Sign forgery
-
అలా వెళ్లాడు.. ఇలా దొరికిపోయాడు
సాక్షి, కదిరిటౌన్: తన వద్దనున్న వేరొకరి బ్యాంకు పాసుపుస్తకం తీసుకుని, ఖాతాదారు సంతకం ఫోర్జరీ చేసి నగదు డ్రా చేసేందుకు వెళ్లిన మోసగాడిని బ్యాంకు అధికారులు గుర్తించి పట్టుకున్నారు. కదిరికి చెందిన గంగిశెట్టి 2019 జూన్ 30న స్థానిక ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లాడు. నిరక్షరాస్యుడు కావడంతో బ్యాంకులో చిప్పలమడుగుకు చెందిన శివ అనే వ్యక్తి సహాయంతో విత్‌డ్రా ఫాం పూరించి, అందులో సంతకం చేశాడు. అదే సమయంలో సెల్‌ఫోన్‌కు ఎవరో కాల్ చేయడంతో గంగిశెట్టి మాట్లాడేందుకని విత్డ్రాం ఫాం, బ్యాంకు పాసుపుస్తకం సదరు వ్యక్తి వద్దే ఉంచేసి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. దరఖాస్తు రాసిచ్చిన శివ అనే వ్యక్తికి దురాశ కలిగింది. సంతకం చేసేసి ఉన్న రూ.27వేల విత్ డ్రా ఫాం తీసుకుని కౌంటర్లోకి వెళ్లాడు. అక్కడ సిబ్బంది ఖాతాదారు ముఖం చూడకుండానే నగదు ఇచ్చేశారు. ఆ తర్వాత నెల రోజులకు గంగిశెట్టి తన పాసుపుస్తకం పోయిందని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన కంప్యూటర్లో పరిశీలించగా ఖాతాలోంచి రూ.27వేలు నగదు డ్రా అయిపోయిన విషయం బయటపడింది. తనకు సహాయం చేసిన వ్యక్తే ఈపని చేసి ఉంటాడని తెలపగా మేనేజర్ కొత్త పాసుపుస్తకం జారీ చేశారు. పాత పుస్తకం ఎవరైనా తీసుకువస్తే స్వాదీనం చేసుకోవాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు. చదవండి: మైనర్‌పై అత్యాచారం.. 65 ఏళ్ల వృద్ధుడికి మరణ శిక్ష ఈ క్రమంలో శివ శనివారం మరోసారి గంగిశెట్టి ఖాతాలోంచి రూ.2వేలు నగదు డ్రా చేసుకుందామని ఆంధ్రాబ్యాంకుకు వెళ్లాడు. విత్‌డ్రా ఫాం నింపి, పాసుపుస్తకం తీసుకుని కౌంటర్‌కు వెళ్లాడు. అక్కడ నీ పేరేమి అని అడిగితే వాస్తవ ఖాతాదారు పేరు కాకుండా తన పేరు శివ అని చెప్పాడు. మరోసారి అడిగేసరికి పేరు పూర్తిగా చెప్పలేక నీళ్లు నమిలాడు. అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి శివను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
25 లక్షలు డ్రా చేసి.. ఇంటి నుంచి గెంటేశాడు!
సాక్షి, ఒంగోలు: అనారోగ్యం ఆమెను పట్టి పీడిస్తుంది. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకు కనీసం కట్టుకున్న ఇంటిలో కూడా ఉండకుండా వెళ్లగొట్టాడు. తప్పనిస్థితిలో బతుకుజీవుడా అనుకుంటూ కూతురి ఇంటివద్ద తలదాచుకుంటూ మాకు న్యాయం చేయండయ్యా అంటూ ఓ వృద్ధురాలు జిల్లా ఎస్పీని కలిసి స్పందనలో వేడుకుంది. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదుపై వన్‌టౌన్ జియో సోమేపల్లి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాది ఆసియా బేగం స్థానిక విజయనగర్ కాలనీ వాసి. ఆమె భర్త మత్స్యశాఖలో అటెండర్‌గా పనిచేసేవాడు. 2019 జూలై 31న రిటైరయ్యాడు. ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో డబ్బులు వచ్చాయి. వాటన్నింటిని బ్యాంకులో దాచుకోగా అతని కుమారుడు షేక్ జావెద్ కన్ను దానిపై పడింది. తిరుపతి రావు అనే వ్యక్తి సహకారంతో కొడుకు జావెద్ తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏటీఎం కార్డు, బ్యాంకు చెక్కు ద్వారా ఏకంగా రూ. 25లక్షలు కాజేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు కొడుకుని ప్రశ్నించడంతో ఇళ్లు నాది అంటూ తల్లిదండ్రులను ఇద్దరిని ఇంటినుంచి వెళ్లగొట్టాడు. అంతే కాకుండా తిరుపతిరావు, గురు, కోమల్ అనే వారితో కలిసి మరలా వస్తే చంపేస్తామంటూ బెదిరించినట్లు ఆసియా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాము చీమకుర్తిలోని కుమార్తె ఇంటివద్ద తలదాచుకున్నామని పేర్కొంది. వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిన కొడుకు నుంచి న్యాయం అందేలా చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు కోసం దర్యాప్తు ప్రారంభించారు. -
ఆర్డీఓ సంతకం ఫోర్జరీ..
సాక్షి, నెల్లికుదురు: తొర్రూర్ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య సంతకం ఫోర్జరీ చేసిన కేసులో కొండపల్లి కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్ పంపించినట్లు తొర్రూర్ సీఐ వి.చేరాలు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్‌తో కలసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఇసుక అక్రమంగా రవాణా చేసేందుకు తన సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసినట్లు తొర్రూర్ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య ఆగస్టు 19న నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన నెల్లికుదురు ఎస్సై దర్యాప్తు ప్రారంభించారు. మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ వీఆర్ఓ కొండపల్లి నర్శింగరావు కుమారుడు కొండపల్లి కిరణ్‌కుమార్ నెల్లికుదురు తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్‌తో కుమ్మక్కై ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేశారు. ఇసుక రవాణాకు ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు ట్రాక్టర్ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇసుక కూపన్లు సరఫరా చేశారు. ఈ తతంగం ఈ ఏడాది జనవరి నుంచి కొనసాగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు ఏ1 కొండపల్లి కిరణ్ కుమార్‌ను ఈనెల 1న రాత్రి అరెస్టుచేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అయితే ఏ2 నిందితుడు నెల్లికుదురు తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్ పరారీలో ఉన్నట్లు సీఐ చేరాలు తెలిపారు. వెలుగు చూసింది ఇలా.. బ్రాహ్మణకొత్తపల్లికి చెందిన కొండపల్లి నర్సింగరావు నెల్లికుదురు తహసీల్ కార్యాలయం ఏర్పాటైన కొద్ది సంవత్సరాలు వీర్‌ఓగా పనిచేశాడు. 2009లో నర్సింగరావుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతడి కుమారుడు కిరణ్‌కుమార్ రెవెన్యూ అధికారులతో కుమ్మకై తండ్రి స్థానంలో వీఆర్ఓగా చేరాడు. బ్రాహ్మణకొత్తపల్లితో పాటు మధనతుర్తితో పనిచేశాడు. 2010లో బ్రాహ్మణకొత్తపల్లికి ప్రభుత్వం పంటల నష్టం కింద గ్రామానికి మంజూరు చేసిన సుమారు రూ.80వేలు తన ఒక కుటుంబానికే వాడుకుని అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామస్తులు అప్పటి ట్రెయినీ కలెక్టర్ అంబేడ్కర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి కొండపల్లి నర్సింగరావును వీఆర్ఓ పోస్టు నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల్లికుదురు తహసీల్దార్ కార్యాలయంలో కిరణ్‌కుమార్ హవా కొనసాగుతూనే ఉందని.. ఎట్టకేలకు పాపం పడిందని ప్రజలు అనుకుంటున్నారు. -
ఫోర్జరీ సంతకంతో డబ్బులు స్వాహా..
సాక్షి, వరంగల్ : మహిళా సంఘం బాగోగులు చూడాల్సిన ఓ ‘సీఏ’ సంఘం సభ్యులను మోసం చేసి, ఫోర్జరీ సంతకంతో డబ్బులు ‘డ్రా’ చేసింది. సొంతంగా వాడుకున్న విషయమై ఏపీఎంకు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మహిళా సంఘం డబ్బులు సంఘం బాధ్యులు దుర్వినియోగం చేయకుండా నెల నెలా సంఘం లెక్కలు చూడాల్సిన సీఏ మహిళా సంఘం డబ్బులు రూ.70 వేలను బ్యాంక్ నుంచి డ్రా చేసిన సంఘటన నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామంలో జరిగింది. ఈ విషయాన్ని అయ్యప్ప పొదుపు సంఘం సభ్యురాలు, గ్రామ 4వ వార్డు సభ్యురాలు తోపుచర్ల పద్మ ఆదివారం ఏపీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గ్రామానికి చెందిన సాయిరాఘవ పొదుపు సంఘం సీఏ సుజాత సంఘానికి సంబంధించిన డబ్బులను నెక్కొండ ఏపీజీవీబీ నుంచి డిసెంబర్ 2018లో రూ.10వేలు, మార్చి 2019లో రూ.20 వేలు, ఏప్రిల్‌లో రూ.40 వేలను బ్యాంక్ నుంచి డ్రా చేసినట్లు ఆమె తెలిపారు. సంఘానికి సంబంధించి నెల నెలా లెక్కలు ఉండడంతో రికార్డులు, ముద్రలు, బ్యాంక్ పాస్ పుస్తకాలు సీఏ వద్ద ఉండేవన్నారు. దీంతో మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మరో 8 మంది సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, తీర్మాణం రాసి బ్యాంక్ అధికారులను మోసం చేసి డబ్బులను తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ నెల 17న తాను బ్యాంక్ వెళ్లగా ఈ విషయం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. సంఘం సభ్యులందరూ బ్యాంక్ అధికారుల ఎదుట హాజరైతేనే సంఘానికి రుణం మంజూరు చేయాల్సి ఉండగా కేవలం సీఏను నమ్మి ఎలా డబ్బులు డ్రా చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఏపీఎం శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. విచారణ చేసి డబ్బులు స్వాహాకు పాల్పడిన సీఏ సుజాతపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏపీఎం తెలిపారు. -
ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు స్వాహా...
సాక్షి, గజపతినగరం రూరల్ (విజయనగరం): మండలానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు వ్యవసాయాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి వరి విత్తనాలు తీసుకెళ్లిన సంఘటన చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంపై పో లీసులకు ఫిర్యాదు చేసే యోచనలో వ్యవసాయా శాఖాధికారులున్నారు. విషయంలోకి వెళ్తే... మండల వ్యవసాయాధికారి టి. సంగీత ఈ నెల 20వ తేదీన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద కెంగువ, తుమ్మికాపల్లి, లోగిశ గ్రామాలకు చెందిన రైతులకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ చేశారు. అయితే కెంగువ గ్రామానికి సంబంధించి 25 స్లిప్పులు ఎక్కువగా వచ్చాయి. దీంతో ఏఓ సంగీతకు అనుమానం వచ్చి ఆయా స్లిప్పులను పరిశీలించగా.. 25 స్లిప్పులపై తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. వాస్తవానికి రైతుకు విత్తన బస్తా మంజూరు కావాలంటే వ్యవసాయాధికారి సంతకం చేసిన స్లిప్పు ఉండాలి. రైతులందరూ వారి పట్టాదారు పాస్ పుస్తకాలు అధికారులకు చూపిస్తే ఏఓ కార్యాలయం సిబ్బంది స్లిప్పు అందిస్తారు. ఈ స్లిప్పు పీఏసీఎస్ కార్యాలయంలో చూపించి రాయితీపై వరి విత్తన బస్తా పొందాల్సి ఉంటుంది. అయితే రైతులకు స్లిప్పులు పంపిణీ చేయడం కోసం వ్యవసాయ శాఖ కార్యాలయం సిబ్బంది స్టాంప్ వేసిన స్లిప్పులను సిద్ధంగా ఉంచుకున్నారు. ఇదే అదునుగా ఏఓ కార్యాలయంలోని స్లిప్పులను కెంగువకు చెందిన టీడీపీ నాయకులు కొందరు స్వాహా చేసి.. వాటిపై ఏఓ సంతకం చేసి విత్తనాలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ విషయమై గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మజ్జి గోవింద, తదితరులను ఏఓ ప్రశ్నించారు. అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. అయితే ఏమైందో ఏమో కాని పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. వాస్తవాలు తెలియాలి... ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు తీసుకెళ్లినట్లు ఆధారాలున్నా అధికారులు టీడీపీ నాయకులపై వ్యవసాయాధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఫోర్జరీ పత్రాలపై కెంగువ గ్రామానికి చెందిన మజ్జి రామునాయుడు, యిజ్జిరోతు పాపినాయుడు, దాసరి చిన్నంనా యుడు, మండల రామునాయుడు, మండల అప్పలనాయుడు, మిత్తిరెడ్డి సింహాచలం, మిత్తిరెడ్డి సూర్యనారాయణ, మిత్తిరెడ్డి బంగారునాయుడు, గుడివాడ రమణ, అలుగోలు పెంటయ్య, కొండల రాము, ఎండ బంగారప్పడు, ఎండ నారాయణ, మజ్జి సన్యాసియుడు, మజ్జి కామునాయుడు, కర్రి తవుడు, దాసరి సూరినాయుడు, మజ్జి సింహాచలం, మద్ది సత్యం, మద్ది పైడిరాజు, పల్లేడ సత్యమమ్మ, బూడి పాపినాయుడు, పెనుమజ్జి రాము, మజ్జి చిన్నంనాయుడు, తదితరులకు విత్తనాలు అందినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఫోర్జరీ చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తాను... ఈ నెల 20వ తేదీన జరిగిన విత్తనాల పంపిణీలో 25 ప్యాకెట్లకు సంబంధించి ఫోర్జరీ సంతకంతో కూడిన స్లిప్పులు వచ్చినా తొందరపాటులో విత్తనాలు ఇచ్చేశాం. వెంటనే అక్రమాన్ని పసిగట్టి నిందితులపై ఫిర్యాదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విత్తనాల విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. – టి. సంగీత, మండల వ్యవసాయాధికారి, గజపతినగరం ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. ఫోర్జరీ సంతకాల విషయంలో అ టు టీడీపీ, ఇటు వ్యవసాయ శా ఖాధికారులపై అనుమానాలు న్నాయి. 25 బస్తాల విత్తనాలు బయటకు వెళ్లిపోయినా ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు వెళ్లిపోయిన విష యం ఏఓకు తెలుసు. అయినా ఎటువంటి చర్యలు తీ సుకోకపోవడం దారుణం. – లెంక గణేష్, కెంగువ విచారకరం.. అందరి రైతులకు అందాల్సిన విత్తనాలు కొంతమంది తప్పుడు సంతకాలతో తీసుకెళ్లిపోవడం విచారకరం. టీడీపీ నాయకులు స్లిప్పులు దొంగిలించి వాటిపై రైతుల పేరు రాసుకుని ఏఓ సంతకం ఫోర్జరీ చేసి విత్తనాలు తీసుకెళ్లిపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన తతంగంపై విచారణ చేపట్టాలి. – గుడివాడ తాతయ్యలు -
ఫోర్జరీతో టీడీపీ ఎంపీపీ మనస్తాపం..
► ఎంపీపీ సంతకాలతో రూ.50 లక్షల పనులకు ఆమోదం ► మనస్తాపానికి గురై రాజీనామాకు సిద్ధమైన ప్రజాప్రతినిధి ► టీడీపీ పరువు పోతుందని బుజ్జగించిన ఎమ్మెల్యే, ఇతర నేతలు ఏలూరు: ప్రజాప్రతినిధి ఫోర్జరీ సంతకంతో ఉపాధి హామీ పనులకు ఆమోదముద్ర వేసిన ఘటన దేవరపల్లి మండల పరిషత్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిగువస్థాయి ఉద్యోగి సుమారు రూ.50 లక్షలు విలువగల ఉపాధి హామీ పనులకు ఎంపీపీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తీర్మానానికి ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో రెండు నెలల క్రితం ఉపాధి హామీ పథకం, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు, జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ, ఎస్డీఎఫ్ నిధులు సుమారు రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు తయారు చేశారు. పనులు చేపట్టడానికి గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు మండల పరిషత్ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించాల్సి ఉంది. ఈ నిధుల్లో గౌరీపట్నంలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించారు. మంజూరు చేసిన పనులకు గత నెల 26న జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదం కోసం మండల పరిషత్ అధికారి సమావేశంలో సభ్యుల ముందు ఉంచారు. గౌరీపట్నంకు కేటాయించిన రూ.50 లక్షల పనులకు సంబంధించిన తీర్మానం ప్రతిపాదనపై ఎంపీపీ సంతకాన్ని మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న దిగువస్థాయి ఉద్యోగి ఫోర్జరీ చేసి తీర్మానాన్ని సంబంధిత వ్యక్తులకు ఇచ్చారు. దీంతో గత నెలలో గ్రామంలో పనులను పూర్తి చేశారు. ఈ విషయం ఎంపీపీ ఆలస్యంగా గమనించి అవాక్కయ్యారు.తనకు తెలియకుండా కార్యాలయంలో ఇంకా ఎన్ని జరుగుతున్నాయోనని ఆయన అనుమానం వ్యక్తం చేసి జరిగిన ఫోర్జరీ సంతకాలపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేయటానికి సిద్ధపడగా పలువురు ప్రజాప్రతినిధులు అడ్డుపడినట్టు తెలిసింది. విషయాన్ని ఎంపీపీ రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ దృష్టికి తీసుకువెళ్లి దీనిపై తనకు న్యాయం చేయాలని కోరినట్టు తెలిసింది. ఘటనపై మనస్తాపానికి గురైన ఎంపీపీ నరసింహరావు రాజీనామాకు సిద్ధపడగా విషయం బయటపడితే పార్టీ పరువు పోతుందని ప్రజాప్రతినిధులు వారించినట్టు సమాచారం. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వద్ద ఆర్యవైశ్య సంఘం నాయకులు, టీడీపీ నాయకులు, పలువురు సర్పంచ్ల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా సదరు దిగువస్థాయి ఉద్యోగి జరిగిన తప్పును అంగీకరించినట్టు తెలిసింది. సంబంధిత అధికారిని ఎమ్మెల్యే తీవ్రంగా మందలించి భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారని సమాచారం. అడుగడుగునా అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల వల్ల అవమానానికి గురవుతున్నానని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవమానంతో పనిచేసే కంటే రాజీనామా చేసి పక్కన ఉండటం మంచిదని ఎంపీపీ ఎమ్మెల్యే వద్ద వాపోయారు. ఎమ్మెల్యే, ఇతర నాయకులు సదరు దిగువస్థాయి ఉద్యోగిని ఇక్కడ నుంచి బదిలీపై పంపించటానికి నిర్ణయం తీసుకని ఎంపీపీని బుజ్జగించి శాంతింప చేసినట్టు తెలిసింది. కురుకూరు వద్ద మండల పరిషత్ నిధులురూ.1.50 లక్షలతో బస్‌షెల్టర్ నిర్మాణం చేశారు. దీనికి అదనంగా మరొక రూ. 35,000 ఎంపీపీ అనుమతిలేకుండా మండల పరిషత్ నిధుల నుంచి డ్రా చేసిన విషయం కూడా ఎంపీపీ వెల్లడించినట్లు తెలిసింది. -
ముందు కొడుతున్నా .... తర్వాత ఫోన్ చేయండి
హైదరాబాద్: పని ఒత్తిడిలో ఉన్న బ్యాంకు సిబ్బంది సంతకం సరిపోల్చి చూసుకోకుండా ఒకరి నగదు మరొకరికి ఇచ్చారు. దీంతో నగదు తీసుకున్నట్లు సెల్ఫోన్లో సందేశం రావడంతో అసలు ఖాతాదారుడు వెంటనే అప్రమత్తమై బ్యాంకుకి చేరుకుని... అధికారులను నిలదీశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని ఓ బ్యాంకులో చోటు చేసుకుంది. ఆలంపల్లికి చెందిన లంక లక్ష్మారెడ్డి నగదు డ్రా చేసేందుకు బుధవారం బ్యాంకుకు వెళ్లారు. కొద్దిసేపు క్యూలో నిల్చున్న ఆయన అత్యవరస పని ఉండటంతో ... తన పాస్‌బుక్‌ను కౌంటర్లో ఉన్న ఉద్యోగి సలహా మేరకు ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. తీరా గంట తరువాత తన ఖాతా నుంచి రూ.18 వేలు డ్రా అయినట్లు లక్ష్మారెడ్డికి ఫోన్లో సందేశం రావడంతో వెంటనే బ్యాంకు మేనేజర్‌ను ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మేనేజర్ నగదు డ్రా చేసిన ఓచర్‌ను పరిశీలించిగా... దొంగ సంతకంతో రూ. 18 వేలు డ్రా చేసినట్లు గుర్తించారు. బ్యాంకులో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా కౌంటర్‌పై ఉన్న పాసుబుక్ తీసుకొని విత్‌డ్రా ఫాం నింపి డబ్బు డ్రా చేసిన వ్యక్తి ధారూరు మండలం ఎబ్బనూర్ గ్రామానికి చెందిన బ్యాగరి లక్ష్మణ్‌గా బ్యాంకు అధికారులు గుర్తించారు. వెంటనే అతడి ఫోన్ చేయ్యగా తాను అనంతగిరిగుట్టపై బిజీగ ఉన్నానని ... ప్రస్తుతం మందు కొడుతున్నానని...తరువాత ఫోన్ చేయండంటూ సమాధానమిచ్చాడు. దీంతో బ్యాంకు అధికారులు అవాక్కయ్యారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.