ఆవుల సతీష్
మచిలీపట్నం (కోనేరు సెంటర్): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్త హాస్టల్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో బాలికను పిలిచి.. ఆపై మద్యం తాగించి లైంగిక దాడికి తెగబడ్డాడు. అనంతరం మత్తులో ఉన్న ఆమెను ద్విచక్ర వాహనంపై వసతి గృహం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న బాధితురాలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా జరిగిన ఘోరం బయటికి పొక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక మచిలీపట్నంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
నాలుగు నెలల క్రితం మచిలీపట్నం మండలం ఎస్‌ఎన్ గొల్లపాలెం గ్రామానికి చెందిన ఆవుల సతీష్ అనే టీడీపీ కార్యకర్త ఆమెను పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలో దింపాడు. నాలుగు నెలలుగా యువతిని కళాశాలకు వెళ్లే సమయాల్లో కలుస్తుండటంతో పాటు ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. కాగా.. ఈ నెల 18వ తేదీన సతీష్ ఆ బాలికకు ఫోన్ చేసి ఓసారి కలవాలని చెప్పాడు. అందుకు ఆమె సరేనంది. ఆదివారం భోజనం చేసిన అనంతరం సదరు యువతి హాస్టల్ వార్డెన్‌కు తెలియకుండా బయటికి వెళ్లింది.
సతీష్ ఆమెను నగరంలోని విజయ రాఘవ లాడ్జికి తీసుకురమ్మని తన స్నేహితుడైన కళ్యాణ్‌కు బైక్ ఇచ్చి పంపాడు. సతీష్ చెప్పిన విధంగా కళ్యాణ్ రామానాయుడుపేట సెంటర్‌లో యువతిని బండి ఎక్కించుకుని లాడ్జి వద్ద దింపాడు. యువతి సతీష్ ఉన్న రూంలోకి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీష్ యువతికి బలవంతంగా మద్యం తాగించాడు. దీంతో యువతి స్పృహ కోల్పోగా.. సతీష్ ఆమెను వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బైక్‌పై హాస్టల్ వద్ద దింపి వెళ్ళిపోయాడు.
మద్యం మత్తులో ఉన్న యువతి ప్రవర్తన వింతగా ఉండటం గమనించిన హాస్టల్ వార్డెన్ ఇతర సిబ్బంది సమీపంలోని సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. వైద్య సిబ్బంది ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించటంతో వార్డెన్ యువతిని మందలించింది. మద్యం మత్తు వీడిన అనంతరం విషయం తెలుసుకున్న యువతి సతీష్ తనకు బలవంతంగా తాగించి ఆపై లైంగిక దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న సీఐ రవికుమార్ మచిలీపట్నం ఎస్సై వి.వెంకటేశ్వరరావు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
కోర్టుకు హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కాగా, సతీష్ స్నేహితులైన కళ్యాణ్, మణికంఠ ఆ బాలికను అర్ధనగ్నంగా సెల్ఫోన్లలో వీడియోలు తీసినట్టు తెలుసుకున్న పోలీసులు వారిపైనా చర్యలకు ఉపక్రమించనున్నారు. సమాచారం అందుకున్న సోషల్ వెల్ఫేర్ డీడీ సాహిద్‌బాబు వసతి గృహానికి చేరుకుని ఘటనపై విచారణ జరిపారు. యువతి హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన క్రమంలో అందుకు బాధ్యురాలిని చేస్తూ వార్డెన్ మల్లేశ్వరిని సస్పెండ్ చేసినట్టు డీడీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment