీ వారిలో విద్వేషం నింపిందని, ఇప్పుడు ప్రజలే బీజేపీని ద్వేషిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ దేశంలో ఆరెస్సెస్‌కు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులే చట్టాలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, బీజేపీ ప్రజాప్రతినిధులకి ఎలాంటి పాత్ర లేదని అన్నారు. ఆరెస్సెస్ చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆడుతోందని రాహుల్ ఆరోపించారు.
అవినీతి కేంద్రంగా ఎంపీ
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదికన జనాభా గణన చేపడతామని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు. ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) సంఖ్యను తెలుసుకోవడానికే కుల గణన చేపడతామన్నారు. అవినీతికి మధ్యప్రదేశ్ కేంద్రంగా మారిందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ హయాంలో గత 18 ఏళ్లలో 18 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment