న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై కాంగ్రెస్, లెఫ్ట్ సహా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే.. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించటం జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌లతో ప్రభుత్వ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారని.. అయితే తమ డిమాండ్ల ప్రకారం బిల్లులో మార్పులు చేసే వరకూ మద్దతు ఇవ్వబోమని రాహుల్ భీష్మించారని సమాచారం.
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, సహాయమంత్రి ముక్తార్‌అబ్బాస్‌నక్వీలు అన్ని పార్టీల నాయకులతో చర్చిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 13వ తేదీన నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మళ్లీ నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకోనుందని చెప్తున్నారు. దీనిపై వెంకయ్య మంగళవారం కొంత స్పష్టతనిచ్చే అవకాశముంది.
త్వరలోనే ఆమోదం పొందుతుంది: జైట్లీ
జీఎస్టీ బిల్లు త్వరలోనే ఆమోదం పొందుతుందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దానిని అమలు చేసేందుకు రెవెన్యూ శాఖ కేంద్ర జీఎస్టీ, రాష్ట్రాల జీఎస్టీ, సమగ్ర జీఎస్టీ - మూడు బిల్లులతో సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం తర్వాత ఈ మూడిటినీ ఆమోదం కోసం ప్రవేశపెడతామన్నారు. అయితే.. రాజ్యసభలో స్తంభించివున్న జీఎస్టీ బిల్లుకు ఎలా ఆమోదం పొందుతారనేది చెప్పలేదు. సోమవారం ఢిల్లీలో జరిగిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ విభాగాల చీఫ్ కమిషనర్లు, డెరైక్టర్ జనరళ్ల సదస్సులో ఆర్థికమంత్రి మాట్లాడారు. జీఎస్టీ బిల్లు మహత్తరమైన పన్ను సంస్కరణ అని పేర్కొన్నారు.
జీఎస్టీపై ఏకాభిప్రాయం తర్వాతే పార్లమెంటు ప్రత్యేక భేటీ!
Published Tue, Aug 25 2015 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM
Advertisement
Advertisement