పోలీసుల అదుపులో ఉన్న శివ
సాక్షి, కదిరిటౌన్: తన వద్దనున్న వేరొకరి బ్యాంకు పాసుపుస్తకం తీసుకుని, ఖాతాదారు సంతకం ఫోర్జరీ చేసి నగదు డ్రా చేసేందుకు వెళ్లిన మోసగాడిని బ్యాంకు అధికారులు గుర్తించి పట్టుకున్నారు. కదిరికి చెందిన గంగిశెట్టి 2019 జూన్ 30న స్థానిక ఆంధ్రాబ్యాంక్‌కు వెళ్లాడు. నిరక్షరాస్యుడు కావడంతో బ్యాంకులో చిప్పలమడుగుకు చెందిన శివ అనే వ్యక్తి సహాయంతో విత్‌డ్రా ఫాం పూరించి, అందులో సంతకం చేశాడు. అదే సమయంలో సెల్‌ఫోన్‌కు ఎవరో కాల్ చేయడంతో గంగిశెట్టి మాట్లాడేందుకని విత్‌డ్రాం ఫాం, బ్యాంకు పాసుపుస్తకం సదరు వ్యక్తి వద్దే ఉంచేసి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. దరఖాస్తు రాసిచ్చిన శివ అనే వ్యక్తికి దురాశ కలిగింది.
సంతకం చేసేసి ఉన్న రూ.27వేల విత్ డ్రా ఫాం తీసుకుని కౌంటర్‌లోకి వెళ్లాడు. అక్కడ సిబ్బంది ఖాతాదారు ముఖం చూడకుండానే నగదు ఇచ్చేశారు. ఆ తర్వాత నెల రోజులకు గంగిశెట్టి తన పాసుపుస్తకం పోయిందని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన కంప్యూటర్‌లో పరిశీలించగా ఖాతాలోంచి రూ.27వేలు నగదు డ్రా అయిపోయిన విషయం బయటపడింది. తనకు సహాయం చేసిన వ్యక్తే ఈపని చేసి ఉంటాడని తెలపగా మేనేజర్ కొత్త పాసుపుస్తకం జారీ చేశారు. పాత పుస్తకం ఎవరైనా తీసుకువస్తే స్వాదీనం చేసుకోవాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు.
చదవండి: మైనర్‌పై అత్యాచారం.. 65 ఏళ్ల వృద్ధుడికి మరణ శిక్ష
ఈ క్రమంలో శివ శనివారం మరోసారి గంగిశెట్టి ఖాతాలోంచి రూ.2వేలు నగదు డ్రా చేసుకుందామని ఆంధ్రాబ్యాంకుకు వెళ్లాడు. విత్‌డ్రా ఫాం నింపి, పాసుపుస్తకం తీసుకుని కౌంటర్‌కు వెళ్లాడు. అక్కడ నీ పేరేమి అని అడిగితే వాస్తవ ఖాతాదారు పేరు కాకుండా తన పేరు శివ అని చెప్పాడు. మరోసారి అడిగేసరికి పేరు పూర్తిగా చెప్పలేక నీళ్లు నమిలాడు. అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి శివను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment