కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహారదీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి.చిత్రంలో కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా
ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం ఆది నుంచి కొనసాగుతూ ఉంది. ఢిల్లీలో ఎంపీల దీక్షలకు మద్దతుగా ప్రారంభమైన ఆందోళనలు...గురువారం ఆరోరోజు కూడా కొనసాగాయి.అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నినదించారు.
సాక్షి, కడప : హోదా సాధనే ధ్యేయంగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు ఆరో రోజు కొనసాగాయి. కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలకు కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాష తదితరులు సంఘీభావం తెలియజేశారు. రాజంపేటలో జరుగుతున్న దీక్షలకు రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి,పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. కమలాపురంలో దీక్షలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పూలమాలలు వేసి ప్రారంభించారు.
ప్రొద్దుటూరులో రిలే నిరాహార దీక్షల్లో కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులు కూర్చొన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి సంఘీభావం తెలియజేశారు. పులివెందులలో రిలే నిరాహార దీక్షలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ వైఎస్సార్ సీపీ నాయకులు వైఎస్ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేంపల్లె మండల ప్రజాప్రతినిధులతోపాటు పులివెందుల ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నేతలు దీక్షల్లో కూర్చొన్నారు. రైల్వేకోడూరులో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరమ్మ, ఇతర వైఎస్సార్ సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షల్లో కూర్చొన్నారు.
పోరుమామిళ్లలో 101 టెంకాయలు కొట్టిన నేతలు
బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం ఎంపీల ఆరోగ్యం బాగుండాలని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని ఎంపీపీ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి, కాశినాయన మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డిల ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోరుమామిళ్లలో యథావిధిగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
కడపలో ‘ఛాయ్ వాలా’లకు వినతిపత్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీకొట్టు నిర్వాహకులకు వినతిపత్రాలు ఇచ్చి వైఎస్సార్ సీపీ వినూత్న నిరసనకు దిగింది. ప్రధాని మోదీ ఛాయ్ విక్రయించారని.. ప్రస్తుతం కనీసం టీకొట్టు నిర్వహించే మీరైనా ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తే టీ వాలాలను చూసైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించారు. రాజంపేటలో పాత బస్టాండు సమీపంలో పోలి గ్రామస్తులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. అరుంధతివాడకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి చేరుకుని మోకాళ్లపై నిలుచొని నిరసన తెలియజేశారు.
రాయచోటిలో కువైట్ సంఘం సంఘీభావం
రాయచోటిలో గురువారం రామాపురం మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో కూర్చొన్నారు. అందుకు సంబంధించి వైఎస్సార్ సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్‌తోపాటు ఇతర నాయకులు సంఘీభావం తెలియజేశారు. వైఎస్సార్ మజ్దూర్ యూనియన్, పలు ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment