సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుకాపు సామాజికవర్గాన్ని ఓబీసీ జాబితాలలో చేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్‌లు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాత్‌తో భేటీ అయ్యారు. తూర్పు కాపులను కేంద్ర ప్రభుత్వ ఓబీసీలో చేర్చాలని ఈ నేతలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కాపులను రాష్ట్రమంతటా బీసీలుగా గుర్తించారని గుర్తుచేశారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా మూడు జిల్లాలోని తూర్పు కాపులను మాత్రమే ఓబీసీలుగా గుర్తిస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల మిగిలిన జిల్లాల్లోని తూర్పుకాపులకు అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని తూర్పు కాపులను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాత్‌ను కలిసి వినతిపత్రం అందజేశామని ఆయన పేర్కొన్నారు. ‘మంత్రి తూర్పు కాపుల సమస్య తెలుసని ఈ విషయాన్ని బీసీ కమిషన్‌కు బదిలీ చేస్తున్నాను. బీసీ కమిషన్ నివేదిక రాగానే దానిపై తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు’ అని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment