Constitution Amendment Bill
-
Womens Reservation Bill 2023: ఓబీసీలపై కాంగ్రెస్ సవతి ప్రేమ
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఓబీసీ కోటా కూడా కలి్పంచాలన్న కాంగ్రెస్ పార్టిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దుమ్మెత్తిపోశారు. వారిపై కాంగ్రెస్ ప్రేమ మాటలకే పరిమితమన్నారు. అధికారంలో ఉండగా ఓబీసీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేకపోగా కనీసం వారి గురించి ఆలోచించను కూడా లేదని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ రూపంలో దేశానికి తొలి ఓబీసీ పీఎంను ఇచ్చింది బీజేపీయేనని గుర్తు చేశారు. మహిళా బిల్లుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని అన్ని పార్టిల ఎంపీలను కోరారు. బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించడం తెలిసిందే. రాహుల్ ది ట్యూటర్ తెలివిడి 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి పాలనలో కేంద్రంలో ఎందరు ఓబీసీ కార్యదర్శులున్నారో చెప్పాలని నడ్డా ప్రశ్నించారు. సరీ్వసుల్లో ఉన్న అధికారులకు సంబంధించి ఓబీసీ రిజర్వేషన్లను కేవలం 1992లో సుప్రీంకోర్టు సూచన అనంతరం మాత్రమే అమలు చేశారని గుర్తు చేశారు. 90 మంది కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల్లో ఓబీసీలు కేవలం ముగ్గురే ఉన్నారన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘ట్యూటర్లను పెట్టుకుంటే చాలదు. నాయకుడు కావాలంటే చిత్తశుద్ధితో అందుకోసం ప్రయతి్నంచాలి‘ అంటూ ఎద్దేవా చేశారు. ‘303 మంది బీజేపీ లోక్ సభ సభ్యుల్లో 85 మంది ఓబీసీలే. ఇది కాంగ్రెస్ మొత్తం సభ్యుల కంటే కూడా చాలా ఎక్కువ! దేశవ్యాప్తంగా మా పార్టికి ఉన్న ఎమ్మెల్యేల్లో 27 శాతం, ఎమ్మెల్సీల్లో ఏకంగా 40 శాతం ఓబీసీలే. మహిళా సాధికారత కోసం మోదీ సర్కారు ఎన్నో చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ మాత్రం కేవలం మైనారిటీల సంతుష్టికరణ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రిపుల్ తలాక్ వంటి అంశాలను లేవనెత్తుతూ ఉంటుంది‘ అని నడ్డా అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాదు మహిళా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్‌ను నడ్డా తోసిపుచ్చారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడచుకుంటుందన్నారు. మహిళా బిల్లు ద్వారా లబ్ధి పొందడం బీజేపీ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లు విషయంలో ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్నదే సరైన, అత్యంత దగ్గర విధానమని చెప్పారు. అంతకుముందు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దానికి సభ ఆమోదం లాంఛనమేమని భావి స్తున్నారు. అనంతరం మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జన గణన గణాంకాల ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. వాగ్వాదం రాజ్యసభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, జేపీ నడ్డా మధ్య వా గ్వాదం వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. బిల్లు అమలు కాలావధిపై విపక్షాల విమర్శలను నడ్డా విమర్శించడం ఇందుకు దారితీసింది. ఖర్గే జోక్యం చేసుకుంటూ, బీజేపీకి దమ్ముంటే రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని సవాలు చేశారు. -
మహిళా బిల్లుకు ఆమోదం.. పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. నారీ శక్తికి పార్లమెంటు సగౌరవంగా ప్రణమిల్లింది. నూతన భవనంలో తొట్టతొలిగా మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి సరికొత్త చరిత్ర లిఖించింది. ఈ చరిత్రాత్మక ఘట్టానికి రాజ్యసభ వేదికైంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన నారీ శక్తి విధాన్ అధినియమ్ బిల్లుకు గురువారం పెద్దల సభ సైతం జై కొట్టింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన మొత్తం 214 మంది సభ్యులూ పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చారు. దాంతో అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మహిళా బిల్లు బుధవారమే లోక్‌సభలో మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో పాస్ అవడం తెలిసిందే. 454 మంది ఎంపీలు మద్దతివ్వగా ఇద్దరు మజ్లిస్ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ రిజర్వేషన్లు 15 ఏళ్లపాటు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. అనంతరం వాటి కొనసాగింపుపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది పార్టీలకతీతంగా మద్దతు అంతకుముందు బిల్లుపై జరిగిన చర్చలో రాజ్యసభ సభ్యులంతా ముక్త కంఠంతో మద్దతు పలికారు. కొందరు విపక్షాల సభ్యులు మాత్రం దీన్ని బీజేపీ ఎన్నికల గిమ్మిక్కుగా అభివరి్ణంచారు. తాజా జన గణన, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎదురు చూడకుండా బిల్లు అమలు ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లును తక్షణం అమలు చేయాలని కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) డిమాండ్ చేశారు. ఈ బిల్లు అంశాన్ని తొమ్మిదేళ్లుగా పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ఓబీసీ మహిళలకూ దీన్ని వర్తింపజేయాలన్నారు. 2014, 2019ల్లో కూడా మహిళా బిల్లు తెస్తామని బీజేపీ వాగ్దానం చేసి మోసగించిందని ఎలమారం కరీం (సీపీఎం) ఆరోపించారు. మహిళలంటే మోదీ సర్కారుకు ఏ మాత్రమూ గౌరవం లేదన్నారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ నిర్లిప్తతే ఇందుకు రుజువన్నారు. ఎన్నికల వేళ బిల్లు తేవడంలో ఆంతర్యం ఏమిటని రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ) ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా తక్షణం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కె.కేశవరావు (బీఆర్ఎస్), వైగో (ఎండీఎంకే) డిమాండ్ చేశారు. తక్షణం డీ లిమిటేషన్ కమిషన్ వేయాలని వారన్నారు. మహిళా బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను రాజ్యసభకు, రాష్ట్రాల శాసన మండళ్లకు కూడా వర్తింపజేయాలని కోరారు. కర్ణాటక సీఎంగా, ప్రధానిగా మహిళా రిజర్వేషన్ల కోసం తాను తీసుకున్న చర్యలను జేడీ (ఎస్) సభ్యుడు దేవెగౌడ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే మహిళా బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. తర్వాత మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూతన జన గణన, నియోజకవర్గాల పునరి్వభజన అనంతరం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఇది 2029 కల్లా జరిగే అవకాశముందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారమే పరోక్షంగా తెలిపారు. ఏమిటీ బిల్లు? ► ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి విధాన్ అధినియమ్‌గా పేర్కొంటున్నారు. ► దీని కింద లోక్‌సభ, ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు, అంటే 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. ► ప్రధానంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. చరిత్రాత్మక క్షణాలివి! ప్రధాని మోదీ భావోద్వేగం మహిళా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన క్షణాలను చరిత్రాత్మకమైనవిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బిల్లు పెద్దల సభ ఆమోదం పొందిన సమయంలో ఆయన సభలోనే ఉన్నారు. ‘భారత మహిళలకు మరింత ప్రాతినిధ్యం, సాధికారత లభించే నూతన శకంలోకి మనమిక సగర్వంగా అడుగు పెట్టనున్నాం. ఇది కేవలం చట్టం మాత్రమే కాదు. మన దేశాన్ని నిరంతరం ఇంత గొప్ప స్థాయిలో తీర్చిదిద్దుతున్న, అందుకోసం తమ సర్వస్వాన్నీ నిరంతరం త్యాగం చేస్తూ వస్తున్నా సంఖ్యాకులైన మహిళామణులకు, మన మాతృమూర్తులకు మనం చేస్తున్న వందనమిది. వారి సహనశీలత, త్యాగాలు అనాదిగా మన గొప్ప దేశాన్ని మరింత సమున్నతంగా తీర్చిదిద్దుతూ వస్తున్నాయి‘ అంటూ మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఉభయ సభల్లోనూ బిల్లుపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. అవన్నీ పూర్తిగా విజయవంతమయ్యాయి. ఈ చర్చలు భవిష్యత్తులోనూ మనందరికీ ఎంతగానో ఉపకరిస్తాయి. బిల్లుకు మద్దతి చి్చన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ స్ఫూర్తి భారతీయుల ఆత్మ గౌరవాన్ని సరికొత్త ఎత్తులకు చేరుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ, మండళ్లలో అసాధ్యం: నిర్మల చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకోవడం ద్వారా పార్లమెంటు నూతన భవనానికి శుభారంభం అందించే నిమిత్తమే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. బిల్లుపై చర్చలో ఆమె మాట్లా డుతూ రాజ్యసభ, శాసన మండళ్లకు జరిగేవి పరోక్ష ఎన్నికలు గనుక మహిళలకు రిజర్వేషన్లు ఆచరణసాధ్యం కాదన్నారు. పార్లమెంటు నిరవధిక వాయిదా చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి 18న మొదలైన ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు షెడ్యూల్ ప్రకారం 22వ తేదీ దాకా జరగాల్సి ఉంది. రాజ్యసభకు ఇది 261 సెషన్. కాగా, 17వ లోక్‌సభకు బహుశా ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. -
ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. అసలు ఎందుకీ బిల్లు..?
న్యూఢిల్లీ: జనాభాలో ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే కీలక బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. హాజరైన మొత్తం 385 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు పలికారు. జూలై 19న వర్షాకాల సమావేశాల ఆరంభం తర్వాత లోక్‌సభలో ఒక బిల్లుపై సాఫీగా చర్చ జరిగి ఆమోదం పొందడం ఇదే తొలిసారి. బిల్లుకు కొన్ని సవరణలను విపక్షాలు సూచించినా వాటికి ఆమోదం లభించలేదు. ఇది రాజ్యాంగసవరణ బిల్లు కావడంతో పార్లమెంట్ రెండు సభల్లో ప్రత్యేక మెజార్టీతో (హాజరైన వారిలో మూడింట రెండొంతల మంది ఆమోదం) ఆమోదం పొందాల్సి ఉంటుంది. పెగసస్, రైతు చట్టాలపై నిరసనతో సభను అడ్డుకుంటున్న విపక్షాలు, ఈ బిల్లును మాత్రం అడ్డుకోమని గతంలోనే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021ను సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు పూర్తి న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కులాధారిత జనగణన జరగాలని చర్చ సందర్భంగా జేడీయూ, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే డిమాండ్ చేశాయి. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి వద్దని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. 50 శాతం సీలింగ్ వద్దు ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు మద్దతు ఇస్తున్నామన్న ప్రతిపక్షాలు, బిల్లులో పేర్కొన్న రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. బిల్లుకు మద్దతిస్తామని, అయితే రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించాలని, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న పరిమితిని తీసివేయాలని అధిర్ రంజన్ చర్చ సందర్భంగా కోరారు. సుప్రీంకోర్టు మండల్ తీర్పు ద్వారా 30 ఏళ్ల క్రితం విధించిన ఈ పరిమితి సడలించాలని ఎస్పీ, డీఎంకే సైతం డిమాండ్ చేశాయి. ఈ విషయంపై సంపూర్ణ అధ్యయనం జరగాల్సి ఉందని మంత్రి వీరేంద్ర కుమార్ జవాబిచ్చారు. విపక్షాల ఆందోళనను ప్రభుత్వం అర్ధం చేసుకుందన్నారు. కానీ కోర్టులు ఈ విషయంలో స్థిరంగా వ్యవహరిస్తున్నాయని గుర్తుచేశారు. అందువల్ల దీనికి సంబంధించిన న్యాయ, చట్టపరమైన అంశాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చన్న ఇందిరా సాహ్నీ కేసులో కోర్టు తీర్పును గుర్తు చేశారు. తమ ప్రభుత్వం పేద, దళిత, ఓబీసీల ప్రయోజనాలకు అన్ని చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖా మంత్రి భూపేందర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓబీసీలపై ప్రేమే ఉంటే నలభై ఏళ్లుగా కాంగ్రెస్ ఏమి చేసిందని ఎద్దేవా చేశారు. యూపీఏ హయంలో బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్దత కూడా కల్పించలేదని, మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ పని జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుత బిల్లు ఉద్దేశం రాష్ట్రాలు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే వీలు కల్పించడమేనని చెప్పారు. ‘ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఘనత మహారాష్ట్ర ప్రభుత్వానిది. ఓబీసీ రిజర్వేషన్లపై మా ప్రభుత్వ యత్నాల వల్లనే ఈ బిల్లుకు రూపం వచ్చింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగించకుండా ఈ బిల్లుకు పరిపూర్ణత రాదు’’ అని ఎన్సీపీ నేత సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. ఎందుకీ బిల్లు జాతీయ బీసీ కమిషన్ విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338బీ, 342ఏ, 366 (26సి) అధికరణలను చేర్చింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 5న కీలకమైన తీర్పు చెప్పింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని 342ఏ చెబుతోందని, 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే అవకాశం పోయింది. ఈ తీర్పును సమీక్షించాలన్న కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది. ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చింది. దీన్ని 671 కులాలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక చట్టంగా మంత్రి వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రాలు తమ పరిధిలోని ఓబీసీ కులాలను గుర్తించే హక్కును పునరుద్ధరించటం ద్వారా ఎన్నో కులాలకు సామాజిక, ఆర్థిక న్యాయం కలిగించవచ్చన్నారు. ఇందుకోసం అధికరణ 342ఏతో పాటు 338బీ, 366ను కూడా సవరించాల్సి ఉందని వీరేంద్రకుమార్ తెలిపారు. ఈ బిల్లుపై చర్చ ప్రారంభించిన కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఓబీసీ బిల్లుకు మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నట్టు చెప్పారు. 2018లో చేసిన 102 రాజ్యాంగ చట్ట సవరణను ఆయన తప్పుబట్టారు. నాడు ప్రతిపక్షాలు చేసిన సూచన చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజ్యసభలో రభస పలురోజులుగా చర్చలు లేకుండా వాయిదా పడుతున్న రాజ్యసభలో మంగళవారం సైతం అదే ధోరణి కనిపించింది. ఎన్నడూ లేని విధంగా కొందరు విపక్ష సభ్యులు అధికారుల టేబుల్స్‌పైకి ఎక్కి నల్ల జండాలు ఊపుతూ, ఫైళ్లు విసిరేస్తూ రభస సృష్టించారు. చాలామంది వెల్‌లో వలయాకారంగా నిలబడి నినాదాలు చేశారు. పలుమార్లు సభ్యుల ఆందోళనలతో వాయిదాలు పడుతూ వచ్చిన సభ చివరకు బుధవారానికి వాయిదా పడింది. నిరసనల మధ్యనే బీజేపీ సభ్యులు రైతుల సమస్యలను ప్రస్తావించారు. ఇదే సమయంలో ఆప్‌కు చెందిన సంజయ్ సెక్రటరీ జనరల్ బల్లపైకి ఎక్కి నినాదాలిచ్చారు. తర్వాత ఇద్దరు కాంగ్రెస్ సభ్యులూ బల్ల ఎక్కి నినదించారు. -
‘నేపాల్ వివాదాస్పద మ్యాప్‌కు రాజ్యాంగ సవరణ’
న్యూఢిల్లీ: భారత్, నేపాల్ సరిహద్దు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. నేపాల్ పార్లమెంట్లో సవరించిన జాతీయ మ్యాప్‌కు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. కాగా పార్లమెంట్లో జాతీయ మ్యాప్‌కు రాజ్యాంగ సవరణ చేసే అంశంపై ఆ దేశ పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటగా ప్రతినిధుల సభలో రాజ్యాంగ సవరణకు సంబంధించిన చర్చ జరుగుతుందని.. చర్చ పూర్తయిన వెంటనే ఓటింగ్ నిర్వహిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాము ఓటింగ్‌లో రాజ్యంగ సవరణకు మద్దతిస్తామని ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్ పేర్కొంది. 1816 సుగాలీ ఒప్పందం ప్రకారం లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు నేపాల్ భూభాగంలో ఉంటాయని నేపాల్ ప్రభుత్వం వాదిస్తోంది. అందులో భాగంగనే సవరించిన ప్రాంతాలను కొత్త మ్యాప్‌లో పొందుపరిచామని తెలిపింది . ఇదే మ్యాప్ జాతీయ చిహ్నంలో కూడా ఉంటుంది. అయితే ఈ ప్రాంతాలకు సంబంధించి నేపాల్ వాదనలను భారత్ తిరస్కరిస్తోంది. దేశానికి చెందిన ఉత్తరాఖండ్ ప్రాంతాలను నేపాల్ కొత్త మ్యాప్‌లో పొందుపరిచారని భారత్ విమర్శిస్తోంది. కాగా 1962 సంవత్సరంలో చైనాతో భారత్ యుద్దం జరిగిన సమయం నుంచే లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను కీలకంగా భారత్ భావిస్తోంది. మరోవైపు నేపాల్‌తో భారత్‌కు మంచి సంబంధాలున్నాయని.. భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక, మతపరమైన అంశాలు ఒకే విధంగా ఉంటాయని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవాణే పేర్కొన్నారు. కాగా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే.. 275 మంది సభ్యుల కలిగిన దిగువ సభలో మూడింట రెండొంతుల మెజారిటీ రావాలని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. బిల్లు దిగువ సభ ఆమోదం పొందిన వెంటనే జాతీయ అసెంబ్లీకి చెరుకుంటుంది. అక్కడ కూడా దిగువ సభ అవలంభించే ప్రక్రియనే అమలు చేస్తారని పేర్కొంది.(చదవండి: చైనా వివాదాస్పద చట్టానికి నేపాల్ మద్దతు!) -
గట్టెక్కిన జీఎస్టీ
సరుకులు, సేవల(జీఎస్టీ) పన్నుకు సంబంధించి ప్రవేశపెట్టిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ కూడా ఆమోదించడంతో దాదాపు పన్నెండేళ్లుగా సాగుతున్న ప్రయత్నంలో ఒక దశ పూర్తయింది. నాలుగురోజుల కిందట రాజ్యసభ కొన్ని సవరణలతో బిల్లుకు పచ్చజెండా ఊపింది. ఇప్పుడిక సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ జీఎస్టీకి అనుగుణంగా-కేంద్ర స్థాయి జీఎస్టీ, అంతర్రాష్ట్ర జీఎస్టీ, రాష్ట్రాల జీఎస్టీ అనే మూడు చట్టాలు రూపొందించుకోవాలి. ఇవన్నీ పూర్తి చేసుకుని వచ్చే ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. కేవలం మౌలిక బిల్లు విషయంలోనే పుష్కరకాలం పట్టిన నేపథ్యంలో ఏడు నెలల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకోవడం ఎంత వరకూ సాధ్యమో చూడాలి. ఒక ఆలోచన రావడానికీ, అది బిల్లుగా ఆమోదం పొందడానికీ మధ్య ఇంత సుదీర్ఘ కాలం పట్టింది గనుక దానిపై ఎంతో మేధోమథనం జరిగిందనుకోవ డానికి లేదు. ఇందులో పంతాలూ, పట్టింపుల వంతే ఎక్కువ. దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత దానికి కొనసాగింపుగా... మళ్లీ ఆ స్థాయికి సమానమైనదిగా, అతి పెద్ద పన్ను సంస్కరణల ప్రయత్నంగా భావించే జీఎస్టీని అమలు చేసిన ఘనత పాలకపక్షంలో ఉన్నవారికి దక్కకూడదన్నదే విపక్షంగా ఉన్నవారి ఆలోచన. గతంలో యూపీఏ ప్రభుత్వాన్ని బీజేపీ... ఇప్పుడు ఎన్డీఏ సర్కారును కాంగ్రెస్ తిప్పలు పెట్టడంలో ఇంతకు మించిన మహదాశయం ఏమీ లేదు. సారాంశంలో ఇదంతా జీఎస్టీ పేటెంట్ పోరు. ఐఎంఎఫ్ డెరైక్టర్ల బోర్డులో భారత్ ప్రతినిధిగా ప్రతినిధిగా పనిచేసి వచ్చి 2003లో అప్పటి ఎన్డీఏ సర్కారులో ఆర్ధికమంత్రి జశ్వంత్‌సింగ్ సలహాదారుగా చేరిన విజయ్ కేల్కర్ ఈ జీఎస్టీ ఆలోచనకు పురుడు పోశారని చెప్పాలి. ఆయన నేతృత్వంలో ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ వివిధ దేశాలు అమలు పరుస్తున్న పన్ను విధానాలనూ... సరుకులు, సేవలు రెండింటినీ జోడించు కుని అవి పన్నులు వేస్తున్న తీరునూ అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. సరుకులు, సేవలు రెండింటికీ ఒకే రకమైన పన్ను వసూలు చేసి ఆ ఆదాయంలో కేంద్రం, రాష్ట్రాలూ భాగం పంచుకోవచ్చునని తేల్చింది. ఇందువల్ల పన్నులు విధించే స్వతంత్రత కోల్పోతామని, తమ రెవెన్యూ పడిపోతుందని రాష్ట్రాలు భావించకుండా వాటి లోటు పూడ్చాలని సూచించింది. 2005నాటి కేంద్ర బడ్జెట్లో ఈ కొత్త పన్ను విధానం ప్రతిపాదనను అప్పటి ఆర్ధికమంత్రి పి. చిదంబరం ప్రకటించారు. ఆ మరుసటి సంవత్సరం బడ్జెట్లో కూడా జీఎస్టీ అమలుకు 2010 ఏప్రిల్‌ను తుది గడువుగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాతే దానికి అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి. అవి మొన్న ఉభయ సభలూ దాన్ని ఆమోదించే వరకూ కొనసాగాయి. కేవలం పరోక్ష పన్నుల వ్యవస్థపైనే దృష్టంతా కేంద్రీకరించి, దాన్నుంచి మరింత పిండుకోవడం ఎలా అన్న ఆలోచనే జీఎస్టీకి మూలమని... నేరుగా సంపన్నులను ప్రభావితం చేసే ప్రత్యక్ష పన్నుల జోలికి మాత్రం ఎవరూ వెళ్లరన్నది ఈ కొత్త విధానాన్ని తప్పుబడుతున్నవారి ప్రధాన విమర్శ. అలాగే పన్నులకు సంబంధించి రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన హక్కులను తనకు దఖలుపరుచు కోవడం ద్వారా కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నదన్న ఆరోపణ మరొకటి. జీఎస్టీ పర్యవసానంగా కేంద్రం విధిస్తున్న ఏడెనిమిది రకాల పన్నులు రద్దు కావడంతోపాటు రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండే రకరకాల పన్నులు రద్దవుతాయి. దీనికి బదులు జీఎస్టీలో కేంద్రం ఇచ్చే వాటా మాత్రమే వస్తుంది. సర్వీస్ సెక్టార్ ప్రధానంగా ఉన్న రాష్ట్రాలకైతే దీనివల్ల పెద్దగా నష్టం చేకూరపోవచ్చుగానీ... తయారీ రంగంలో ముందంజలో ఉన్న తమిళనాడు వంటి రాష్ట్రాలకు సమస్యలు ఎదురవుతాయి. అందువల్లే ఆ రాష్ట్రం జీఎస్టీ బిల్లును గట్టిగా వ్యతిరేకించింది. ఇది అమలైతే తమకు ఏటా రూ. 9,270 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆ రాష్ట్రం చెబుతోంది. తొలి అయిదేళ్లూ ఆ లోటును పూడుస్తామని కేంద్రం ఇస్తున్న హామీని తోసిపుచ్చుతోంది. ఆ తర్వాత సంగతేమిటని అడుగు తోంది. రాష్ట్రాలకూ ఓటింగ్ హక్కు ఉండే జీఎస్టీ మండలి అంగీకరించాకే కొత్త పన్నులు, విధానాలు అమలవుతాయన్న వాదను కూడా అది అంగీకరించడం లేదు. మండలికి సంబంధించి 33 శాతం ఓటును కేంద్రం దఖలు పరచుకోవడమేకాక వీటో హక్కును సైతం రిజర్వ్ చేసుకున్నదని... ఇక రాష్ట్రాల మాట చెల్లుబాటయ్యేది ఏముంటుందని నిలదీస్తోంది. ఓటింగ్‌లో కేంద్రం నాలుగోవంతు భాగం మాత్రమే ఉంచుకుని, మిగిలిన భాగాన్ని రాజ్యసభలో ఆయా రాష్ట్రాలకుండే ప్రాతినిధ్యం ఆధారంగా వాటికి కేటాయించాలని ప్రతిపాదిస్తోంది. ఇవన్నీ వీగిపోయాయి. మనది ఫెడరల్ వ్యవస్థని చెప్పుకుంటున్నా... దేశంలో రాష్ట్రాలకు ఓటు హక్కు ఇచ్చి, వాటి అభిప్రాయాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ దేశంలో ఇంతవరకూ లేనేలేదు. ఇప్పుడు జీఎస్టీ మండలి ఆ కొరతను కాస్తయినా తీర్చగలుగుతుందా లేక అది నామమాత్రంగా మిగులుతుందా అన్నది ఆచరణలో తప్ప తేలదు. తమ సమస్యలపై రాష్ట్రాలు పార్టీ చట్రాలకు అతీతంగా ఆలోచించి ఏకతాటిపైకి రావడమన్నది ఇప్పటికైతే ఊహతీతమైనది. ప్రభుత్వాలు వేసే పన్నుల్ని భయభక్తులతో చెల్లించే సాధారణ పౌరుడికి మాత్రం ఎప్పటిలా ఒకటే సమస్య... ఈ పన్ను బాధలనుంచి కాస్తయినా ఉపశ మనం దొరుకుతుందా, లేదా అన్నదే. అది తీరకపోగా మరింత పెరుగుతుందని కొందరు నిపుణులు చెబుతున్న మాట. చిత్రమేమంటే పార్లమెంటు లోపలా, వెలుపలా రాష్ట్రాలు తమ ఆదాయం కోల్పోతామన్న భయాన్ని వ్యక్తం చేయడం, దాని ప్రాతిపదికన వ్యతిరేకించడం మినహా సాధారణ పౌరులకు వచ్చే లాభనష్టాల గురించీ, వారి ఇంటి బడ్జెట్‌ను అది ప్రభావితం చేసే తీరు గురించి ఎక్కడా చర్చ జరగలేదు. జీఎస్టీ కూడా ఇప్పుడున్న వ్యాట్ మాదిరి సామాన్యులకు గుదిబండ అవుతుందా... వారికి ఊరటనిస్తుందా అన్నది మున్ముందు చూడాలి. -
జీఎస్టీపై ముందడుగు
- రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీతో జైట్లీ భేటీ - రాజ్యాంగ సవరణ బిల్లులో మార్పులపై ఏకాభిప్రాయం న్యూఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లుపై ముందడుగు పడింది. మంగళవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ జరిపిన భేటీలో దీనిపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. పన్నురేట్లు ప్రస్తుతానికంటే తగ్గించాలన్న నిర్ణయంపై సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. రాష్ట్రాలు తొలి ఐదేళ్లలో ప్రత్యక్ష పన్నుల్లో నష్టపోతే పరిహారం అందించే విషయాన్ని రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చేందుకూ సమావేశంలో అంగీకారం కుదిరింది. ఈ బిల్లు ద్వారా సామాన్య పన్ను చెల్లింపు దారుడితోపాటు మామూలు వ్యాపారులు లాభం పొందుతారని(పన్ను రేట్ల తగ్గింపు), రాష్ట్రాలకు ఆదాయంలో నష్టం ఉండదని.. ఆర్థికమంత్రుల సాధికార కమిటీ చైర్మన్, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా తెలిపారు. రూ. కోటిన్నర టర్నోవర్ ఉన్న వ్యాపారాలు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, ంతకు మించిన వ్యాపారాలను కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా నియంత్రిస్తాయన్నారు. ప్రభుత్వం ఈ బిల్లును వచ్చేవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. కాగా, కాంగ్రెస్ కోరుతున్నట్లు 1 శాతం అదనపు పన్ను రద్దుకు జైట్లీ అంగీకరించారు. అయితే కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ జీఎస్టీపై కేంద్రం చెప్పిన దాన్ని ఏకాభిప్రాయంతో అంగీకరించినట్లు మిత్రా తెలిపారు. -
జీఎస్టీపై ఏకాభిప్రాయం తర్వాతే పార్లమెంటు ప్రత్యేక భేటీ!
న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై కాంగ్రెస్, లెఫ్ట్ సహా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే.. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించటం జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌లతో ప్రభుత్వ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారని.. అయితే తమ డిమాండ్ల ప్రకారం బిల్లులో మార్పులు చేసే వరకూ మద్దతు ఇవ్వబోమని రాహుల్ భీష్మించారని సమాచారం. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, సహాయమంత్రి ముక్తార్అబ్బాస్నక్వీలు అన్ని పార్టీల నాయకులతో చర్చిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 13వ తేదీన నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మళ్లీ నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకోనుందని చెప్తున్నారు. దీనిపై వెంకయ్య మంగళవారం కొంత స్పష్టతనిచ్చే అవకాశముంది. త్వరలోనే ఆమోదం పొందుతుంది: జైట్లీ జీఎస్టీ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దానిని అమలు చేసేందుకు రెవెన్యూ శాఖ కేంద్ర జీఎస్టీ, రాష్ట్రాల జీఎస్టీ, సమగ్ర జీఎస్టీ - మూడు బిల్లులతో సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం తర్వాత ఈ మూడిటినీ ఆమోదం కోసం ప్రవేశపెడతామన్నారు. అయితే.. రాజ్యసభలో స్తంభించివున్న జీఎస్టీ బిల్లుకు ఎలా ఆమోదం పొందుతారనేది చెప్పలేదు. సోమవారం ఢిల్లీలో జరిగిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ విభాగాల చీఫ్ కమిషనర్లు, డెరైక్టర్ జనరళ్ల సదస్సులో ఆర్థికమంత్రి మాట్లాడారు. జీఎస్టీ బిల్లు మహత్తరమైన పన్ను సంస్కరణ అని పేర్కొన్నారు.