
దేశంలోని 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 9 మంది ఓబీసీ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారంటూ యూజీసీ ఒక ఆర్టీఐకి ఇచ్చిన సమాధానం ఓబీసీ మేధావులలో చర్చకు దారితీసింది. ఇదే పరిస్థితి అసోసియేట్ ప్రొఫెసర్స్, అసి స్టెంట్ ప్రొఫెసర్స్‌లో చూడవచ్చు. మండల్ కమిషన్ ప్రవేశపెట్టి 30 ఏళ్ళు అవుతున్నా ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో, ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఎంఎంలు, ఎన్‌ఐటీలలో తీరని అన్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. 1978 డిసెంబర్ 20న నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ రెండవ జాతీయ వెనుకబడిన కమిటీని బీపీ మండల్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఆయన సెప్టెంబర్ 7, 1980లో భారత ప్రభుత్వానికి నివేదికను సమర్పిం చారు. ‘సమానంగా ఉన్నవాళ్ళలో మాత్రమే సమానత్వం ఉంటుంది. అసమానతలను సమానంగా చేయాలంటే, అసమానత మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది’ అని నివేదిక తొలి పేజీలోనే రాశారు.
మండల్ కమిషన్ ఆధారంగా 1993లో కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేసినప్పటికి అవి ఉన్నత విద్యా సంస్థలలో 2007 నుండి సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్‌ట్యూషన్స్ 2006 చట్టం ద్వారా అమలులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకుంటున్న అన్ని విద్యా సంస్థల బోధన సిబ్బంది, విద్యార్థుల అడ్మిషన్ సీట్లలో 27% రిజర్వేషన్లను అమలులోకి తెచ్చారు. దేశంలో 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 2,498 ప్రొఫెసర్లు, 5,011 అసోసియేట్ ప్రొఫెసర్లు, 10,830 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా ఓబీసీలకు 313 ప్రొఫెసర్లు, 735 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2,232 అసిస్టెంట్ ప్రొఫెసర్లను మాత్రమే కేటాయించారు. కానీ రిజర్వేషన్ కోటా కింద 674 ప్రొఫెసర్లు, 1,352 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2,924 అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఓబీసీలకు కేటాయించాలి.
కేటాయించిన ఓబీసీ పోస్టులలో కేవలం 9 మంది ప్రొఫెసర్లు, 38 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 1,327 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను మాత్రమే భర్తీ చేశారు.. అంటే 97.12% ప్రొఫెసర్లు, 94.82% అసోసియేట్ ప్రొఫెసర్లు 40.54% అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ కాలేదు. ఓబీసీలకు 27% కేటాయింపులో తొలి అన్యాయం జరిగితే, కేటాయించిన పోస్టులను కూడా భర్తీ చేయకపోవడం రెండవ అన్యాయం. ఐఐటీల్లో మొత్తం 8,856 మంది బోధన సిబ్బంది ఉంటే, కేవలం 329 మంది ఓబీసీలు మాత్రమే ఉన్నారు. 18 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ల్లో 724 మంది బోధన సిబ్బంది ఉంటే, కేవలం 27మంది ఓబీసీ సిబ్బంది మాత్రమే ఉన్నారు.
కేంద్ర ఉన్నత విద్యా సంస్థలలో ఓబీసీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీటికి అనేక కారణాలు. మొదటిది విద్య కొన్ని కులాల అధీనంలోనే ఉండాలనే మనువాద ధర్మాన్ని అగ్రకులాల వారు 2020లో కూడా ఇంకా కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది. రెండవ విమర్శ ఏంటంటే, ఓబీసీలకు అర్హత కండిషన్స్ లేవంటూ వారిని ఉన్నత స్థానాలకు వెళ్ళకుండా చూస్తున్నారు. కానీ జనరల్ క్యాటగిరీలో అగ్రకులాల వారికి అర్హతలు లేకపోయినా ఉద్యోగ అవకాశాలను కలుగజేస్తున్న ధోరణులను మనం చూడవచ్చు. కానీ 52% ఉన్న ఓబీసీల విషయంలో తగిన అభ్యర్థులు లేరు అని, పోస్టులను మూడు సార్లు వేసి, నాలుగవసారి జనరల్‌గా మార్చుతున్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చదువుకోవడానికి వస్తున్నా ఓబీసీ విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులలాగా సంఘటితం కాకపోవడం, కులాలవారీగా విడిపోయి వీళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపడంలో విఫలం అయ్యారనే చెప్పవచ్చు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓబీసీల సమస్యలపై దృష్టి పెట్టాలి. 52% ఉన్న ఓబీసీలకు ఉన్నత విద్య సంస్థలలో తీరని అన్యాయం జరుగుతుంది. మొత్తం మంజూరయిన 27% ఓబీసీల ఉద్యోగాలను అమలు చేయాలి. సెంట్రల్ వర్సిటీలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంది. కానట్లయితే రాజ్యాంగాన్ని, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్‌ట్యూషన్ యాక్ట్ 2006ను ఉల్లంఘించినట్లే అవుతుంది. నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అనే పద్ధతి ద్వారా అన్యాయం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌సీ తరహా జాతీయ రిక్రూట్‌మెంట్ సంస్థతో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించడం ద్వారా అక్రమాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
జి. కిరణ్‌కుమార్,
వ్యాసకర్త అధ్యక్షుడు, అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం, పరిశోధక విద్యార్థి, రాజనీతి శాస్త్రవిభాగం, హైదరాబాద్ వర్సిటీ
మొబైల్ : 80745 11654
Comments
Please login to add a commentAdd a comment