ప్రస్తుత పరిస్థితుల్లో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరమనిపించడం లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరమనిపించడం లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఓబీసీల అభివృద్ధికి సంబంధించి సామాజిక న్యాయశాఖకు చెందిన బీసీ బ్యూరో అన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని, ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఎంపీ వి.హనుమంతరావు గత నవంబర్‌లో ప్రధాని మోదీకి లేఖ రాశారు.
దీనిపై బదులిస్తూ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ రాసిన లేఖ శుక్రవారం అందినట్టు వీహెచ్ కార్యాలయవర్గాలు వెల్లడించాయి. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ అధికారాలు కల్పించడానికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపాయి.