Hostel student
-
హాస్టల్ విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త అఘాయిత్యం
మచిలీపట్నం (కోనేరు సెంటర్): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్త హాస్టల్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో బాలికను పిలిచి.. ఆపై మద్యం తాగించి లైంగిక దాడికి తెగబడ్డాడు. అనంతరం మత్తులో ఉన్న ఆమెను ద్విచక్ర వాహనంపై వసతి గృహం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న బాధితురాలి ప్రవర్తనపై అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా జరిగిన ఘోరం బయటికి పొక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక మచిలీపట్నంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నాలుగు నెలల క్రితం మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామానికి చెందిన ఆవుల సతీష్ అనే టీడీపీ కార్యకర్త ఆమెను పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలో దింపాడు. నాలుగు నెలలుగా యువతిని కళాశాలకు వెళ్లే సమయాల్లో కలుస్తుండటంతో పాటు ఫోన్లో మాట్లాడుతున్నాడు. కాగా.. ఈ నెల 18వ తేదీన సతీష్ ఆ బాలికకు ఫోన్ చేసి ఓసారి కలవాలని చెప్పాడు. అందుకు ఆమె సరేనంది. ఆదివారం భోజనం చేసిన అనంతరం సదరు యువతి హాస్టల్ వార్డెన్‌కు తెలియకుండా బయటికి వెళ్లింది. సతీష్ ఆమెను నగరంలోని విజయ రాఘవ లాడ్జికి తీసుకురమ్మని తన స్నేహితుడైన కళ్యాణ్‌కు బైక్ ఇచ్చి పంపాడు. సతీష్ చెప్పిన విధంగా కళ్యాణ్ రామానాయుడుపేట సెంటర్లో యువతిని బండి ఎక్కించుకుని లాడ్జి వద్ద దింపాడు. యువతి సతీష్ ఉన్న రూంలోకి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీష్ యువతికి బలవంతంగా మద్యం తాగించాడు. దీంతో యువతి స్పృహ కోల్పోగా.. సతీష్ ఆమెను వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బైక్‌పై హాస్టల్ వద్ద దింపి వెళ్ళిపోయాడు. మద్యం మత్తులో ఉన్న యువతి ప్రవర్తన వింతగా ఉండటం గమనించిన హాస్టల్ వార్డెన్ ఇతర సిబ్బంది సమీపంలోని సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. వైద్య సిబ్బంది ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించటంతో వార్డెన్ యువతిని మందలించింది. మద్యం మత్తు వీడిన అనంతరం విషయం తెలుసుకున్న యువతి సతీష్ తనకు బలవంతంగా తాగించి ఆపై లైంగిక దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న సీఐ రవికుమార్ మచిలీపట్నం ఎస్సై వి.వెంకటేశ్వరరావు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కాగా, సతీష్ స్నేహితులైన కళ్యాణ్, మణికంఠ ఆ బాలికను అర్ధనగ్నంగా సెల్ఫోన్లలో వీడియోలు తీసినట్టు తెలుసుకున్న పోలీసులు వారిపైనా చర్యలకు ఉపక్రమించనున్నారు. సమాచారం అందుకున్న సోషల్ వెల్ఫేర్ డీడీ సాహిద్బాబు వసతి గృహానికి చేరుకుని ఘటనపై విచారణ జరిపారు. యువతి హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన క్రమంలో అందుకు బాధ్యురాలిని చేస్తూ వార్డెన్ మల్లేశ్వరిని సస్పెండ్ చేసినట్టు డీడీ తెలిపారు. -
కొడుకా సురేశా..
సిద్దిపేటరూరల్: కట్టుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందింది. చెట్టంత ఎదిగిన కొడుకు చదువుకొని ప్రయోజకుడిగా మారి అండగా నిలుస్తాడని ఆ తండ్రి కన్న కలలు ఒక్క క్షణంలో అడియాశలయ్యాయి. మరో రెండు రోజుల్లో సెమిస్టర్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి పేలుళ్ల రాయి మృత్యు రూపంలో కబలించింది. కళ్లముందే చెట్టంత కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసిన ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. స్థానికంగా ఒక ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న సురేశ్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వసతి గృహంపై అంతస్తులో చదువకుంటున్నాడు. ఇదే సమయంలో సమీపంలోనే ప్రాజెక్టు కెనాల్ పనులు కొనసాగుతున్నాయి. బండలను బ్లాస్టింగ్ చేసే క్రమంలో సిబ్బంది జిలెటెన్ స్టిక్కులను అమర్చి బండలను పేల్చివేశారు. పేలుళ్ల తాకిడికి ఒక రాయి ఎగిరి వచ్చి వసతి గృహంపైన ఆరుబయట చదువుకుంటున్న సురేశ్ తలపై పడింది. వెంటనే తీవ్ర రక్త స్రావంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందడం, మరో విద్యార్థికి గాయాలయ్యాయి, విషయం తెలసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు రోదిస్తూ సంఘటన స్థలానికి చేరుకొని వసతిగృహం ముందు ఆందోళన చేపట్టారు. చదువుకునేందుకు అంతస్తుపైకి.. ప్రత్యక్ష సాక్షుల, పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్ల సురేశ్(19) సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు. వెనకబడిన తరగతులకు చెందిన సురేశ్ సిద్దిపేట మండలం తోర్నాల శివారులోని బీసీ సంక్షేమ వసతి గృహంలొ ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈనెల 20 నుంచి సెమిస్టర్‌పరీక్షలు కొనసాగనున్న క్రమంలో సురేష్ సహచర విద్యార్థులతో కలిసి తోర్నాల వసతి గృహంలోనే ఉండి ప్రతీ రోజు పునశ్చరణ చేస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వసతి గృహంపై అంతస్తుపై చదువుకుందామని తన స్నేహితుడైన శ్రీనివాస్‌తో కలిసి వెళ్లాడు. ఈ సమయంలో సమీపంలోనే ప్రాజెక్టు కెనాల్‌కు సంబంధించిన నిర్మాణంలో భాగంగా బండరాళ్లను పగల కొట్టేందుకు జిలెటిన్ స్టిక్‌లతో పేలుళ్లకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున పేలుళ్లకు బండరాళ్లు గాలిలోకి ఎగిరి చెల్లాచెదురుగా పడ్డాయి. అందులో ఒక పెద్దరాయి సమీపంలోని వసతి గృహంపైన చదువుకుంటున్న చల్మెడకు చెందిన సురేశ్ తలపై పడింది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి సురేశ్ అక్కడికక్కడే కిందపడి మృతి చెందాడు. సురేశ్‌పై పడిన రాయి పక్కనే చదువుకుంటున్న మరొక విద్యార్థి శ్రీనివాస్చేతిపై పడి తీవ్ర గాయం చేసింది. విషయాన్ని సహచర విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన, అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్ బలగాలతో తోర్నాల వసతి గృహానికి చేరుకున్నారు. అప్పటికే తండ్రి, కుటుంబీకులు వసతి గృహం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని శాంతింప జేసే ప్రయత్నం చేసినప్పటికి కుటుంబీకులు ఆందోళనను విరమించలేరు. ఒకదశలో న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అందుబాటులో ఉండని వార్డెన్.. వసతి గృహానికి చెందిన వార్డెన్ సరైన క్రమంలో విధులు హాజరుకాలేడని, గతంలో కూడా ఇదే విధంగా సరిగ్గా విధులకు హాజరు అయ్యేవాడని విద్యార్థులు పేర్కొన్నారు. ఒక వేళ వార్డెన్ ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి జరిగేది ఉండేది కాదని విద్యార్థులు, మృతుని కుటుంబీకులు ఆవేద«న వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటాం సిద్దిపేట నియోజకవర్గం తోర్నాల గ్రామ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా జరిగిన సంఘటనపై మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్‌కాలువ పనులు కోసం రాళ్లను బ్లాస్టింగ్ చేసే సమయంలో మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. సంఘటన బాధకరమని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన విద్యార్థి« కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వం ఆండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. – ఎమ్మెల్యే హరీశ్‌రావు చల్మెడలో విషాద ఛాయలు రామాయంపేట, నిజాంపేట(మెదక్): సిద్దిపేట జిల్లా తోర్నాలవద్ద శుక్రవారం బ్లాస్టింగ్‌లో నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్టె సురేశ్(19) అనే విద్యార్థి మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేశ్ మృతి విషయం తెలుసకున్న గ్రామ సర్పంచ్ నర్సిహారెడ్డి, మృతుని కుటుంబసభ్యులు, అతని స్నేహితులు సంఘటనాస్థలికి తరలివెళ్లారు. మృతుడు సురేశ్ కుటుంబానికి ఆర్థికసాయం అందజేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
గురుకుల విద్యార్థికి కత్తి పోట్లు
కుభీర్(ముథోల్) : మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్ సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో హాస్టల్ గదిలోనే కత్తిపోట్లకు గురయ్యాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణచాంద మండలం శ్యామన్పెల్లి గ్రామానికి చెందిన మమత–శ్రీనివాస్ దంపతుల కుమారుడు హర్షవర్ధన్. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కొడుకును కుభీర్‌లోని గురుకుల పాఠశాలలో వారం క్రితమే చేర్పించారు. జూన్ 29న చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి కుటుంబీకులు శనివారం ఉదయం పాఠశాలలో చేర్పించారు. హాస్టల్ గదికి తలుపులు లేవు. అద్దె భవనం కావడంతో వసతులు అంతంత మాత్రమే ఉన్నాయి. హాస్టల్లో వాచ్‌మన్ గంగాధర్, ఉపాధ్యాయుడు జోహర్ మాత్రమే ఉన్నారు. విద్యార్థి కత్తి కత్తి అని కేకలు వేయగా తోటి విద్యార్థులు లేచి ఉపాధ్యాయుడు జోహార్‌కు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి చూడగా వీపు వెనుకభాగంలో ఐదు చోట్ల కత్తితో పొడిచినట్లు ఉంది. కత్తి సైతం అతని శరీరంలోనే ఉండిపోయింది. వెంటనే కత్తిని తీసి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్ తీసుకెళ్లగా.. ప్రస్తుతం విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. గురుకుల పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భైంసా పట్టణ సీఐ శ్రీనివాస్, కుభీర్ ఎస్సై కె.రమేశ్ పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. రీజినల్ కో ఆర్డినేటర్ శోభారాణి పాఠశాలకు వచ్చి పరిశీలించారు. ఆ రాత్రి వసతిగృహంలో 254 మంది విద్యార్థులు ఉన్నారు. దాడి ఎవరు చేశారు హాస్టల్ వసతిలోకి అగంతకులు ఎలా వచ్చారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. హాస్టల్, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే దాడి జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. కత్తిపోట్లు ఎలా జరిగాయి విద్యార్థికి ఎవరిపై శత్రుత్వం ఉంది తల్లిదండ్రులకు ఎవరైనా పగవారు ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. కూరగాయలు కోసే కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థి మాత్రం ఎవరు ప్రశ్నించినా ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దాడి చేసినట్లు అధికారులకు తెలియజేస్తున్నాడు. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులువిద్యార్థి హర్షవర్ధన్‌పై జరిగిన కత్తిపోట్ల విషయం దావానంలా వ్యాపించడంతో ఈ పాఠశాలలో చదివే వివిధ గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురికావడమే కాకుండా తమ పిల్లలు ఎలా ఉన్నారనే విషయం తెలుసుకోవడానికి చాలా మంది పాఠశాలకు వచ్చారు. పిల్లలతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ భోజరాజు మాత్రం తాను ఆదివారం ట్రైనింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లానని ఇన్చార్జి బాధ్యతలు తెలుగు ఉపాధ్యాయుడు జోహార్‌కు అప్పగించినట్లు తెలిపారు. పాఠశాలను పరిశీలించారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
తాగుబోతు వీరంగం
హాస్టల్ విద్యార్థిపై దాడి కొరవడిన అధికారుల పర్యవేక్షణ అభద్రతాభావంతో విద్యార్థులు బత్తలపల్లి : సంక్షేమ వసతిగహం విద్యార్థులపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. సాయంత్రం నుంచి ఉదయం వరకు వార్డెన్, సిబ్బంది, నైట్‌వాచ్‌మన్ లేకపోవడంతో అభద్రతాభావంతో బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా ఓ తాగుబోతు హాస్టల్లో వీరంగం వేశాడు. పసివాడని కూడా చూడకుండా విద్యార్థిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచాడు. మండలంలోని రాఘవంపల్లికి చెందిన నాగరాజు, ఆదెమ్మల ఏకైక కుమారుడు ఎల్.వాసు బత్తలపల్లిలోని బీసీ సంక్షేమ వసతిగహంలో ఉంటూ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థికి కొంచెం మానసిక స్థితి కూడా సరిగా లేదు. సోమవారం రాత్రి హాస్టల్లో వాసు, అతని స్నేహితుడు గొడవపడ్డారు. స్నేహితుడు సమీపంలోని తాగుబోతు బేల్దారి రాజుకు గొడవ గురించి చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న ఆ బేల్దారి హాస్టల్లోకి వెళ్లి వాసుపై దాడి చేశాడు. ఛాతీపై బలంగా తన్నడంతో బాలుడు గోడకు తగిలి గాయపడ్డాడు. అంతటితో ఆగకుండా బెత్తం తీసుకుని ఇష్టమొచ్చినట్టు బాదడంతో వీపుపై వాతలు పడ్డాయి. ఈ సమయంలో వార్డెన్ గానీ, అటెండర్లు గానీ ఎవ్వరూ లేరు. రక్తపుగాయలతో ఏడుస్తున్న వాసును తోటి స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానికులు గమనించి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన బత్తలపల్లికి చేరుకున్నారు. వార్డెన్‌కు ఫోన్ చేస్తే సరైన స్పందన రాలేదు. దీంతో వారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం తెలిపారు. మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్‌కు చేరుకునే సరికి ముగ్గురు అటెండర్లు విధులకు హాజరయ్యారు. తమ డ్యూటీ ప్రకారం వచ్చి పోతుంటామని అటెండర్లు తెలిపారు. రాత్రిపూట ఎవ్వరూ ఉండం అని చెప్పారు. వార్డన్ అనంతపురంలో కాపురం ఉండడంతో ఆయన కూడా సాయంత్రమే వెళ్లిపోతారన్నారు. తమకు భద్రత కరువైందని ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో పర్యవేక్షిస్తాం తాగుబోతు వీరంగం చేసిన సమయంలో నేను విజయవాడలో ఉన్నాను. హాస్టల్‌కు నైట్ వాచ్మెన్లను ప్రభుత్వం తీసుకోలేదు. విద్యార్థిపై జరిగిన దాడి గురించి నాకు సమాచారం ఇచ్చారు. ఇకపై అటెండర్లతో రాత్రి సమయంలో పర్యవేక్షించేలా చూస్తాం. –శ్రీనివాసులుశెట్టి, వార్డెన్, బీసీ సంక్షేమ వసతిగహం -
హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ (రంగారెడ్డి) : ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థిని ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో సోమవారం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంకు చెందిన శివాని(14) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సోమవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థినిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసి ఉంటుందని తోటి విద్యార్థినులు చెబుతున్నారు.