OBC Bill Passed in Lok Sabha | Restores States Power - Sakshi
Sakshi News home page

ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. అసలు ఎందుకీ బిల్లు..? 

Published Wed, Aug 11 2021 3:27 AM | Last Updated on Wed, Aug 11 2021 12:58 PM

Lok Sabha Passes Bill To Give States Power Make Their Own OBC Lists - Sakshi

సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేత అధిర్‌

న్యూఢిల్లీ: జనాభాలో ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే కీలక బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. హాజరైన మొత్తం 385 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు పలికారు. జూలై 19న వర్షాకాల సమావేశాల ఆరంభం తర్వాత లోక్‌సభలో ఒక బిల్లుపై సాఫీగా చర్చ జరిగి ఆమోదం పొందడం ఇదే తొలిసారి. బిల్లుకు కొన్ని సవరణలను విపక్షాలు సూచించినా వాటికి ఆమోదం లభించలేదు. ఇది రాజ్యాంగసవరణ బిల్లు కావడంతో పార్లమెంట్‌ రెండు సభల్లో ప్రత్యేక మెజార్టీతో (హాజరైన వారిలో మూడింట రెండొంతల మంది ఆమోదం) ఆమోదం పొందాల్సి ఉంటుంది.

పెగసస్, రైతు చట్టాలపై నిరసనతో సభను అడ్డుకుంటున్న విపక్షాలు, ఈ బిల్లును మాత్రం అడ్డుకోమని గతంలోనే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021ను సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు పూర్తి న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కులాధారిత జనగణన జరగాలని చర్చ సందర్భంగా జేడీయూ, బీఎస్‌పీ, ఎస్‌పీ, డీఎంకే డిమాండ్‌ చేశాయి. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి వద్దని కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది.  

50 శాతం సీలింగ్‌ వద్దు 
ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు మద్దతు ఇస్తున్నామన్న ప్రతిపక్షాలు, బిల్లులో పేర్కొన్న రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. బిల్లుకు మద్దతిస్తామని, అయితే రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించాలని, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న పరిమితిని తీసివేయాలని అధిర్‌ రంజన్‌ చర్చ సందర్భంగా కోరారు. సుప్రీంకోర్టు మండల్‌ తీర్పు ద్వారా 30 ఏళ్ల క్రితం విధించిన ఈ పరిమితి సడలించాలని ఎస్‌పీ, డీఎంకే సైతం డిమాండ్‌ చేశాయి. ఈ విషయంపై సంపూర్ణ అధ్యయనం జరగాల్సి ఉందని మంత్రి వీరేంద్ర కుమార్‌ జవాబిచ్చారు. విపక్షాల ఆందోళనను ప్రభుత్వం అర్ధం చేసుకుందన్నారు. కానీ కోర్టులు ఈ విషయంలో స్థిరంగా వ్యవహరిస్తున్నాయని గుర్తుచేశారు. అందువల్ల దీనికి సంబంధించిన న్యాయ, చట్టపరమైన అంశాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చన్న ఇందిరా సాహ్నీ కేసులో కోర్టు తీర్పును గుర్తు చేశారు.

తమ ప్రభుత్వం పేద, దళిత, ఓబీసీల ప్రయోజనాలకు అన్ని చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖా మంత్రి భూపేందర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓబీసీలపై ప్రేమే ఉంటే నలభై ఏళ్లుగా కాంగ్రెస్‌ ఏమి చేసిందని ఎద్దేవా చేశారు. యూపీఏ హయంలో బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్దత కూడా కల్పించలేదని, మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ పని జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుత బిల్లు ఉద్దేశం రాష్ట్రాలు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే వీలు కల్పించడమేనని చెప్పారు.  ‘ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఘనత మహారాష్ట్ర ప్రభుత్వానిది. ఓబీసీ రిజర్వేషన్లపై మా ప్రభుత్వ యత్నాల వల్లనే ఈ బిల్లుకు రూపం వచ్చింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగించకుండా ఈ బిల్లుకు పరిపూర్ణత రాదు’’ అని ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. 

ఎందుకీ బిల్లు 
జాతీయ బీసీ కమిషన్‌ విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338బీ, 342ఏ, 366 (26సి) అధికరణలను చేర్చింది.  మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 5న కీలకమైన తీర్పు చెప్పింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్‌ఈబీసీ) జాబితాలో కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని 342ఏ చెబుతోందని, 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే అవకాశం పోయింది. ఈ తీర్పును సమీక్షించాలన్న కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది.

ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చింది. దీన్ని 671 కులాలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక చట్టంగా మంత్రి వీరేంద్ర కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ పరిధిలోని ఓబీసీ కులాలను గుర్తించే హక్కును పునరుద్ధరించటం ద్వారా ఎన్నో కులాలకు సామాజిక, ఆర్థిక న్యాయం కలిగించవచ్చన్నారు. ఇందుకోసం అధికరణ 342ఏతో పాటు 338బీ, 366ను కూడా సవరించాల్సి ఉందని వీరేంద్రకుమార్‌ తెలిపారు. ఈ బిల్లుపై చర్చ ప్రారంభించిన కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఓబీసీ బిల్లుకు మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నట్టు చెప్పారు. 2018లో చేసిన 102 రాజ్యాంగ చట్ట సవరణను ఆయన తప్పుబట్టారు.  నాడు ప్రతిపక్షాలు చేసిన సూచన చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.  

రాజ్యసభలో రభస 
పలురోజులుగా చర్చలు లేకుండా వాయిదా పడుతున్న రాజ్యసభలో మంగళవారం సైతం అదే ధోరణి కనిపించింది. ఎన్నడూ లేని విధంగా కొందరు విపక్ష సభ్యులు అధికారుల టేబుల్స్‌పైకి ఎక్కి నల్ల జండాలు ఊపుతూ, ఫైళ్లు విసిరేస్తూ రభస సృష్టించారు. చాలామంది వెల్‌లో వలయాకారంగా నిలబడి నినాదాలు చేశారు. పలుమార్లు సభ్యుల ఆందోళనలతో వాయిదాలు పడుతూ వచ్చిన సభ చివరకు బుధవారానికి వాయిదా పడింది. నిరసనల మధ్యనే బీజేపీ సభ్యులు రైతుల సమస్యలను ప్రస్తావించారు. ఇదే సమయంలో ఆప్‌కు చెందిన సంజయ్‌ సెక్రటరీ జనరల్‌ బల్లపైకి ఎక్కి నినాదాలిచ్చారు. తర్వాత ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులూ బల్ల ఎక్కి నినదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement