సాక్షి, వరంగల్ : మహిళా సంఘం బాగోగులు చూడాల్సిన ఓ ‘సీఏ’ సంఘం సభ్యులను మోసం చేసి, ఫోర్జరీ సంతకంతో డబ్బులు ‘డ్రా’ చేసింది. సొంతంగా వాడుకున్న విషయమై ఏపీఎంకు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మహిళా సంఘం డబ్బులు సంఘం బాధ్యులు దుర్వినియోగం చేయకుండా నెల నెలా సంఘం లెక్కలు చూడాల్సిన సీఏ మహిళా సంఘం డబ్బులు రూ.70 వేలను బ్యాంక్ నుంచి డ్రా చేసిన సంఘటన నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామంలో జరిగింది. ఈ విషయాన్ని అయ్యప్ప పొదుపు సంఘం సభ్యురాలు, గ్రామ 4వ వార్డు సభ్యురాలు తోపుచర్ల పద్మ ఆదివారం ఏపీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గ్రామానికి చెందిన సాయిరాఘవ పొదుపు సంఘం సీఏ సుజాత సంఘానికి సంబంధించిన డబ్బులను నెక్కొండ ఏపీజీవీబీ నుంచి డిసెంబర్ 2018లో రూ.10వేలు, మార్చి 2019లో రూ.20 వేలు, ఏప్రిల్‌లో రూ.40 వేలను బ్యాంక్ నుంచి డ్రా చేసినట్లు ఆమె తెలిపారు.
సంఘానికి సంబంధించి నెల నెలా లెక్కలు ఉండడంతో రికార్డులు, ముద్రలు, బ్యాంక్ పాస్ పుస్తకాలు సీఏ వద్ద ఉండేవన్నారు. దీంతో మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మరో 8 మంది సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, తీర్మాణం రాసి బ్యాంక్ అధికారులను మోసం చేసి డబ్బులను తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ నెల 17న తాను బ్యాంక్ వెళ్లగా ఈ విషయం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. సంఘం సభ్యులందరూ బ్యాంక్ అధికారుల ఎదుట హాజరైతేనే సంఘానికి రుణం మంజూరు చేయాల్సి ఉండగా కేవలం సీఏను నమ్మి ఎలా డబ్బులు డ్రా చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఏపీఎం శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. విచారణ చేసి డబ్బులు స్వాహాకు పాల్పడిన సీఏ సుజాతపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏపీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment