గట్టెక్కిన జీఎస్‌టీ
సరుకులు, సేవల(జీఎస్‌టీ) పన్నుకు సంబంధించి ప్రవేశపెట్టిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ కూడా ఆమోదించడంతో దాదాపు పన్నెండేళ్లుగా సాగుతున్న ప్రయత్నంలో ఒక దశ పూర్తయింది. నాలుగురోజుల కిందట రాజ్యసభ కొన్ని సవరణలతో బిల్లుకు పచ్చజెండా ఊపింది. ఇప్పుడిక సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ జీఎస్‌టీకి అనుగుణంగా-కేంద్ర స్థాయి జీఎస్‌టీ, అంతర్రాష్ట్ర జీఎస్‌టీ, రాష్ట్రాల జీఎస్‌టీ అనే మూడు చట్టాలు రూపొందించుకోవాలి. ఇవన్నీ పూర్తి చేసుకుని వచ్చే ఏప్రిల్ 1 నుంచి జీఎస్‌టీని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. కేవలం మౌలిక బిల్లు విషయంలోనే పుష్కరకాలం పట్టిన నేపథ్యంలో ఏడు నెలల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకోవడం ఎంత వరకూ సాధ్యమో చూడాలి.
ఒక ఆలోచన రావడానికీ, అది బిల్లుగా ఆమోదం పొందడానికీ మధ్య ఇంత సుదీర్ఘ కాలం పట్టింది గనుక దానిపై ఎంతో మేధోమథనం జరిగిందనుకోవ డానికి లేదు. ఇందులో పంతాలూ, పట్టింపుల వంతే ఎక్కువ. దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత దానికి కొనసాగింపుగా... మళ్లీ ఆ స్థాయికి సమానమైనదిగా, అతి పెద్ద పన్ను సంస్కరణల ప్రయత్నంగా భావించే జీఎస్‌టీని అమలు చేసిన ఘనత పాలకపక్షంలో ఉన్నవారికి దక్కకూడదన్నదే విపక్షంగా ఉన్నవారి ఆలోచన. గతంలో యూపీఏ ప్రభుత్వాన్ని బీజేపీ... ఇప్పుడు ఎన్‌డీఏ సర్కారును కాంగ్రెస్ తిప్పలు పెట్టడంలో ఇంతకు మించిన మహదాశయం ఏమీ లేదు. సారాంశంలో ఇదంతా జీఎస్‌టీ పేటెంట్ పోరు.
ఐఎంఎఫ్ డెరైక్టర్ల బోర్డులో భారత్ ప్రతినిధిగా ప్రతినిధిగా పనిచేసి వచ్చి 2003లో అప్పటి ఎన్‌డీఏ సర్కారులో ఆర్ధికమంత్రి జశ్వంత్‌సింగ్ సలహాదారుగా చేరిన విజయ్ కేల్కర్ ఈ జీఎస్‌టీ ఆలోచనకు పురుడు పోశారని చెప్పాలి. ఆయన నేతృత్వంలో ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ వివిధ దేశాలు అమలు పరుస్తున్న పన్ను విధానాలనూ... సరుకులు, సేవలు రెండింటినీ జోడించు కుని అవి పన్నులు వేస్తున్న తీరునూ అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. సరుకులు, సేవలు రెండింటికీ ఒకే రకమైన పన్ను వసూలు చేసి ఆ ఆదాయంలో కేంద్రం, రాష్ట్రాలూ భాగం పంచుకోవచ్చునని తేల్చింది. ఇందువల్ల పన్నులు విధించే స్వతంత్రత కోల్పోతామని, తమ రెవెన్యూ పడిపోతుందని రాష్ట్రాలు భావించకుండా వాటి లోటు పూడ్చాలని సూచించింది. 2005నాటి కేంద్ర బడ్జెట్‌లో ఈ కొత్త పన్ను విధానం ప్రతిపాదనను అప్పటి ఆర్ధికమంత్రి పి. చిదంబరం ప్రకటించారు. ఆ మరుసటి సంవత్సరం బడ్జెట్‌లో కూడా జీఎస్‌టీ అమలుకు 2010 ఏప్రిల్‌ను తుది గడువుగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాతే దానికి అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి. అవి మొన్న ఉభయ సభలూ దాన్ని ఆమోదించే వరకూ కొనసాగాయి.
కేవలం పరోక్ష పన్నుల వ్యవస్థపైనే దృష్టంతా కేంద్రీకరించి, దాన్నుంచి మరింత పిండుకోవడం ఎలా అన్న ఆలోచనే జీఎస్‌టీకి మూలమని... నేరుగా సంపన్నులను ప్రభావితం చేసే ప్రత్యక్ష పన్నుల జోలికి మాత్రం ఎవరూ వెళ్లరన్నది ఈ కొత్త విధానాన్ని తప్పుబడుతున్నవారి ప్రధాన విమర్శ. అలాగే పన్నులకు సంబంధించి రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన హక్కులను తనకు దఖలుపరుచు కోవడం ద్వారా కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నదన్న ఆరోపణ మరొకటి. జీఎస్‌టీ పర్యవసానంగా కేంద్రం విధిస్తున్న ఏడెనిమిది రకాల పన్నులు రద్దు కావడంతోపాటు రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండే రకరకాల పన్నులు రద్దవుతాయి. దీనికి బదులు జీఎస్‌టీలో కేంద్రం ఇచ్చే వాటా మాత్రమే వస్తుంది.
సర్వీస్ సెక్టార్ ప్రధానంగా ఉన్న రాష్ట్రాలకైతే దీనివల్ల పెద్దగా నష్టం చేకూరపోవచ్చుగానీ... తయారీ రంగంలో ముందంజలో ఉన్న తమిళనాడు వంటి రాష్ట్రాలకు సమస్యలు ఎదురవుతాయి. అందువల్లే ఆ రాష్ట్రం జీఎస్‌టీ బిల్లును గట్టిగా వ్యతిరేకించింది. ఇది అమలైతే తమకు ఏటా రూ. 9,270 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆ రాష్ట్రం చెబుతోంది. తొలి అయిదేళ్లూ ఆ లోటును పూడుస్తామని కేంద్రం ఇస్తున్న హామీని తోసిపుచ్చుతోంది. ఆ తర్వాత సంగతేమిటని అడుగు తోంది. రాష్ట్రాలకూ ఓటింగ్ హక్కు ఉండే జీఎస్‌టీ మండలి అంగీకరించాకే కొత్త పన్నులు, విధానాలు అమలవుతాయన్న వాదను కూడా అది అంగీకరించడం లేదు. మండలికి సంబంధించి 33 శాతం ఓటును కేంద్రం దఖలు పరచుకోవడమేకాక వీటో హక్కును సైతం రిజర్వ్ చేసుకున్నదని... ఇక రాష్ట్రాల మాట చెల్లుబాటయ్యేది ఏముంటుందని నిలదీస్తోంది.
ఓటింగ్‌లో కేంద్రం నాలుగోవంతు భాగం మాత్రమే ఉంచుకుని, మిగిలిన భాగాన్ని రాజ్యసభలో ఆయా రాష్ట్రాలకుండే ప్రాతినిధ్యం ఆధారంగా వాటికి కేటాయించాలని ప్రతిపాదిస్తోంది. ఇవన్నీ వీగిపోయాయి. మనది ఫెడరల్ వ్యవస్థని చెప్పుకుంటున్నా... దేశంలో రాష్ట్రాలకు ఓటు హక్కు ఇచ్చి, వాటి అభిప్రాయాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ దేశంలో ఇంతవరకూ లేనేలేదు. ఇప్పుడు జీఎస్‌టీ మండలి ఆ కొరతను కాస్తయినా తీర్చగలుగుతుందా లేక అది నామమాత్రంగా మిగులుతుందా అన్నది ఆచరణలో తప్ప తేలదు. తమ సమస్యలపై రాష్ట్రాలు పార్టీ చట్రాలకు అతీతంగా ఆలోచించి ఏకతాటిపైకి రావడమన్నది ఇప్పటికైతే ఊహతీతమైనది.
ప్రభుత్వాలు వేసే పన్నుల్ని భయభక్తులతో చెల్లించే సాధారణ పౌరుడికి మాత్రం ఎప్పటిలా ఒకటే సమస్య... ఈ పన్ను బాధలనుంచి కాస్తయినా ఉపశ మనం దొరుకుతుందా, లేదా అన్నదే. అది తీరకపోగా మరింత పెరుగుతుందని కొందరు నిపుణులు చెబుతున్న మాట. చిత్రమేమంటే పార్లమెంటు లోపలా, వెలుపలా రాష్ట్రాలు తమ ఆదాయం కోల్పోతామన్న భయాన్ని వ్యక్తం చేయడం, దాని ప్రాతిపదికన వ్యతిరేకించడం మినహా సాధారణ పౌరులకు వచ్చే లాభనష్టాల గురించీ, వారి ఇంటి బడ్జెట్‌ను అది ప్రభావితం చేసే తీరు గురించి ఎక్కడా చర్చ జరగలేదు. జీఎస్‌టీ కూడా ఇప్పుడున్న వ్యాట్ మాదిరి సామాన్యులకు గుదిబండ అవుతుందా... వారికి ఊరటనిస్తుందా అన్నది మున్ముందు చూడాలి.