దేశం దృష్టిని ఆకర్షించిన ఘటనలు | YSRCP Dharna in Delhi | Sakshi
Sakshi News home page

దేశం దృష్టిని ఆకర్షించిన ఘటనలు

Published Mon, Feb 17 2014 9:26 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

YSRCP Dharna in Delhi

దేశరాజధానికి సమైక్య సెగతగిలింది.  సమైక్య నినాద హోరుతో ఢిల్లీ నగరం దద్దరిల్లింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సమైక్యవాదులు ఢిల్లీలో జంతర్‌మంతర్‌, రామ్‌లీలామైదానం, విజయ్‌చౌక్‌లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుజాతిని విచ్ఛిన్నం  చేసేందుకు  కేంద్రం  పన్నుతున్న కుయుక్తులను ఎండగడుతూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మరోసారి గట్టిగా సమైక్యవాదం వినిపించింది.  

 జాతీయ మీడియాతో పాటు అందరి దృష్టి జంతర్‌మంతర్‌పైనే పడింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే  రెండు సార్లు నిరాహార దీక్ష చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్‌ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో జంతర్‌మంతర్‌లో  భారీ ఎత్తున సమైక్య ధర్నా నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయంలోని రాజకీయ దురుద్దేశాలను, రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే అనూహ్యపరిణామాలను ధర్నాలో  వేలాది మంది పాల్గొన్న సమైక్యవాదులకు వివరించారు.

  రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న ఏకైక ప్రధాన పార్టీ వైఎస్ఆర్ సిపి. ఆ పార్టీ అధ్యక్షుడు  జగన్ నాయకత్వంలో జరిగిన  జంతర్ మంతర్ వద్ద ధర్నా - ఆ తరువాత పార్లమెంటు వరకు జరిపిన సమైక్య నడక - పార్లమెంటు స్ట్రీట్ వద్ద వారి ఆందోళన - జగన్ అరెస్ట్ - విడుదల .... సంఘటనలు  దేశం దృష్టిని ఆకర్షించాయి. ఈ ఘటనలతో  కాంగ్రెస్‌ వెనక్కి తగ్గకపోయినా, లోక్‌సభలో బిల్లుకు వ్యతిరేకంగా వ్యక్తమవుతుందని భావిస్తున్నారు.

ధర్నానుద్దేశించి జగన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అధికారం ఉందని  అన్యాయం చేసుకుంటూ పోతున్నారు - స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూలేని విధంగా ఆర్టికల్‌ త్రీ దుర్వినియోగం అవుతోంది- అసెంబ్లీ తీర్మానం లేకుండా ఏ రాష్ట్రమూ ఏర్పడలేదు -  కమిషన్ సిఫార్సు చేయకుండా ఏ ఒక్క రాష్ట్రమూ ఏర్పడలేదు - జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే అన్నిటికంటే ఉత్తమ మైనదని పేర్కొంది - విభజన వద్దని అసెంబ్లీలో తీర్మానం చేశాం - పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటులో ఖూనీ చేశారు - బిల్లును అప్రజాస్వామిక రీతిలో ప్రవేశపెట్టారు - పదంటే పది సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టామని చెప్పారు - రాష్ట్రం విడిపోతే తెలంగాణాయే కాదు, సీమాంధ్ర ప్రాంతం కూడా నష్టపోతుంది- ఇండియన్‌ నేషనల్ కాంగ్రెస్‌ ఇటాలియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌గా మారిపోయింది - కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి...అని ప్రసంగించారు.  ఆ తరువాత జగన్  పిలుపుతో సమైక్యవాదులు ఢిల్లీ వీధులలో  కదం  తొక్కారు. పార్లమెంటు వరకు కాలినడక వెళ్లారు. కేంద్రానికి, సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ వీధులలో సమైక్య సమరం చేశారు.

మరోవైపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనా కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఎన్‌జీవోలు దీనికి హాజరయ్యారు.  అధికారం, పదవుల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతోను, రాష్ట్రప్రజల భవిష్యత్తుతో సోనియాగాంధీ ఆటలాడుతున్నారని ఆరోపించారు.   పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఎందుకు కనబడలేదని  ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నిలదీశారు.    కేంద్రం తీరుపై తమ నిరసన కొనసాగుతుందని లగడపాటి రాజగోపాల్‌  చెప్పారు.

ఇంకోవైపు పార్లమెంటు సమీపంలో ఉన్న విజయ్‌చౌక్‌ దగ్గర లోక్‌సభ నుంచి బహిష్కారానికి గురైన సీమాంధ్ర ఎంపీలు విభప బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. తమను సభ నుంచి సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని, నిరంకుశధోరణికి నిదర్శనమని మండిపడ్డారు.  ఈ రకంగా అందరూ కలిసి తెలుగువారి సత్తాను ఢిల్లీకి చూపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement