అతను మృగాడే.. వెలుగులోకి ఇంతియాజ్‌ ఆగడాలు  | Sri Sathya Sai District: New Twist in TDP Leader Rallapalli Inthiyaz Case | Sakshi
Sakshi News home page

అతను మృగాడే.. గతంలోనూ ఓ యువతిని ప్రేమపేరుతో ట్రాప్‌

Published Sat, Oct 8 2022 9:08 AM | Last Updated on Sat, Oct 8 2022 9:15 AM

Sri Sathya Sai District: New Twist in TDP Leader Rallapalli Inthiyaz Case - Sakshi

టీడీపీ నేత లోకేష్‌తో ఇంతియాజ్‌(ఫైల్‌)  

సాక్షి, కదిరి(అనంతపురం జిల్లా): రాళ్లపల్లి ఇంతియాజ్‌. కందికుంట అనుచరుడు. తెలుగు యువత నల్లచెరువు మండల ప్రధాన కార్యదర్శి. మెడలో పసుపు కండువాతో కనిపించే ఇంతియాజ్‌కు అమ్మాయిల జీవితాలతో ఆడుకోవటం అలవాటు. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిలను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించడం.. ఆ తర్వాత వారిని లైంగికంగా వేధించడం అతనికి పరిపాటి. ఈ క్రమంలోనే తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని సంధ్యారాణిని వేధించాడు. ‘నన్ను ప్రేమించక పోతే నీ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెడతాను’ అంటూ బెదిరించాడు. దీంతో  సంధ్యారాణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో తాను ఇంతియాజ్‌ వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్పష్టంగా పేర్కొంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. 

గతంలోనూ ఓ యువతికి వేధింపులు 
ఇంతియాజ్‌ గతంలోనూ నల్లచెరువు మండలంలో ఓ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసి వేధించాడు. దీంతో సదరు యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, రంగంలోకి దిగిన టీడీపీ పెద్దలు దుప్పటి పంచాయితీ చేసి అతనిపై కేసు లేకుండా చేశారు.  ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకోవడం, ప్రేమలోకి దింపడం, చివరకు బ్లాక్‌మెయిల్‌ చేసి కామవాంఛ తీర్చుకోవడం ఇంతియాజ్‌కు అలవాటుగా మారింది. కుటుంబ పరువు బజారున పడుతుందనే భయంతో ఎంతోమంది తమకు జరిగిన అన్యాయాన్ని బయట చెప్పుకోలేక పోయారు. సంధ్యారాణి ఆత్మహత్య ఘటనతో ఇంతియాజ్‌ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 

చంపుతామని సీఐకి బెదిరింపు 
ఇటీవల కదిరి ఎన్‌జీఓ కాలనీకి సంబంధించిన భూ వివాదంలో దూరిన కందికుంట, ఆయన అనుచరులు భూ యజమానులపై దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో జేసీబీ అద్దాలు పగలగొట్టడంతో పాటు వారి ఆగడాలను అడ్డుకోవాలని చూసిన పట్టణ సీఐ తమ్మిశెట్టి మధుపై కూడా దాడికి యత్నించారు. వారిలో సంధ్యారాణి మృతికి కారణమైన రాళ్లపల్లి ఇంతియాజ్‌ కూడా ఉన్నారు. ‘మా అన్న కందికుంటనే అడ్డుకుంటావా? నీకెంత ధైర్యం. నిన్ను నరికి చంపుతాం..’ అంటూ కందికుంట అనుచరుడు మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో బాగా వైరల్‌ అయింది. అయినా పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందువల్లే పేట్రేగి పోతున్నట్లు తెలుస్తోంది.

ఆస్పత్రిలో హైడ్రామా 
కదిరి టౌన్‌: సంధ్యారాణి ఆత్మహత్య కేసులో పోలీసులు శుక్రవారం ఇంతియాజ్‌ను అదుపులోకి తీసుకోగా, అతను నాటకానికి తెరలేపాడు. కదిరి కోర్టులో, ప్రభుత్వ ఆస్పత్రిలో తనను పోలీసులు కొట్టారంటూ హంగామా చేశాడు. అంతకుముందు తనకు ఆరోగ్యం సరిగా లేదని పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా, పరీక్షించిన వైద్యులు అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. దీంతో పోలీసులు న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇంతియాజ్‌ను రిమాండ్‌కు తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement