ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి శూద్ర ఓబీసీల సదస్సు చేసిన డిక్లరేషన్ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రకటన అని చెప్పాలి. కులాలవారీ జన గణనను సాధించడం, రిజర్వుడ్ ఉద్యోగాలను కొల్లగొట్టడానికి ఉపాధి రంగాన్ని మొత్తంగా ప్రైవేటీకరించడాన్ని నిరోధించడం, జాతీయ సంపదను అగ్రకుల పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడాన్ని అడ్డుకోవడం కోసం మరో కీలకమైన శూద్ర ఓబీసీల ఉద్యమం అవసరముందని ఇది స్పష్టం చేసింది. బ్యాంకులు, రైల్వేలు, ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించడం పూర్తయితే ఇకపై వాటిలో శూద్ర ఓబీసీలకు, దళితులకు, ఆదివాసీలకు ఉద్యోగాలు ఉండవని తెలిసిందే. ప్రస్తుత పాలకవర్గ శక్తులు వెనుకబడిన వర్గాలకు మంచి జీవితం అందించడంపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. కాబట్టే శూద్ర ఓబీసీ దళిత, ఆదివాసీ శక్తులు రెండో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాలి. ఢిల్లీలో ఇటీవలే ముగిసిన శూద్ర ఓబీసీ సదస్సు ఇస్తున్న సందేశమిదే!
ఢిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో 2021 డిసెంబర్ 21న భారీస్థాయి జాతీయ శూద్ర ఓబీసీల సదస్సు జరిగింది. వందలాది శూద్ర ఓబీసీ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, వివిధ యూనివర్శిటీలు, పౌరసమాజ సంస్థలకు చెందిన మేధావులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మొట్టమొదటి శూద్ర ఓబీసీ డిక్లరేషన్‌ని వీరు తీసుకొచ్చారు. ఇది దేశం మొత్తానికి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రకటన.
చరిత్రాత్మకమైన రైతుల పోరాటం... భారతీయ వ్యవసాయ మార్కెట్లను హిందుత్వశక్తులు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా శూద్ర ఓబీసీలు చేసిన పోరాటం మాత్రమే. ఆ తర్వాత కులాలవారీ జనగణనను సాధించడం, రిజర్వుడ్ ఉద్యోగాలను కొల్లగొట్టడానికి ఉపాధి రంగాన్ని మొత్తంగా ప్రైవేటీకరించడాన్ని నిరోధించడం, జాతీయ సంపదను అగ్రవర్ణ పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడాన్ని అడ్డుకోవడం కోసం మరొక కీలకమైన శూద్ర ఓబీసీల ఉద్యమం ఇప్పుడు నడుస్తోంది. అయితే శూద్ర ఓబీసీ శక్తులను బలహీనపర్చి వారిని ప్రాచీన భారతదేశంలోని బానిసల్లాగా మార్చడానికి హిందుత్వ శక్తులు కుట్రపన్నుతున్నాయి.
శూద్ర ఓబీసీల సదస్సు నిర్వాహక కమిటీకి మండల్ ఉద్యమ హీరో శరద్ యాదవ్ నేతృత్వం వహించారు. కాగా, చగన్ భుజ్‌బల్ (ఎన్సీపీ కేబినెంట్ మంత్రి, మహారాష్ట్ర), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ అధ్యక్షుడు), కనిమొళి కరుణానిధి (ఎంపీ, డీఎంకే), కంచ ఐలయ్య (ఎడిటర్, విజన్ ఫర్ ఎ న్యూ పాత్) సునీల్ సర్దార్ (ప్రెసిడెంట్, సత్య శోధక్ సమాజ్) ఈ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. సమృద్ధ భారత్ ఫౌండేషన్–ఢిల్లీ, మహాత్మా ఫూలే సమతా పరిషద్–మహారాష్ట్ర సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.
ఢిల్లీ డిక్లరేషన్‌పై పలువురు పండితులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు ప్రసంగించి, లోతుగా చర్చించారు. రాబోయే నెలల్లో వివిధ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చిం చారు. దేశంలో మండల్ అనంతర పోరాటాలు ఎన్నింటికో నాయకత్వం వహించిన లాలూ ప్రసాద్ యాదవ్ వర్చువల్‌గా మాట్లాడారు. సామాజిక న్యాయాన్ని సాధించాలంటే కులాలవారీ జనగణన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టంగా చెప్పారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, చగన్ భుజ్‌బల్, డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, హరియాణా మాజీ మంత్రి అజయ్ యాదవ్‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, మేధావులు ఈ ప్రకటనలోని లక్ష్యాల సాధనకు, దేశవ్యాప్తంగా శూద్ర ఓబీసీ శక్తులను సంఘటితం చేయడానికి అవసరమైన రాజకీయ, బౌద్ధిక ఎజెండాను రూపొందించారు. సుప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్ ఈ సదస్సుకు శక్తిమంతమైన సందేశం పంపారు. భారతదేశంలో సామాజిక బాధ్యత కలిగిన ప్రతి మేధావికీ కులాలవారీ జనగణన ఉమ్మడి లక్ష్యంగా ఉండాలని ఆమె వక్కాణించారు.
ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలో ఉన్న పాలక రాజకీయ వ్యవస్థ శూద్ర ఓబీసీలను బలహీనపర్చాలని ప్రయత్నిస్తోంది. రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేయాలని, ద్విజ గుత్తాధిపత్య కుటుంబాలను పైకి తేవాలని అది కంకణం కట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కులాలవారీ జనగణన కోసం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాటం దేశీయ ఆహార ఉత్పత్తిదారులకు, హస్తకళల నిపుణులకు జీవన్మరణ సమస్యగా మారుతోంది. వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా గత 13 నెలలుగా మన దేశంలోని రైతులు చావో రేవో చందంగా పోరాడుతూ వచ్చారు. ఈ క్రమంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఓటు వేసిన శూద్రఓబీసీలు తమను కూడా వారు భరతమాత ముద్దుబిడ్డల్లాగే చూస్తారని నమ్మారు. కానీ ఏడేళ్ల పాలనా కాలంలో నేటి పాలకులు తమ రైతు వ్యతిరేక, ఓబీసీ వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. 1990లలోని మండల్ ఉద్యమంతో సామాజిక న్యాయ పోరాటం ముగియలేదని, అది ఇప్పటికీ కొనసాగుతోందని ఢిల్లీ డిక్లరేషన్ వాగ్దానం చేసింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ మండల్ రిజర్వేషన్ కోసం నాడు పోరాడిన శూద్రులు, ఇప్పుడు రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తున్న మరాఠాలు, జాట్లు, కాపు వంటి కులాలకు చెందిన శూద్రులు ప్రస్తుత ప్రమాదానికి వ్యతిరేకంగా సర్వశక్తులూ ఉపయోగించాల్సి ఉంది.
బీజేపీ ఆరెస్సెస్ అధికారంలోకి రాగానే వ్యవసాయం సంపద్వంతమౌతుందని, లంచగొండితనం తగ్గిపోతుందని రెడ్లు, కమ్మ, వెలమలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కేరళలో నాయర్లు, బెంగాల్‌లో మహిష్యాలు నిజంగానే భావించారు. కానీ జరుగుతున్నదేమిటి? మునుపటిలా చిన్నపాటి అవినీతి స్థానంలో లక్షలాది కోట్ల రూపాయలను రుణమాఫీ ద్వారా గుత్తసంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని బ్యాంకులను, రైల్వేలను, ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించడం గురించి ఆలోచిస్తున్నారు. ప్రైవేటీకరించిన సంస్థల్లో శూద్ర ఓబీసీలకు, దళితులకు, ఆదివాసీలకు ఉద్యోగాలు లేవన్న విషయం తెలిసిందే. ఆరెస్సెస్ బీజేపీ మద్దతుదారులు తమ పిల్లలను ఉత్తమమైన ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేర్పించి చదివిస్తున్నారు. పైగా ఇంగ్లిష్‌ను ఆధునిక సంస్కృతం లాగా చేసి ద్విజుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంచాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరుకుంటోంది.
శూద్ర ఓబీసీల్లో అతి కొద్దిమంది మాత్రమే ఈ గేమ్ ప్లాన్‌ని అర్థం చేసుకుంటున్నారు. వారి పిల్లలను సంపద లేని వ్యవసాయ రంగంలోకి నెట్టేస్తున్నారు. పైగా ఆహారాన్ని, మతాన్ని అధికారంతో ముడిపెడుతున్నారు. ఇది శూద్ర ఓబీసీల చుట్టూ పన్నుతున్న అతి పెద్ద ఉచ్చు. భవిష్యత్తులో వీరి పిల్లల మెదళ్లు, శరీరాలు బలహీనంగా మారిపోతాయి. మొత్తం మీద పాలక వర్గ శక్తులు వీరికి మంచి జీవితం అందించడంపై ఏ మాత్రం శ్రద్ధపెట్టడం లేదు. శూద్ర దళిత ఆదివాసీ శక్తుల అజ్ఞానాన్నే తప్ప వారిలో విజ్ఞానాన్ని పాలకులు ప్రేమించడం లేదు. శూద్ర ఓబీసీ మేధావులు ప్రప్రథమంగా వీరి ఆటను పసిగట్టడం ప్రారంభించాయి. ఈ వర్గాల నుంచి అత్యున్నత విద్యావంతులైన మేధావులు, చింతనాపరులు, రచయితలు, పోరాటకారులు ఆవిర్భవించకపోతే వీరి పిల్లలు తిరిగి బానిసలుగా మారిపోతారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు అటు గ్రామాల్లోనూ, ఇటు ప్రైవేటీకరించిన పరిశ్రమల్లోనూ ఉపాధి దొరకడం లేదు. యజమానుల కంపెనీల్లో, కొద్దిమంది సంపన్నుల కంపెనీల్లో సెక్యూరిటీ సిబ్బందిగా మాత్రమే శూద్ర ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు చేరుతున్నారు. వీటిలో నెలకు పదివేల రూపాయల కంటే తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ఈ కంపెనీలు మొత్తంగా ప్రైవేట్ కంపెనీలే. బిజినెస్ కుటుంబాలు ఆరెస్సెస్ – బీజేపీ శాఖల సమన్వయంతో వీటిని నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన శూద్ర ఓబీసీల సదస్సు ఈ ప్రక్రియను గుర్తించింది కూడా!
అసలు విషయం మరొకటుంది. దళితులు, ఉదివాసీలను అలా పక్కన బెట్టండి. చివరకు శూద్ర ఓబీసీలు కూడా మేధావులు, చింతనాపరులుగా మారడానికి పాలక వ్యవస్థ ఏ మాత్రం అంగీకరించడం లేదు. ప్రపంచస్థాయి విజ్ఞానం వీరికి కూడా అందాలని పాలకవ్యవస్థ భావించడం లేదు. ఆరెస్సెస్ అగ్రనేతల ప్రసంగాలు పదే పదే దీన్నే నిరూపిస్తున్నాయి. కాబట్టే శూద్ర ఓబీసీ, దళిత, ఆదివాసీ శక్తులు రెండో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాలి. ఢిల్లీ సరిహద్దుల్లో మొన్నటి వరకు పోరాడి మరణించిన రైతు హీరోల మార్గం వీరికి ఆదర్శం కావాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే జరిగిన శూద్ర ఓబీసీ సదస్సు ఇస్తున్న సందేశమిదే!
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment